loans to Farmers
-
రైతులకు మరిన్ని రుణాలందించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో బ్యాంకులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కొనియాడారు. రైతులకు పంట రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కౌలు రైతులకు మరిన్ని రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరారు. సచివాలయంలో మంగళవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) 220వ సమావేశం మంత్రి బుగ్గన అధ్యక్షతన జరిగింది. ఇందులో ప్రధానంగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక అమలులో బ్యాంకులు సాధించిన ప్రగతి, సూచికలవారీ సాధించిన లక్ష్యాలు తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. సూక్ష, చిన్నతరహా, మధ్యతరహా రంగాలు (ఎంఎస్ఎంఈ)పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఆ రంగంలో కూడా బ్యాంకులు సహకరించాలని కోరారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలన్నారు. అలాగే టిడ్కో గృహాలు, ఇతర గృహనిర్మాణ పథకాల లబ్ధిదారులకు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరులో పూర్తి తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను కోరారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ నవనీత్ కుమార్ జూన్ 30 వరకు బ్యాంకులు సాధించిన ప్రగతిని వివరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్, కంట్రీ హెడ్ ఫర్ అగ్రికల్చర్ శ్రీనివాసరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.రావత్, ఎస్ఎల్బీసీ కన్వీనర్, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఇన్చార్జి అనిల్ మిశ్రా, నాబార్డు జీఎం ఎన్ఎస్ మూర్తి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, వివిధ బ్యాంకులు, శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక రూ.1.86 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) ప్రకటించింది. 2021–22 సంవత్సరానికి రాష్ట్రంలో ఇచ్చే రుణాల వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది మొత్తంగా రూ.1,86,035.60 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని 79.37 లక్షల మంది లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం బీఆర్కేఆర్ భవన్లో ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు సమక్షంలో జరిగిన ఎస్ఎల్బీసీ 29వ సమావేశంలో రుణ ప్రణాళికను బ్యాంకర్లు ఆమోదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చే రుణాల్లో రూ.91,541 కోట్లు వ్యవసాయ రుణాలే కావడం గమనార్హం. మొత్తం రుణాల్లో 49.20 శాతం వ్యవసాయ రుణాలే ఇవ్వనున్నారు. అందులో రైతులకు వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి రూ.59,440.44 కోట్ల పంట రుణాలు ఇస్తారు. అందులో నిర్వహణ, మార్కెటింగ్‌కు సంబంధించినవి కూడా ఉంటాయి. ఇవికాక వ్యవసాయంలో పెట్టుబడులు, అనుబంధ రంగాల్లో ఖర్చులు, మౌలిక సదుపాయాలు తదితరాల కోసం టర్మ్ లోన్లు ఇస్తారు. మొత్తంగా వ్యవసాయ రుణాలు 63.67 లక్షల మంది రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో పంట రుణాలే 55.74 లక్షల మందికి ఇస్తారు. చిన్న, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ కోసం, విద్య, గృహ రుణాలను కూడా ఎస్ఎల్బీసీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సకాలంలో రైతులకు రుణాలు ఇవ్వండి: హరీశ్ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు బ్యాంకర్లను కోరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఒక్క వారంలోనే దాదాపు 61 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.7,360 కోట్లు పైగా జమ చేశామని చెప్పారు. బ్యాంకర్లు పంట రుణాలను జాప్యం లేకుండా రైతులకు అందేలా చూడాలని కోరారు. చిన్న వ్యాపారులకు మరిన్ని ముద్రా రుణాలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్, తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందన్నారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ మిశ్రా, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డ్ సీజీఎం వై.కృష్ణారావు పాల్గొన్నారు. -
రైతన్నకు శుభవార్త
కల్వకుర్తి : రైతన్నకు ప్రభుత్వం మరో శుభవార్త ఇచ్చింది. బ్యాంకులిచ్చే పంట రుణాలు పెరిగాయి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరానికి 2 నుంచి 5 శాతం పెంచింది. ధాన్యం, చిరు ధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటలకు రుణాలు పెరిగాయి. బ్యాంకు అధికారులు ప్రతి ఏటా ఖరీఫ్, రబీలో రైతులు వేసుకున్న పంటల ఆధారంగా రుణాలు ఇస్తుంటారు. వాటికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. 2018–19 ఏడాదికి పెంచిన దాని ప్రకారం రుణాలివ్వాలని ప్రభుత్వం ఇటీవలే అన్ని బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది. పంట పెట్టుబడికి రుణాలు రైతులు పంటలు సాగు చేసే ముందు పెట్టుబడికి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. పంట సాగును పరిగణలోకి తీసుకుని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇస్తుంటారు. ఖరీఫ్, రబీల ముందు రైతులకు పహాణి, పాసుపుస్తకాలు పరిశీలించి రుణాలు అందజేస్తారు. సకాలంలో చెల్లిస్తే వడ్డీ మాఫీ సైతం ఉంటుంది. బ్యాంకులు రైతులకు అందించే రుణాలును పంటల పెట్టుబడి వ్యయం దృష్టిలో ఉంచుకొని రుణం పెంచుతుంటారు. ఏటా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వివిధ పంటలకు ఇచ్చే రుణాలను వివరిస్తూ ఖరీఫ్ ముందు ఉత్తర్వులు అందిస్తుంది. ఇదీ.. ప్రయోజనం ప్రధాన పంటైన వరికి గతేడాది ఎకారానికి రూ.30వేలు రుణం ఇచ్చేవారు. ఈ ఏడాది రూ.34 వేలు ఇవ్వనున్నారు. వరిసీడ్కు రూ.40వేల నుంచి రూ.42వేలకు పెంచారు. అలాగే పత్తి పంటకు రూ.30వేల నుంచి రూ.35వేలకు పెంచారు. అదేవిధంగా పత్తి సీడ్ పంట సాగుకు రూ.1.26 లక్షలు ఇవ్వనున్నారు. మొక్కజొన్నకు రూ.28వేలు, మిర్చికి రూ.58వేలు, వేరుశెనగకు ఎకరానికి రూ. 23వేలు, జొన్న పంటకు రూ.16వేలు, వర్షాధార కంది పంటకు రూ.14వేలు, బోరుకింద సాగు పంటకు రూ.18వేలు ఇవ్వనున్నారు. ఆముదం పంటకు రూ.11వేల వరకు పెంచారు. ఉల్లిగడ్డకు రూ.25వేల నుంచి రూ.30వేలకు పెరిగింది. సన్‌ప్లవర్ పంటకు రూ.18వేలు ఇవ్వనున్నారు. పండ్ల తోటలు, కూరగాయలు పెంచిన రుణం పండ్ల తోటలు, కూరగాయలకు సైతం వర్తిస్తుంది. బోరు కింద సాగు చేసే టమాటాకు ఎకరానికి రూ.35వేలు, వర్షాదారానికి సాగు చేసే టమాటాకు రూ.30వేలు, పండ్ల తోటలు మామిడికి రూ.35వేలు, బత్తాయికి రూ.38వేలు, సపోటా తోటకు రూ.30వేలు, జామ రూ30వేలు, గ్రేప్స్ రూ.90వేలు, పుచ్చకాయలు రూ.22వేలు బొప్పాయికి రూ. 52వేలు ఇవ్వనున్నారు. పెరిగిన రుణసాయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మాఫీ కోసం నిరీక్షణ
రెండో కంతు చెల్లించని ప్రభుత్వం రుణమాఫీ కోసం అన్నదాతల ఎదురుచూపు మాటలతో సరిపెడుతున్న వైనం చిత్తూరు: రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఎన్నికల్లో ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్నదాతలను వంచించి అరకొర రుణమాఫీతో సరిపెట్టారు. పోనీ, ఇస్తామన్న మొత్తమైనా చెల్లించారా అంటే అదీలేదు. తొలి కంతుతోనే చెల్లుచీటీ పలికారు. బాబు పాలనకు రెండేళ్లు కావస్తున్నా రెండోకంతు సంగతి తేల్చడం లేదు. త్వరలోనే ఇస్తామని చెప్పి ఇంతవరకు పైసా కూడా ఇవ్వలేదు. అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తామంటూ ముఖ్యమంత్రితోపాటు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పలుమార్లు హామీ ఇచ్చినా ఆచరణలో ముందడుగు పడడం లేదు. దీంతో బ్యాంకులు రుణ బకాయిలు చెల్లించాలంటూ రైతులపై ఒత్తిడి పెంచాయి. బకాయిలు చెల్లించని వారికి నోటీసులు జారీచేసి బలవంతపు వసూళ్లకు దిగాయి. కొన్నిచోట్ల గడువు తీరిన బంగారాన్ని వేలం వేశాయి. ఇంత జరుగుతున్నా బాబు సర్కార్ రుణమాఫీ రెండో కంతు సంగతి పట్టించుకోలేదు. బలవంతపు వసూళ్లకు పాల్పడవద్దని కనీసం బ్యాంకులను ఆదేశించలేదు. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. జిల్లావ్యాప్తంగా 2013 డిసెంబర్ 31 నాటికి వివిధ బ్యాంకుల్లో 7,43,158 మంది రైతులు రూ.5,404.30 కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే ప్రభుత్వం కేవలం 3,67,893 మంది రైతులే రుణమాఫీకి అర్హులంటూ లెక్కలు తేల్చింది. రూ.50 వేల లోపు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తున్నామని, రూ.50వేలు నుంచి 1.5 లక్షల రుణాలను నాలుగు కంతుల్లో మాఫీచేస్తామని ప్రకటించింది. రూ.50 వేలు లోపు మాఫీ చేశామని ప్రభుత్వం ప్రకటించినా వాస్తవానికి వాటిల్లో 50 శాతం రుణాలను కూడా మాఫీ చేయలేదు. ఇక రూ.50 వేల పైన రుణాలకు సంబంధించి కేవలం తొలి కంతు మాత్రమే బ్యాంకుల్లో జమ చేసిన ప్రభుత్వం మిగిలిన మూడు కంతుల సంగతిని గాలికొదిలేసింది. రుణమాఫీ కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం బాండ్ల రూపంలో జమ చేస్తుందని భావించిన బ్యాంకులకు చుక్కెదురైంది. దీంతో ఆగ్రహించిన బ్యాంకులు రుణాల వసూళ్ల కోసం రైతులపై ఒత్తిడి పెంచాయి. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాను పరిశీలిస్తే మొదటి విడతలో రూ.50 వేల లోపు రుణం తీసుకున్న వారు 2,31,388 మంది ఉండగా, రూ.50 వేలకు పైగా తీసుకున్న వారు 1,04,495 మంది. రెండో విడతలో రూ.50 వేలకు లోపు 13,765 మంది రుణం తీసుకోగా, రూ.50వేలకు పైగా 9,093 మంది, మూడవ విడతలో రూ.50వేల లోపు తీసుకున్న వారు 6,232, రూ.50వేలకు పైగా 2,920 మంది ఉన్నారు. మొత్తం మూడు విడతల్లో రూ.50 వేల లోపు వారు 2,51,385 మంది ఉండగా, 50వేలకు పైగా రుణం తీసుకున్న వారు 1,16,508 మంది ఉన్నారు. ఈ లెక్కన మొత్తం రుణం తీసుకున్న రైతులు 3,67,893 మంది ఉన్నారు. వీరికి రూ.513.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే 50 వేల లోపు రుణాలు తీసుకున్న 2,51,385 మందిలో సగం మందికి కూడా రుణమాఫీ జరిగిన దాఖలాల్లేవు. మిగిలిన వారికి రూ.50 వేల వంతున చెల్లించాల్సి ఉంది. దీంతోపాటు రూ.50వేలకు పైగా రుణం తీసుకున్న 1,16,508 మందికి ఇప్పటివరకు మొదటి కంతుకు మాత్రమే జమచేసిన ప్రభుత్వం మిగిలిన మూడు కంతుల మొత్తం ఎప్పుడు చెల్లిస్తుందో తెలియక రైతులు ఆందోళనలో ఉన్నారు. -
ఆందోళనను ‘ఈవెంట్’ అంటారా?
పింఛన్ల తొలగింపు, రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ చేయకపోవడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 5న వైఎస్సార్సీపీ అన్ని జిల్లా కేంద్రాల్లో చేయతలపెట్టిన మహాధర్నాలు ఈవెంట్ మేనేజర్ల సహకారంతో చేస్తున్నారని టీడీపీ అనుకూల పత్రిక ఒకటి రాసిన కథనాన్ని సురేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాన్ని ‘ఈవెంట్’ అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవెంట్ మేనేజర్ల అవసరం తమకు లేదని, చంద్రబాబు విదేశీ పర్యటనలూ, ఆయన చేసుకునే ప్రచారార్భాటానికే వారి సహకారం తీసుకుంటున్నారని విమర్శించారు. -
ప్రస్తుతానికి 20% రుణాలే చెల్లింపు
మిగతా రుణాలన్నీ నాలుగు దఫాలుగా చెల్లిస్తాం: సీఎం చంద్రబాబు జనవరి నుంచి రైతు సాధికారిత సంస్థ ద్వారా రుణాలు కేసీఆర్ అనుభవ రాహిత్యంతోనే తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాలు నెల్లూరు: రైతుల రుణాల్లో ఈ నెల 22న 20 శాతం, మిగతావి పది శాతం వడ్డీతో నాలుగు విడతలుగా బ్యాంకులకు చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. నెల్లూరు రూరల్ మండలం వెంకటేశ్వపురం పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో, వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాలను రీ షెడ్యూల్ చేరుుస్తానని, రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవచ్చని అన్నారు. జనవరి నుంచి రైతు సాధికారిత సంస్థ ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డ్వాక్రా రుణాల మాఫీలో భాగంగా రూ.10 వేలు చొప్పున చెల్లించనున్నామన్నారు. వడ్డీ మొత్తాన్ని చెల్లించడంతో పాటుగా తిరిగి వడ్డీ లేని రుణాలిప్పిస్తామని చెప్పారు. నాలుగు నెలల్లో 900 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం ద్వారా విద్యుత్ కోతలను అధిగమించామని చంద్రబాబు పేర్కొన్నారు. జూన్ నుంచి మరో 2వేల మెగావాట్ల విద్యుత్‌ను కొంటున్నామన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కర్నూలు, అనంతపురంలలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. 4 వేల మెగావాట్లు ఉత్పత్తి చేసే ఎన్టీపీసీని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం ద్వారా, అందులో 85 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేలా రూపకల్పన చేశామని చెప్పారు. కృష్ణపట్నంలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. దాన్ని కూడా ఉపయోగించుకుని 24 గంటలూ ప్రజలకు విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుభవ రాహిత్యంతో ఆ రాష్ట్ర ప్రజలు కరెంటు కష్టాలు పడుతున్నారని విమర్శించారు. సభలో ఎర్రచందనం దొంగలున్నారా: సీఎం వెలుగొండ అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్ల భరతం పడతానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. డక్కిలి గురుకుల కళాశాల గ్రౌండ్లో మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారి తోకలైనా కత్తింరించడం ఖాయమన్నారు. వీరు శేషాచలం, వెలుగొండ అడవులు మొదలకుని హిమాచలం వరకు ఎర్రచందనం నరికి చెన్నైకి తరలిస్తున్నారన్నారు. ఈ సభలో ఎవరైనా ఎర్రచందనం దొంగలు ఉన్నారా అని అడిగారు. దీంతో ప్రజా ప్రతినిధులు సీఎం వైపు చూసి మిన్నకుండిపోయారు. పారిశ్రామిక, పర్యాటక హబ్‌గా నెల్లూరు నెల్లూరు జిల్లాలో సమృద్ధిగా వనరులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని జిల్లాను పారిశ్రామిక, పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని బాబు అన్నారు. వెంకటగిరి నుంచి ఏర్పేడు వరకు ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు పింఛనుదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. డక్కిలి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు.రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
రైతులూ.. రుణాలు చెల్లించొద్దు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీపై నాదీ భరోసా.. అప్పులన్నీ నేనే చెల్లిస్తా ఏ బ్యాంకరూ మీ ఇంటి వద్దకు రాకుండా, ఆస్తులు జప్తు చేయకుండా చూసే బాధ్యత నాది మాఫీకి కేంద్రం, ఆర్బీఐ మోకాలడ్డుతున్నాయి వర్షాకాలానికల్లా హంద్రీ-నీవా పూర్తి చే సి సీమ జిల్లాలకు నీరందిస్తాం పింఛన్ నిబంధనల్లో ‘అనంత’కు సడలింపు కాంగ్రెస్ నేతలు చెల్లని కాసుల్లాంటి వాళ్లు అనంతపురం: రాష్ట్రంలో రైతులు రుణాలు చెల్లించవద్దని సీఎం నారా చంద్రబాబునాయుడు చెప్పారు. రుణ మాఫీ విషయంలో పూర్తి భరోసా తనదేనన్నారు. రైతుల భారాన్ని భుజస్కంధాలపై మోస్తానని, అప్పులన్నీ చెల్లిస్తానన్నారు. ఏ బ్యాంకరూ రైతుల ఇంటి వద్దకు రాకుండా, ఆస్తులు జప్తు చేయకుండా చూసే బాధ్యత తనదేనని తెలిపారు. సోమవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురంలో జరిగిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే లక్ష్యంతో ఏర్పాటైన ‘ప్రాథమిక రంగ వ్యవసాయ మిషన్’ను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంతో కలసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతపురంలో ప్రారంభించనున్న నూనె గింజల పరిశోధన కేంద్రం, కనగానపల్లి మండలంలో ఏర్పాటు చేసే గోరుచిక్కుడు, జిగురు పరిశ్రమలు, నంబులపూలకుంటలో ఏర్పాటు చేసే వేరుశనగ విత్తన ఉత్పత్తి, పరిశోధన కేంద్రాల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి వాట ర్ ప్లాంటునూ ప్రారంభించారు. ఈ సందర్భంగా గరుడాపురంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అధ్యక్షతన జరిగిన సభలో బాబు ప్రసంగించారు. ‘గత ఏడా ది నేను చేసిన పాదయాత్రంలో జిల్లాలోని చిప్పగిరి రైతుల కష్టాలను చూసి చలించిపోయి రుణమాఫీ హామీ ఇచ్చా. తర్వాత రాష్ట్రం విడిపోవడంతో రూ.15 వేల కోట్ల ఆర్థిక లోటు ఏర్పడింది. రుణ మాఫీకి కేంద్రం, ఆర్బీఐల నుంచి సహకారం లేదు. అయినా వెన క్కు తగ్గేది లేదు. ఈ నెల 22లోగా రైతు రుణాల్లో 20 శాతం బ్యాం కులకు జమ చేస్తాను. రుణాలు రీషెడ్యూల్ చేసి, ఫిబ్రవరి నాటికి కొత్త రుణాలు ఇప్పిస్తాను. మిగిలిన రుణాలను నాలుగేళ్లలో నాలుగు విడతల్లో సాధికార సంస్థ ద్వారా చెల్లిస్తాం. ఇందుకోసం అప్పులు తీసుకొస్తాం’’ అని చెప్పారు. మహిళా రుణాలను రద్దు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రతి మహిళకు రూ.10 వేల సహా యాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ఎవరైనా బ్యాం కులకు వడ్డీ చెల్లించివుంటే వెనక్కి తిరిగి ఇచ్చేలా చూస్తామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రాథమిక రంగ వ్యవసాయమిషన్ను ప్రారంభించానన్నారు. రాష్ట్రంలో బిందు, తుంపర్ల సేద్యాలను ప్రోత్సహిస్తామని చెప్పారు. అనంతపురం జిల్లాలో గతంలో ఐదు ఎకరాలకు మాత్రమే బిందు, తుంపర్ల సేద్య పరికరాలకు సబ్సిడీ ఇచ్చేవాళ్లని, ఇప్పుడు పదెకరాల వరకు ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, మిగిలిన రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఇతర జిల్లాల రైతులకు 50 శాతం సబ్సిడీతో పరికరాలు అందిస్తామన్నారు. ఎన్ని కోట్లు ఖర్చయినా వచ్చే వర్షాకాలంనాటికి హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి చేసి సీమ జిల్లా ప్రజలకు సాగు, తాగు నీరు అందిస్తామని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి హెచ్ఎల్సీ కాలువను వెడల్పు చేసి 32.5టీఎంసీల తుంగభద్ర నీటినీ రాష్ట్రానికి రప్పిస్తామని చెప్పారు. అనంతపురం జిల్లాలో వాటర్ గ్రిడ్ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు కాలువలను అనుసంధానం చేయడానికి అనంతపురం జిల్లా నుంచే వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బాబు ప్రకటించారు. ఈ గ్రిడ్‌కు రూ.1,500 కోట్లు ఖర్చు చేసైనా జిల్లాలోని ప్రతి ఇంటికీ నీటిని అందిస్తానన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు.అయిదెకరాల పొలం ఉన్న వారికి పింఛను ఇవ్వకూడదన్న నిబంధనను అనంతపురం జిల్లావాసులకు సడలించి, పదెకరాలకు పెంచుతున్నామని చెప్పా రు. రాగి సంగటి, జొన్న రొట్టెలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. దేశానికి ఎంతో ఖ్యాతిని తెచ్చిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ నేతలు చెల్లని కాసులవంటి వారని, మేఘమథనంలో డబ్బులు దోచుకున్న వారు సైతం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మం త్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మిషన్లుంటే సరిపోదు.. రైతుకు ఫలితం అందాలి: కలాం మిషన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, వాటి ఫలాలు రైతులకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే విప్లవాత్మక మార్పులు తేవాలని సూచించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురంలో సోమవారం నిర్వహించిన ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమంలో ఆయన ప్రాథమిక రంగ వ్యవసాయ మిషన్‌ను ప్రారంభించారు. ఇక్రిశాట్ డెరైక్టర్ విలియమ్స్ డార్ రూపొందించిన ‘నిరుపేద కంచంలో నిండైన భోజనం’ అనే పుస్తకాన్ని కలాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. అనంతపురం జిల్లాలో సాగు విధానంలోనూ ఎంతో వైవిధ్యం ఉందని చెప్పారు. ‘నాకు రెక్కలు ఉన్నాయి.. ఎగురగలను..’ అని అనంత ప్రజలు భావిస్తే.. ప్రగతి సాధిస్తారన్నారు. ఐదేళ్ల తరువాత జిల్లాలోని ప్రతి గ్రామం అద్భుత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ‘అందరం వ్యవసాయాన్ని ప్రేమిస్తాం’ అని సభకు హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. -
రుణమాఫీపై ఆశలు
సాక్షి, ఒంగోలు: పండగ రోజుల్లో పల్లెల్లో దైన్యం నెలకొంది. పంట రుణాల మాఫీపై రైతులు గంపెడాశతో ఉన్నారు. పీక ల్లోతు అప్పుల్లో కూరుకున్న వారు పాతరుణాలు మాఫీ అయితే.. కొత్త రుణాలొస్తాయని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పథకం అమల్లో పట్టీపట్టనట్టు వ్యవహరించడంతో.. క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు కూడా రైతులకు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. రుణమాఫీ అమలు విధివిధానాల మేరకు ప్రభుత్వం సూచించిన వివరాల కంప్యూటరీకరణపై బ్యాంకులు నిర్లక్ష్యం చూపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు మండలాల నుంచి బాధిత రైతులు సోమవారం ఒంగోలులో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై కలెక్టర్‌కు బ్యాంకర్లపై ఫిర్యాదులిచ్చారు. రైతుల రుణాలకు సంబంధించి సమగ్ర వివరాలను ‘ఆన్లైన్’లో పొందుపరచడంపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందినా.. బ్యాంకర్ల తీరులో మార్పుకనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రతీ ఒక్క రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు పంటరుణం మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 7.5 లక్షల రైతుల రుణాల ఖాతాలుండగా, వాటిల్లో సుమారు రూ.3,600 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని అధికారుల అంచనా. రైతుల పేరుతో కొంతమంది బినామీలు తీసుకున్న రుణాల్ని గుర్తించేందుకు విధాన నిర్ణయాలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఆమేరకు సమగ్ర వివరాలను అందించాలని రైతులను కోరింది. ఇందుకు జిల్లాలోని బ్యాంకర్ల నుంచి పూర్తిస్థాయి సహకారం అందడం లేదు. వివరాలను పొందుపర్చడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. వీటిని పర్యవేక్షించాల్సిన లీడ్‌బ్యాంక్ అధికారుల ఆదేశాలను కొన్ని బ్యాంకులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 53.50 శాతం మాత్రమే వివరాలను పొందుపరిచారు. లీడ్‌బ్యాంకు గణాంకాల ప్రకారం జిల్లాలో 7,5,524 మంది రైతుల పంటరుణాల ఖాతాలన్నాయి. ఇవన్నీ రుణమాఫీకి అర్హమైనవిగా గుర్తించారు. సుమారు రూ.3,600 కోట్లు వరకు రుణమాఫీ చేయాల్సి ఉంది. ఎక్కువ రుణం తీసుకున్న రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తోందని ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పింది. రుణాలు ఇప్పటికే చెల్లించిన వారికి తిరిగి చెల్లింపులు జరుపుతారని అధికారపార్టీ నేతలు ప్రచారం చేస్తున్నా.. వాటిల్లో స్పష్టత లేదు. మార్గదర్శకాల పేరుతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తొలుత సమగ్ర వివరాల కంప్యూటరీకరణకు గడువు సెప్టెంబర్ 25తో ఆఖరు అని ప్రకటించినా... బ్యాంకుల జాప్యంతో వచ్చేనెల 1వ తేదీ వరకు పొడిగించారు. అయినప్పటికీ గడువులోగా కంప్యూటరీకరణ చేయడంలో బ్యాంకులెంతగా సఫలీకృతులవుతారో తెలియాల్సి ఉంది. పాతసమాచారాన్నే.. కొత్తగా పొందుపరుస్తూ.. రైతులు పంటరుణం తీసుకునే సమయంలో పట్టాదారు పాసుపుస్తకాలు తనఖా పెడతారు. టైటిల్డీడ్నూ బ్యాంకులు తీసుకుంటున్నాయి. బంగారం పెట్టినప్పుడు సేద్యం భూముల వివరాలను సమగ్రంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేస్తారు. సర్వే నంబర్‌తో సహా పొలం విస్తీర్ణం కూడా నమోదు చేసుకుంటూనే ఉన్నారు. రుణ అర్హతకు ఏఏ పంటలు వర్తిస్తాయనేది పరిశీలించి మరీ.. ఆయా పంటలు పండించే రైతులకే రుణాలిస్తారు. నిబంధనల ప్రకారం రైతులకు ఎలాంటి తనఖా (కుదువ) లేకుండా రూ.లక్ష వరకు రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అయితే, బ్యాంకులు దీన్ని పాటించడం లేదు. కౌలు రైతులకు రుణాలు తీసుకునే సమయంలో ఎల్ఈసీ (రైతురుణ అర్హత గుర్తింపు) కార్డు ఉండాలి. పొలం సర్వేనంబర్ తప్పనిసరిగా అవసరం. అయితే, ఈ రెండింటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని రుణమిచ్చిన బ్యాంకులే లేకపోవడం గమనార్హం. కంప్యూటరీకరిస్తోన్న సమగ్ర వివరాలివే.. రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకుల్లో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఇవ్వాలి. తాజాగా పట్టాదారు పాసుపుస్తకం కూడా బ్యాంకర్లకు అందజేయాలని కొత్త నిబంధన పెట్టారు. ఎంత విస్తీర్ణంలో ఏయే పంటలు సాగుచేస్తున్నారో కూడా వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఆయా భూముల సర్వే నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలంటున్నారు. గతంలో పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులు వీఆర్వోల నుంచి ధ్రువీకరణలు తీసుకుని వాటిద్వారా రుణాలు తీసుకున్నారు. ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా తీసుకున్న పొలం అడంగల్ కాపీలు బ్యాంకర్లకు అందజేయాలి. అయితే, ప్రస్తుతం పాసుపుస్తకాలు లేని రైతులు నానాకష్టాలు పడుతున్నారు. వివాదాలు, డాట్ భూములకు సంబంధించిన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీకావడంలో జిల్లా అధికారుల వద్ద వందల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి రుణమాఫీ వర్తించడం సందిగ్ధమేనని తెలుస్తోంది. ఒకే సర్వే నంబర్‌పై పలు బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్న లబ్ధిదారులు అనేకమంది ఉన్నారు. ప్రస్తుతం వీటన్నింటినీ క్రోడీకరించి వీటిల్లో ఒక బ్యాంకు రుణాల్నే మాఫీచేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాంకుల్లో సిబ్బంది కొరత వల్ల ఈ పనులను తాము చేయలేకపోతున్నామని బ్యాంకర్లు వివరణ ఇస్తున్నారు. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా అకౌంట్ల సమగ్ర జాబితా తయారు చేసుకోవడం.. తాజాగా జన్‌ధన్ యోజన కింద కొత్త బ్యాంకు అకౌంట్లు తెరవడం తదితర కారణాలతో సిబ్బంది బిజీగా మారారంటూ బ్యాంకర్లు వివరణ ఇస్తున్నాయి. -
విచారణ లేదు.. ఎన్నికలు లేవు
బీర్కూర్,న్యూస్‌లైన్: రైతుల రుణాల్లో అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో బీర్కూర్ మండలంలోని దామరంచ సింగిల్ విండో పాలక వర్గాన్ని రద్దు చేసిన అధికారులు తిరిగి ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం చూపుతున్నారు. మొదట్లో రుణాల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన అధికారులు ఆ తరువాత పట్టించుకోలేదు. దామరంచ సింగిల్ విండోలో గతంలో పని చేసిన అధ్యక్ష, కార్యదర్శులు సుమారు రూ. 1 కోటి 60 లక్షలు దుర్వినియోగం చేసినట్లు రైతులు ఆరోపించారు. ఈ మేరకు రైతులు ఆధారాలను బయటపెట్టారు. పలు రకాలుగా రైతులకు రుణాలు రూ .1,78,87,695 వచ్చాయి. దీంట్లో స్వల్ప కాలిక రుణాలు రూ. 1,13,00712, రీ షెడ్యూల్ ద్వారా, రూ. 12,05,505 నార్మల్ లాంగ్ టర్మ్ రుణాలు రూ. 88,325, ఎల్టీ నాబార్డు ద్వారా రూ. 2,62,679 , నాబార్డు రీషెడ్యూల్ ద్వారా రూ. 46,88,407, నాబార్డు రీ షెడ్యూల్ద్వారా రూ. 3,01,042 వచ్చాయి. అయితే మొదటి సారి రూ. 67,59,973, రెండవ సారి రూ. 67,65,869 మాఫీ వచ్చింది. దీంతో పాటు వైద్యనాథ్ కమిటీ ద్వారా సొసైటీకి రూ. 25,10,471, పీఎం ఫండ్ ద్వారా రూ. 16,42,103 వచ్చాయి. అయితే ఇంత జరిగినా రైతులు ఒక్క రూపాయి కూడా లోన్లు తీసుకోకుండానే అధ్యక్ష, కార్యదర్శులు రైతుల పేరు మీద లక్షలకు లక్షలు స్వాహా చేశారు. మొదటి విడత, రెండవ విడతలో రుణ మాఫీ కాని వారికి వైఎస్ ప్రభుత్వం రూ. 5000 ఇన్సెంటీవ్ ప్రకటించగా సొసైటీ పరిధిలోని 567 మంది రైతుల పేరు మీద ఇన్సెంటీవ్ తెప్పించి వారిలో కేవలం 250 మంది వరకు రైతులకు మాత్రమే బోనస్‌ను అందించి మిగిలినవి వారి జేబుల్లో వేసుకున్నారు. ఇదిలా ఉండగా తొమ్మిదేళ్ల క్రితం చనిపోయిన దావోరి విఠల్(అకౌంట్ నంబర్ 180) అ నే రైతు పేరు మీద డబ్బులు తీసుకుంటూ దర్జాగా కాలక్షేపం చేశారు. రూపాయి కూడా రుణం తీసుకోని రైతుల పేరు మీద కూడా వేలకు వేలు అప్పులు ఉన్నట్లు చూ పిస్తున్నారు. రైతుల పేరు మీద వారికి తె లియకుండా రుణాలు పొం దడమే కా కుండా ఇవన్ని సక్రమంగానే జరిగాయం టు అధికారులను గతంలో న మ్మించడానికి ప్రయత్నించారు. ప్రతి సంవత్సరం రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించే వారి పేరు మీద కూడా వీరిరువురు లోన్లు తీసుకున్నట్లు తేలింది. మరో నమ్మలేని నిజం ఏమిటంటే నవంబర్ 31, 2006లో గడ్డం లక్ష్మి పేరు మీద రూ. 35 వేలు, శేక్ హుస్సేన్ పేరు మీద రూ. 38,500 కాజేశారు. అసలు ప్రపంచంలోని ఏ క్యాలండర్ చూసినా నవంబర్ 31 ఉండనే ఉండదు. ఈ ఒక్క విషయం చాలు వారు ఎంతగా రైతులకు వచ్చే నిధులు స్వాహా చేశారో అర్థం అవుతుంది. లోన్లు తీసుకుని రుణాలు చె ల్లించిన వారికి కూడా రుణ మాఫీ తీసుకువచ్చి ఈ డబ్బులను సైతం సొంతానికి వా డుకున్నారు. అయితే గతంలోనే దీనిపై స హకార బ్యాంక్ అధికారులు విచారణ జ రిపి కమిటీని రద్దు చేసి చేతులు దులుపుకున్నారు. సుమారు రూ. 