దేశంలోనే అతి పెద్ద బ్యాంకులో డబ్బుల్లేవంట..!
దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో అత్యధిక శాఖలు ఉన్న బ్యాంక్ ఇది. ఇటీవల ఎస్‌బీఐ ఏటీఎంలు జిల్లాలో తరచూ మూతపడుతున్నాయి. బ్యాంకు శాఖల్లోనూ నగదు విత్ డ్రాలకు సంబంధించి కార్యకలాపాలు ఆలస్యమవుతున్నాయి. ఎందుకంటే బ్యాంక్‌లో నగదు లేదంట. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
నిడదవోలు : జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలు తరచూ మూతపడుతున్నాయి. దీంతో ఖాతాదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని ఏలూరు సహా నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నరసాపురం ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. నిడదవోలులో వారం రోజులుగా ఏటీఎంలలో నగదు లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు బ్యాంక్ శాఖలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విత్ డ్రా కోసం వెళితే వివిధ రకాల డిపాజిట్లు జమయ్యే వరకు వేచి ఉండాల్సి వస్తోంది. జమైన మొత్తాలను విత్ డ్రా దరఖాస్తుదారులకు ఇస్తున్నారు. దీంతో ఆర్థిక అవసరాలు తీరక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ పరిస్థితి ఎందుకంటే..
దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ నగదును సరఫరా చేస్తుంది. అయితే ఇటీవల అక్కడి నుంచి సరఫరా మందగించినట్టు బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ కావడంతో ఖాతాదారుల సంఖ్య అత్యధికంగా ఉంటారు. అన్ని బ్యాంకులకు నగదు సరఫరా తగ్గినా స్టేట్ బ్యాంక్‌కు మాత్రం ఖాతాదారుల సంఖ్య ఎక్కువ కావడంతో అందరికీ సకాలంలో నగదు అందని పరిస్థితి ఏర్పడింది. మార్చి నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం ముగియడంతో రిజర్వు బ్యాంక్‌లో ఆర్థిక లావాదేవీలు, ఇతర సమస్యలు కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.
దీంతో పాటు గతంలో ఏటీఎం కార్యాలయాలకు ఆయా శాఖల నుంచి నగదును పంపించేవారు. అయితే గతేడాది నుంచి ఈ బాధ్యతను కొన్ని ప్రధాన శాఖలకు మాత్రమే అప్పగించారు. ఉదాహరణకు మొగల్తూరులో స్టేట్ బ్యాంక్ కు గతంలో దగ్గరలోని నరసాపురం స్టేట్ బ్యాంక్ బ్రాంచి నుంచి నగదు వచ్చేది. ఇప్పుడు పాలకొల్లు నుంచి వస్తోంది. నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లోని బ్యాంకులు, ఏటీఎంలకు పాలకొల్లు నుంచి నగదు రావాల్సి రావడంతో వారానికి ఒక్కరోజు మాత్రమే పంపిస్తున్నారు. దీంతో ఆ నగదునే మొగల్తూరు శాఖ అధికారులు పొదుపుగా వాడాల్సి వస్తోంది. దీంతో లక్ష రూపాయలు పైబడి నగదు చెల్లింపులు ఇవ్వడం లేదు. దీంతో వ్యాపారులు, ఖాతాదారులు ఘొల్లుమంటున్నారు.
నిడదవోలులో వారం రోజులుగా నగదు నిల్
నిడదవోలు పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలలో వారం రోజులుగా నగదు లేకపోవడంతో ఖాతాదారులు నానాఅవస్థలు పడుతున్నారు. పండగ పూట కూడా ఆర్థిక అవసరాలు తీరక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు ఉన్నాయి. ఏడు చోట్ల ఏటీఎం సెంటర్లు ఉన్నాయి.
ఈ రెండు బ్యాంకుల్లో కలిపి దాదాపు 20 వేలకు పైగా ఖాతాదారులు ఉన్నారు. ఏడు రోజులుగా నగదు లేక ఏటీఎంలు మూతపడ్డాయి. బ్యాంకులో కూడా నగదు అరకొరగానే ఇస్తున్నారు. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అన్ని స్టేట్ బ్యాంక్ శాఖల్లోనూ ఇంచిమించు ఇదే పరిస్థితి ఉంది. ఇక మిగిలిన బ్యాంకుల విషయానికి వస్తే వాటిల్లో కూడా కొన్ని బ్యాంక్‌లలో నగదు లావాదేవీలు బాగా ఆలస్యమవుతున్నాయని ఖాతాదారులు తెలిపారు.
బ్యాంకులో నగదు లేదు
బ్యాంకులో నగదు లేకపోవడంతో ఖాతాదారులకు ఇవ్వలేకపోతున్నాం. రిజర్వు బ్యాంకులో నగదు కొరత ఏర్పడడంతో ఈ సమస్య తలెత్తింది. ఏటీఎంలలో నగదు పెట్టలేకపోతున్నాం. రిజర్వు బ్యాంకు నుంచి ఎప్పుడు నగదు వస్తుందో కూడా సమాచారం లేదు. ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా డిపాజిట్ చేసిన నగదును విత్‌డ్రాదారులకు అందజేస్తున్నాం.
- వి.నరసింహరావు, స్టేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్, నిడదవోలు