‘రుణమాఫీ సొమ్ము విడుదల చేసి నెలలు గడిచినా ఇంకా కొన్ని బ్యాంకు బ్రాంచీల్లో రైతు ఖాతాల్లో జమ చేయలేదు. డబ్బు ఇచ్చాక కూడా ఇలాగైతే ఎలా’ అని పోచారం బ్యాంకర్లను నిలదీశారు. రుణాలు తీసుకున్న ప్రతీ రైతు నుంచి బీమా ప్రీమియం మినహాయించాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు.
రూ. 1.14 లక్షల కోట్లు
రాష్ట్ర రుణ ప్రణాళిక విడుదల చేసిన ఎస్‌ఎల్‌బీసీ
రాష్ట్ర రుణ ప్రణాళిక ఖరారైంది. 2017–18లో పలు రంగాలకు రూ.1,14,353 కోట్ల మేర రుణాలివ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. శుక్రవారం ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి వార్షిక ప్రణాళికను విడుదల చేశారు. రాష్ట్ర రుణ ప్రణాళికలో సగం, అంటే రూ.54,198 కోట్లు వ్యవసాయ రుణాలే ఉండటం గమనార్హం. ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.39,752 కోట్ల పంట రుణాలివ్వాలని ఎస్‌ఎల్‌బీసీ లక్ష్యంగా పేర్కొంది. ఇందులో ఈ ఖరీఫ్‌లో రూ.23,851 కోట్లు, రబీలో రూ.15,901 కోట్లిస్తామని పేర్కొంది. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు రూ.14,446 కోట్లివ్వాలని వెల్లడించింది. గతేడాది పంట రుణ లక్ష్యం రూ.29,101 కోట్లు మాత్రమే! చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.16,465 కోట్లు (గతేడాది 10,807 కోట్లు), విద్యా రుణాలు రూ.1,663 కోట్లు (గతేడాది రూ.731 కోట్లు), గృహ రుణాలు రూ.3,885 కోట్లు (గతేడాది రూ. 2,189 కోట్లు) కేటాయించారు.
వరికి అత్యధికంగా రూ.16,690 కోట్ల రుణాలు: ఈ ఏడాది ఖరీఫ్, రబీల్లో ఇవ్వబోయే రూ.39,752 కోట్ల పంట రుణాల్లో అత్యధికంగా వరికి రూ.16,690 కోట్లివ్వాలని ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయించింది. 19.18 లక్షల మంది వరి రైతులకు రుణాలిస్తారు. తర్వాత పత్తికి 7.48 లక్షల మంది రైతులకు రూ.6,809 కోట్లు; మొక్కజొన్నకు రూ.2,311 కోట్లు, జొన్న, సజ్జలకు రూ. 2,052 కోట్లు, పప్పుధాన్యాల పంటలకు రూ.1,770 కోట్లు ఇస్తారు.
యాంత్రీకరణకు రూ.2,657 కోట్లు..: వ్యవసాయ యాంత్రీకరణకు రూ.2,657 కోట్లు కేటాయించనున్నారు. రైతులు తీసుకునే వ్యవసాయ యంత్రాలకు బ్యాంకులు రుణాలిస్తాయి. ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లకు రూ.1,694 కోట్లు, హార్వెస్టర్లకు 336 కోట్లిస్తారు. భారీ పరిశ్రమలకు రూ.7,340 కోట్లు, డెయిరీకి 2,002 కోట్లు, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లకు 1,029 కోట్లు, కోళ్ల పరిశ్రమకు 729 కోట్లు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లకు 308 కోట్లు, చేపల పెంపకానికి 120 కోట్లు, పాల శీతలీకరణ ప్లాంట్లకు 81 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.88.35 కోట్లు కేటాయించారు.