1కోటి 60 లక్షలు దుర్వినియోగం అయినా బాధ్యులైన వారిపై ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల గురించి మరిచిపోయిన అదికారులు దాదాపుగా 17 నెలలుగా దామరంచ సింగిల్ విండోకు ఎన్నికలు జరపకుండా, అటు విచారణ సైతం పూర్తి చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంపై దామరంచ గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్వాకంపై రైతులు మండిపడుతున్నారు. త్వరితగతిన విచారణ జరిపించి దామరంచ సింగిల్ విండోకు ఎన్నికలు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
పీఏసీఎస్‌లో ఇరు పార్టీల సభ్యుల మధ్య ఘర్షణ
మాకవరపాలెం, న్యూస్‌లైన్ : పీఏసీఎస్ ద్వారా తెలుగుదేశం పార్టీ రైతులకు రుణాలు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడంతో దేశం, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వివాదం తలెత్తింది. డీసీసీబీ ైచైర్మన్ సమక్షంలోనే రెండు పార్టీల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. చివరకు చైర్మన్ సర్దిచెప్పడంతో ఇరువర్గాల వారు శాంతించారు. స్థానిక పీఏసీఎస్‌కు ఇటీవల రూ. 50 లక్షలు మంజూరయ్యాయి. దీంతో ఖరీఫ్ కావడంతో రైతులు రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం ప్రారంభించారు. వచ్చిన నిధులను దేశంపార్టీకి చెందిన రైతులకు మాత్రమే రుణాలు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, రైతులు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఏఎస్‌కు సోమవారం డీసీసీబీ చైర్మన్ సుకుమారవర్మ రావడంతో ఇరు పార్టీలకు చెందిన వారు అక్కడకు చేరుకున్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ మండలశాఖ అధ్యక్షుడు రుత్తల జమీందారుతోపాటు వివిధ గ్రామాల మాజీ సర్పంచ్‌లు, నాయకులు డీసీసీబీ చైర్మన్‌కు సమస్యపై ఫిర్యాదు చేశారు. రూ. 50 లక్షలు వస్తే కేవలం రూ.4 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన డెరైక్టర్లకు కేటాయించారన్నారు. పీఏసీఎస్ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో ఆ పార్టీ రైతుల నుంచి బ్యాంకు సిబ్బందితోపాటు డెరైక్టర్లు రుణాలు అందించేందుకు పాసుపుస్తకాల జెరాక్స్‌లు తదితర పత్రాలను సేకరిస్తున్నారని తెలిపారు. ఈసందర్భంగా పీఏసీఎస్ అధ్యక్షుడు అల్లు రామునాయుడుతో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో రెండు పార్టీలకు చెందినవారి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఒకానొక దశలో కొట్లాటకు దారితీసింది. పోలీసులు, చైర్మన్ జోక్యం చేసుకున్నా వారు శాంతించకపోవడంతో అసహనానికి గురైన వర్మ కుర్చీలోనుంచి లేచిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంపార్టీ వారికే రుణాలు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వమని ఎవరు చెప్పినా సహించేది లేదని సీఈఓ శెట్టి గోవిందను హెచ్చరించారు. బుధవారం సాయంత్రానికి అర్హులైన రైతులంతా తమ దరఖాస్తులను బ్యాంకు అధ్యక్షుడు లేదా సీఈఓకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో తూటిపాల సర్పంచ్ గవిరెడ్డి ప్రసాద్, శెట్టిపాలెం, కొండలఅగ్రహారం మాజీ సర్పంచ్‌లు వర్రిపాత్రుడు, చిటికెల రమణ పాల్గొన్నారు. -
రైతులకు రూ.4,765 కోట్ల రుణాలు: విశ్వరూప్
ఖరీఫ్, రబీ సీజన్లో తూర్పుగోదావరి జిల్లా రైతులకు రూ.4,765 కోట్ల రుణాలు మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ తెలిపారు. ఖరీఫ్‌లో రూ. 2859 కోట్లు, రబీలో రూ. 1907 కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఆయన జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇప్పటికే రూ.2,120 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు తెలిపారు. వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన 3,11,856 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీని జమ చేశామని విశ్వరూప్ వివరించారు.