
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గ్యాస్ కట్టర్‌లతో టీబీఎం మెషీన్ భాగాలను తొలగిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాటర్‌ను బయటకు పంపే క్రమంలో నిన్న(మంగళవారం) రెస్క్యూ కాస్త ఆలస్యమైందన్నారు. రెస్క్యూలో పాల్గొన్న వారు రిస్క్‌లో పడకూడదన్న నిర్ణయంతో ముందుకు వెళ్తున్నామని ఉత్తమ్ వివరించారు.
‘‘మరో రెండురోజుల్లో ఆచూకీ తెలుసుకుంటాం. వారు బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశాం. టన్నెల్‌లో బురద పేరుకుపోయింది. 15 నుంచి 20 మీటర్ల వరకు బురద నీటితో కూరుకుపోయింది. అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ఒక మానవీయ కోణంపై విపక్షాలు దిగజారి మాట్లాడుతున్నాయి. దేశంలోని అన్ని బెస్ట్ రెస్క్యూ టీములను రప్పించాం’’ అని ఉత్తమ్ తెలిపారు.
కాగా, గల్లంతైన 8 మంది కార్మికులు, ఉద్యోగుల క్షేమంపై ఆశలు ఆవిరవుతున్నాయి. నిన్న కూడా(మంగళవారం) సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లతో కూడిన రెస్క్యూ బృందం ఎట్టకేలకు సొరంగం చివరివరకు చేరుకుని ప్రమాద స్థలంలో విస్తృతంగా గాలించింది. పైకప్పు కూలడంతో పెద్ద మొత్తంలో కిందపడిన బండ రాళ్లు, కంకరతో నిండిపోయిన ఆ ప్రాంతంలో ఎక్కడా కార్మికుల ఉనికి కనిపించలేదు.
ఈ బృందం పూర్తిగా ప్రమాద స్థలానికి చేరుకుని లోపలి నుంచి ల్యాండ్‌లైన్ ఫోన్ ద్వారా బయటకి ఈ సమాచారం అందించగానే కార్మికుల క్షేమంపై అధికారులందరూ దాదాపుగా ఆశలు వదులుకున్నారు. టన్నుల కొద్దీ బండరాళ్లు, కంకర, మట్టి, యంత్రాల తుక్కు కిందే కార్మికులు నలిగిపోయి ఉంటారనే అనుమానాలు మరింతగా బలపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment