ప్రస్తుతానికి 20% రుణాలే చెల్లింపు
మిగతా రుణాలన్నీ నాలుగు దఫాలుగా చెల్లిస్తాం: సీఎం చంద్రబాబు
జనవరి నుంచి రైతు సాధికారిత సంస్థ ద్వారా రుణాలు
కేసీఆర్ అనుభవ రాహిత్యంతోనే తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాలు
నెల్లూరు: రైతుల రుణాల్లో ఈ నెల 22న 20 శాతం, మిగతావి పది శాతం వడ్డీతో నాలుగు విడతలుగా బ్యాంకులకు చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. నెల్లూరు రూరల్ మండలం వెంకటేశ్వపురం పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో, వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాలను రీ షెడ్యూల్ చేరుుస్తానని, రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవచ్చని అన్నారు. జనవరి నుంచి రైతు సాధికారిత సంస్థ ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డ్వాక్రా రుణాల మాఫీలో భాగంగా రూ.10 వేలు చొప్పున చెల్లించనున్నామన్నారు. వడ్డీ మొత్తాన్ని చెల్లించడంతో పాటుగా తిరిగి వడ్డీ లేని రుణాలిప్పిస్తామని చెప్పారు. నాలుగు నెలల్లో 900 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం ద్వారా విద్యుత్ కోతలను అధిగమించామని చంద్రబాబు పేర్కొన్నారు. జూన్ నుంచి మరో 2వేల మెగావాట్ల విద్యుత్‌ను కొంటున్నామన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కర్నూలు, అనంతపురంలలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. 4 వేల మెగావాట్లు ఉత్పత్తి చేసే ఎన్టీపీసీని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం ద్వారా, అందులో 85 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేలా రూపకల్పన చేశామని చెప్పారు. కృష్ణపట్నంలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. దాన్ని కూడా ఉపయోగించుకుని 24 గంటలూ ప్రజలకు విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుభవ రాహిత్యంతో ఆ రాష్ట్ర ప్రజలు కరెంటు కష్టాలు పడుతున్నారని విమర్శించారు.
సభలో ఎర్రచందనం దొంగలున్నారా: సీఎం
వెలుగొండ అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్ల భరతం పడతానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. డక్కిలి గురుకుల కళాశాల గ్రౌండ్‌లో మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారి తోకలైనా కత్తింరించడం ఖాయమన్నారు. వీరు శేషాచలం, వెలుగొండ అడవులు మొదలకుని హిమాచలం వరకు ఎర్రచందనం నరికి చెన్నైకి తరలిస్తున్నారన్నారు. ఈ సభలో ఎవరైనా ఎర్రచందనం దొంగలు ఉన్నారా అని అడిగారు. దీంతో ప్రజా ప్రతినిధులు సీఎం వైపు చూసి మిన్నకుండిపోయారు.
పారిశ్రామిక, పర్యాటక హబ్‌గా నెల్లూరు
నెల్లూరు జిల్లాలో సమృద్ధిగా వనరులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని జిల్లాను పారిశ్రామిక, పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని బాబు అన్నారు. వెంకటగిరి నుంచి ఏర్పేడు వరకు ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు పింఛనుదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. డక్కిలి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు.రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.