
హైదరాబాద్ బిజినెస్ బ్యూరో: గతేడాది డిసెంబర్ చివరినాటికి తెలంగాణలోని మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.4,33,036 కోట్లకు చేరినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రకటించింది. 4.86% వృద్ధితో రూ.20,091 కోట్ల మేర డిపాజిట్లు పెరిగినట్లు తెలియజేసింది. ఈ కాలంలో మొత్తం అడ్వాన్సులు (రుణాలు) 7.28 శాతం పెరిగి రూ.5,15,537 కోట్లకు చేరుకున్నాయి. మంగళవారం ఇక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కార్యాలయంలో జరిగిన 22వ ఎస్‌ఎల్‌బీసీ త్రైమాసిక సమీక్ష సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జే.స్వామినాథన్ మాట్లాడుతూ.. ‘క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి (సీడీ రేషియో) 100% పైనే ఉంది. తాజాగా 119.05 శాతానికి చేరుకుంది. ఎంఎస్‌ఎంఈ విభాగం అనుకున్న విధంగా 134.31 శాతానికి చేరింది. ముద్రా రుణాలు సైతం నిర్థేశిత లక్ష్యం మేర పెరిగాయి’ అని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనరు, ఎస్‌బీఐ జీఎం ఉన్ మయ్యాతో పాటు ఆర్‌బీఐ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, జనరల్ మేనేజర్ ఎస్.శంకర్, తెలంగాణ ప్రభుత్వ అధికారులు సందీప్ సుల్తానియా, రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment