
నల్లగొండ/నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(SLBC) సొరంగ పనుల సన్నాహకాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టిన వెంటనే టన్నెల్ పైభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో.. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లోపల చిక్కుకుపోయిన సుమారు 40 మంది కార్మికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరికొందరిని బయటకు తీసుచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఆర్మీని సంప్రదించాం: మంత్రి ఉత్తమ్
- టన్నెల్ ప్రమాద ఘటన దురదృష్టకరం
- బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టిన తర్వాత ప్రకంపనలు వచ్చాయి
- టన్నెల్ పూర్తిగా బ్లాక్ అయినట్లు కనిపిస్తోంది
- టన్నెల్‌లో 8 మంది చిక్కుకుపోయారు
- ఆ ఎనిమిది మందిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం
- ఇప్పటికే రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి
- ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని కూడా రప్పిస్తున్నాం
- ఇండియన్ ఆర్మీతో కూడా మాట్లాడాం.. రాత్రికల్లా ఆర్మీ బృందాలు చేరుకుంటాయి
- టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు రంగంలోకి దిగే రెస్క్యూ టీంలతో సంప్రదింపులు జరిపాం
- ఉత్తరాఖండ్‌లో ఈ తరహా సంఘటన చోటు చేసుకున్నప్పుడు పాల్గొన్న బృందాన్ని కూడా ఇక్కడికి రప్పిస్తున్నాం
- లోపల చిక్కుకున్నవారిలో ప్రాజెక్ట్ ఇంజినీర్,సైట్ ఇంజినీర్ తో పాటు మరో ఆరుగురు ఉన్నారు
- టన్నెల్ ప్రమాదంలో ఇద్దరు అమెరికన్ కంపెనీ ఇంజినీర్లు, ఆరుగురు జయప్రకాశ్ అసోషియేట్స్‌ఉద్యోగులు చిక్కుకుపోయారు.
👉సుధీర్ఘ విరామానంతరం తిరిగి ఈ మధ్యే ప్రాజెక్టు పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల కిందటే ఈ ప్రాంతంలో పనులు చేపట్టారు. అయితే ఈ ఉదయం 8.20గం. ప్రాంతంలో బోరింగ్ మెషిన్ మొదలుపెట్టగానే.. సొరంగం ఊగిపోయింది. సొరంగ మార్గం వద్ద ఉన్నట్లుండి సుమారు మూడు మీటర్ల మేర సిమెంట్ సెగ్మెంట్స్ కుంగిపోయాయి. దీంతో కార్మికులు, సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు.
👉నల్లగొండ జిల్లా దేవరకొండ నుంచి SLBC సొరంగ ప్రమాద స్థలానికి బయలుదేరిన ఆరు 108 అంబులెన్సులు.
👉ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సహాయక చర్యలను మంత్రులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్ వద్దకు చేరుకున్న సింగరేణి రిస్క్యూ టీం చేరుకోగా.. ప్రత్యేక ఆక్సిజన్ ద్వారా టన్నెల్ లోకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. లోపల ఉన్న మరో 8 మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకు ముందు..
👉అధికారులతో మంత్రులు ఘటనపై సమీక్ష జరిపారు. ప్రమాదం జరిగిన దృశ్యం భయంకరంగా ఉందని అధికారులు వాళ్లకు వివరించారు.
ఇదీ చదవండి: భూకంపం వచ్చిందన్నట్టుగా ఊగిపోయిన టన్నెల్
ప్రమాదంపై కేటీఆర్ స్పందన
టన్నెల్ ప్రమాదానికి రేవంత్‌దే పూర్తి బాధ్యత. సుంకిశాల ఘటన మరువక ముందే మరో దుర్ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యమే. ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలి.
గుత్తా దిగ్భ్రాంతి
- ఎస్సెల్బీసీ టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి
- క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని సూచన
తుమ్మల ఆరా
- SLBC టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి సంఘటనపై ఆరాతీసిన మంత్రి తుమ్మల
- క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరిన మంత్రి తుమ్మల
టన్నెల్‌లోకి నీరు
టన్నెల్‌లో రింగులు విరిగిపడడంతో.. విద్యుత్ సరఫరా నిలిచి పోగా అధికారులు దానిని పునరుద్ధరించారు. అయితే.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద నాలుగు అడుగుల మేర నీరు చేరింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సింగరేణి నుంచి రెస్క్యూ టీంను రప్పించే పనిలో అధికారులు ఉన్నారు.
బయటకు 42 మంది: మంత్రి జూపల్లి
టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సాక్షితో చెప్పారు. ఇప్పటిదాకా 42 మంది బయటకు వచ్చారని, ఇంకా ఏడుగురు టన్నెల్‌లో ఉన్నారని, వాళ్లనూ బయటకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారాయన.
టన్నెల్ చిక్కుకున్న వాళ్లు
పంజాబ్-గురువీర్ సింగ్
జమ్ము కశ్మీర్- సన్నీసింగ్
జార్ఖండ్- సందీప్, సంతోష్, జట్కా ఇరాన్
ఇద్దరు ఏఈలు.. శ్రీనివాసులు, మనోజ్ రూపేణా
మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది
మంత్రి ఉత్తమ్ ఏమన్నారంటే..
అంతకు ముందు మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. నా దగ్గర ప్రాథమిక సమాచారం మాత్రమే ఉంది. ఒక్కసారిగా టన్నెల్‌లో మట్టి, నీరు వచ్చాయి. లోపల ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియదు. మెజారిటీ కార్మికులను మాత్రం బయటకు తీసుకొచ్చాం అని అన్నారు.
ప్రమాద సమయంలో టన్నెల్‌లో ఎంత మంది కార్మికులు ఉన్నారనే దానిపై స్పష్టత కొరవడింది. అధికారులు, మంత్రులు ఒక్కో లెక్క చెబుతున్నారు. అయితే ఆ కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే!. తొలుత ముగ్గురు కార్మికులను బయటకు తీసుకొచ్చారు. మిలిగిన వాళ్లను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వాళ్లలో అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.
ఉదయం షిఫ్ట్ కోసం కార్మికులు టన్నెల్‌లోకి వెళ్లారు. ఉదయం 8.20గం. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. కార్మికులను బయటకు తీసుకొచ్చి జెన్‌కో ఆస్పత్రికి తరలించాం. మిగతావాళ్లనూ బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
:::మీడియాతో ఎస్పీ వైభవ్
సీఎం రేవంత్ ఆరా
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రులకు సూచించారు. దీంతో మంత్రి ఉత్తమ్ హెలికాఫ్టర్‌లో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి పర్యటన రద్దు చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆ లక్ష్యంతోనే..
నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ(SLBC) సొరంగం ప్రాజెక్టును రూపొందించారు. 2005లో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు నాటి వైఎస్సార్ ప్రభుత్వం రూ. 2,200 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.1925కోట్లతో సుమారు 60 నెలల్లో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ పనులు పొందింది. శ్రీశైలం జలాశయం నుంచి నల్లగొండ జిల్లాకు 30టీఎంసీల కృష్ణ జలాలను తరలించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం.
మూలన పడ్డ పనులు
అయితే టన్నెల్ బోరింగ్ మిషన్‌తో సొరంగం త్రవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులు ఆగుతూ సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురవ్వడం.. నిధుల కేటాయింపులు లేకపోవడంతో సొరంగం ప్రాజెక్టు పనులు 2019 డిసెంబర్ నుంచి మూలపడ్డాయి. అయితే నల్లగొండ మంత్రుల చొరవతో ఈ మధ్యే పనులు మళ్లీ మొదలయ్యాయి. అయితే సుదీర్ఘ విరామానంతరం పనులు జరపడం వల్లే ప్రమాదం జరిగిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఆరుసార్లు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు పనుల గడువును పొడిగించాయి. తాజా గడువు కూడా జూన్ 2026 వరకు ఉంది. 2017లో ఈ ప్రాజెక్టు అంచనాలను రూ.3,152.72కోట్లకు పెంచగా.. ఈ మధ్యే మరోసారి 4,637కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటిదాకా రూ.2,646కోట్లు ఖర్చు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment