ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి. చిత్రంలో హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: రైతుల పక్షాన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని, పదేళ్ల కాలంలో రెండుసార్లు రైతులకు పంట రుణాలు మాఫీ చేసి రికార్డు సృష్టించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గినప్పటికీ రైతుల ప్రయోజనం కోసం రుణమాఫీ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
తాజాగా రాష్ట్రంలోని 37 లక్షల మందికి రూ.20,141 కోట్ల మేర రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు రూ.99,999 వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ అమలు చేశామని, రూ.16.66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8,098 కోట్లు జమ అయ్యాయని వివరించారు. రుణమాఫీ, రెన్యువల్ తీరును పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ఆర్థిక, వ్యవసాయ శాఖ కార్యదర్శులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు ఉంటారని తెలిపారు.
సోమవారం బేగంపేటలోని వివాంటా హోటల్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్‌ఎల్‌బీసీ) జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు.
ఆ ఘనత ముఖ్యమంత్రిదే..!
దేశంలో పలు రాష్ట్రాలు రుణమాఫీ అంశంపై అనేక పరిమితులు విధించాయని, కానీ ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రమే అని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ మినహా మరే రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. రుణమాఫీతో రైతుకు భారీ ఊరట లభిస్తుందని అన్నారు.
ఒకవేళ రైతు రుణ మొత్తాన్ని చెల్లించి ఉంటే ఆ మేరకు నగదును రైతుకు ఇవ్వాలని సూచించారు. కొందరు రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు వంటి పాత రుణాలు ఉండొచ్చని, ఇప్పుడు వచ్చిన డబ్బులను పాత అప్పు కింద జమ చేయకూడదని స్పష్టం చేశారు. రుణమాఫీ ప్రక్రియను నెలరోజుల్లోగా పూర్తి చేసేలా బ్యాంకులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు.
రైతు సంక్షేమం ధ్యేయంగా, ఆర్థిక భారాన్ని మోస్తూ రైతు రుణమాఫీని సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే అభివృద్ధి సాధించలేమన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి మార్చేశారని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment