సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) ప్రకటించింది. 2021–22 సంవత్సరానికి రాష్ట్రంలో ఇచ్చే రుణాల వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది మొత్తంగా రూ.1,86,035.60 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని 79.37 లక్షల మంది లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు సమక్షంలో జరిగిన ఎస్‌ఎల్‌బీసీ 29వ సమావేశంలో రుణ ప్రణాళికను బ్యాంకర్లు ఆమోదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చే రుణాల్లో రూ.91,541 కోట్లు వ్యవసాయ రుణాలే కావడం గమనార్హం. మొత్తం రుణాల్లో 49.20 శాతం వ్యవసాయ రుణాలే ఇవ్వనున్నారు. అందులో రైతులకు వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి రూ.59,440.44 కోట్ల పంట రుణాలు ఇస్తారు. అందులో నిర్వహణ, మార్కెటింగ్‌కు సంబంధించినవి కూడా ఉంటాయి. ఇవికాక వ్యవసాయంలో పెట్టుబడులు, అనుబంధ రంగాల్లో ఖర్చులు, మౌలిక సదుపాయాలు తదితరాల కోసం టర్మ్ లోన్లు ఇస్తారు. మొత్తంగా వ్యవసాయ రుణాలు 63.67 లక్షల మంది రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో పంట రుణాలే 55.74 లక్షల మందికి ఇస్తారు. చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్ కోసం, విద్య, గృహ రుణాలను కూడా ఎస్‌ఎల్‌బీసీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
సకాలంలో రైతులకు రుణాలు ఇవ్వండి: హరీశ్
రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు బ్యాంకర్లను కోరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఒక్క వారంలోనే దాదాపు 61 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.7,360 కోట్లు పైగా జమ చేశామని చెప్పారు. బ్యాంకర్లు పంట రుణాలను జాప్యం లేకుండా రైతులకు అందేలా చూడాలని కోరారు. చిన్న వ్యాపారులకు మరిన్ని ముద్రా రుణాలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్, తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందన్నారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ మిశ్రా, ఆర్‌బీఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డ్ సీజీఎం వై.కృష్ణారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment