Empowered by the farmer
-
ఆర్భాటం ఫుల్.. ప్రాధాన్యత నిల్
ప్రారంభానికే పరిమితమైన రైతు సాధికార సంస్థ ఖరారు కాని విధివిధానాలు అధికారులనూ నియమించలేదు రుణమాఫీ గురించి తెలియదంటున్న డిప్యుటేషన్ అధికారులు విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రైతు సాధికార సంస్థకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. గత నెల 21న గన్నవరంలో ఈ సంస్థను ఏర్పాటుచేయగా, ఇప్పటివరకు కార్యకలాపాలు కూడా ప్రారంభం కాలేదు. ఈ సంస్థను రుణమాఫీ కోసమే కాదు.. రైతు ఎంపవర్మెంట్ కోసం కూడా వినియోగిస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇక్కడ పర్మినెంట్ అధికారులు, ఉద్యోగులను కూడా నియమించలేదు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు సరికదా విధివిధానాలు కూడా ఖరారు చేయలేదు. దీంతో రుణమాఫీపై సందేహాలు తీర్చుకునేందుకు వివిధ జిల్లాల నుంచి నిత్యం వస్తున్న రైతులకు సమాచారం ఇచ్చే నాథుడే కరువయ్యాడు. రైతుసాధికార సంస్థకు సంబంధం లేకుండానే రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను బ్యాంకర్లు సిద్ధం చేశారు. దీంతో ఈ సంస్థను ఎందుకు ఏర్పాటుచేశారని పలువురు రైతు నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. లక్ష్యాలు ఇవీ... రైతులకు ప్రభుత్వం అందించే సాయాన్ని రైతుసాధికార సంస్థ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. తొలిగా రుణమాఫీని ఈ సంస్థ ద్వారానే అమలుచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తొలి విడత రుణమాఫీ కోసం రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు జీవో కూడా విడుదల చేశారు. కానీ, ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రుణమాఫీ సొమ్మును ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రైతుసాధికార సంస్థకు ఒక్క రూపాయి కూడా అందకుండా తమ ఖాతాల్లో డబ్బు ఎలా జమచేస్తారని రైతులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. చెప్పిందొకటి.. జరుగుతున్నది మరొకటి.. రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన ప్రతి అంశం రైతుసాధికార సంస్థ ద్వారానే నెరవేరుస్తామని పాలకులు ప్రకటించారు. రుణమాఫీని ఈ సంస్థ ద్వారానే ప్రతిష్టాత్మకంగా చేపడతామని చెప్పారు. ఆచరణలో మాత్రం ఈ సంస్థను అసలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. రుణమాఫీకి అర్హులైన వారి జాబితాలను రూపొందించాలని ప్రభుత్వం కొన్ని నిబంధనలను బ్యాంకులకు పంపాయి. ఈ మేరకు బ్యాంకర్లు నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. మళ్లీ కొన్ని మార్పులు చేశారు. ఎట్టకేలకు తుది జాబితాను సిద్ధమైంది. దీంతో రైతుసాధికార సంస్థకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వలేదని, బ్యాంకర్లకు నచ్చినట్టే జాబితాలు రూపొందించారని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. క్లారిటీ లేదు... ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఓ రైతు గన్నవరంలోని రైతు సాధికార సంస్థకు వచ్చారు. తాను రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో తెలంగాణ జిల్లాలో బ్యాంకు నుంచి వ్యవసాయ రుణం పొందానని తెలిపారు. ఇప్పుడు రుణం చెల్లించాలని ఆ బ్యాంకు మేనేజర్ ఒత్తిడి చేస్తున్నారని, రుణమాఫీతో తమకు సంబంధం లేదని స్పష్టంగా చెబుతున్నారని, తన రుణం మాఫీ అవుతుందో లేదో చెప్పాలని ఆయన రైతు సాధికార సంస్థ అధికారులను కోరారు. వాస్తవానికి రైతు సాధికార సంస్థ విధివిధానాలు ఖరారు కాలేదని, రుణమాఫీ విషయంలో తమకు కూడా క్లారిటీ లేదని అధికారులు బదులిచ్చారు. అంతటితో ఆగక.. ‘గతం వేరు. ఇప్పుడు వేరు. ఇప్పటి లెక్కప్రకారం మీరు వేరే రాష్ట్రంలో అప్పు తీసుకున్నట్టే. కాబట్టి రుణమాఫీ అయ్యే అవకాశం లేదు’ అని చెప్పడంతో సదరు రైతు కంగుతిన్నాడు. ఇలా నిత్యం ఇక్కడికి వచ్చే రైతులకు సరైన సమాధానం లభించక అసంతృప్తితో తిరిగి వెళుతున్నారు. అంతా డిప్యుటేషన్ పైనే.. ప్రస్తుతం వ్యవసాయ శాఖ నుంచి జేడీ, ఏడీ స్థాయి అధికారులు తొమ్మిది మంది డిప్యుటేషన్‌పై రైతుసాధికార సంస్థకు వచ్చారు. వ్యవసాయ శాఖ డెప్యూటీ డెరైక్టర్ హోదా కలిగిన అధికారిని ఇన్చార్జిగా నియమించారు. వీరంతా రాష్ట్రంలోని 13 జిల్లాల వ్యవసాయ శాఖ, ఇతర అనుబంధ కార్యాలయాల నుంచి సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయశాఖ జేడీ, పశుసంవర్థక శాఖ జేడీ, ఆత్మ ప్రాజెక్ట్ పీడీ, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్, సహకార శాఖ జిల్లా కార్యాలయాల అధికారుల ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. వారి వద్ద ఉన్న సమచారాన్ని తమకు పపాలని కోరుతున్నారు. తమ వద్ద ఉన్న వివరాలను జిల్లా కార్యాలయాలకు పంపిస్తున్నారు. వాస్తవానికి రైతుసాధికార సంస్థను రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసినందు వల్ల పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జాబితాలు బ్యాంకుల్లో.. ఫిర్యాదులు తహశీల్దార్ కార్యాలయాల్లో..! ఈ నేపథ్యంలో రుణమాఫీకి అర్హుల జాబితాలను బ్యాంకుల్లో పెడతారు. వాటిపై అభ్యంతరాలు, ఫిర్యాదులను తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే రుణం ఎందుకు మాఫీ కాలేదనే విషయం బ్యాంకర్లకు తెలుస్తుందని, కాని తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి ఎలా తెలుస్తుందని, గందరగోళానికి గురిచేసేందుకే ప్రభుత్వం ఇటువటి నిర్ణయాలు తీసుకుంటోందని రైతులు మండిపడుతున్నారు. -
15లోగా ఖాతాల్లోకి మాఫీ సొమ్ము
అప్పటివరకూ ఏ రైతూ రుణాల మీద వడ్డీ కట్టొద్దు రైతు సాధికార సంస్థ ప్రారంభ సభలో ఏపీ సీఎం వెల్లడి విజయవాడ నుంచే వ్యవసాయ మిషన్ పనిచేస్తుంది ‘ఈ-కామర్స్’ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడింగ్ విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ సభ ఇంటివద్దకే ఎఫ్ఐఆర్, రాష్ట్ర కంట్రోల్ రూం ప్రారంభం విజయవాడ బ్యూరో: నవంబర్15వ తేదీ లోగా రాష్ట్రంలోని రైతుల ఖాతాలకు రుణ మాఫీ సొమ్ము అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అప్పటి వరకూ ఏ రైతు కూడా వడ్డీలు చెల్లించాల్సిన పనిలేదని.. ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. గన్నవరం పశు వైద్య కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని సీఎం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను దశల వారీగా తీర్చే దిశగా టీడీపీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. తనపై నమ్మకంతో పట్టం కట్టిన రైతు సోదరుల కోసం రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి, తొలి విడతగా రూ. 5,000 కోట్లను నిధులను విడుదల చేసి, 20 శాతం మందికి రుణ విముక్తి కలిగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని పేర్కొన్నారు. వచ్చే నెల 15 లోగా తొలి దశలోని రైతులకు ఆయా నగదు ఖాతాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు సాధికార సంస్థ ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించడం, సమస్యలను పరిష్కరించడం, రుణ పరపతి పెరిగేలా చూడటం, ఆధునిక వ్యవసాయాన్ని పరిచయం వంటివన్నీ చేస్తామని చెప్పారు. ఇసుక వేలం పాటలను డ్వాక్రా మహిళలకే కట్టబెట్టి వచ్చే ఆదాయంలో 25 శాతాన్ని డ్వాక్రామహిళలకు, 75 శాతాన్ని రైతు సాధికార సంస్థకు అందేలా చూస్తామని తెలిపారు. ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దనీ, రైతు రుణం తీర్చుకుంటానని ఉద్ఘాటించారు. త్వరలో ఈ-కామర్స్ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించబోతోందని.. దీంతో ై ఆన్లైన్లోనే ఉత్పత్తులను అమ్ముకునే వీలుంటుందని చంద్రబాబు అన్నారు. తుపాను బాధితుల కోసం విరాళాలు... ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం తమ విరాళాలను ముఖ్యమంత్రికి అందజేశారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు రూ. 5.07 కోట్లు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు రూ. 1 కోటి, కేసీపీ షుగర్స్ రూ. 25 లక్షలు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు రూ. 20 లక్షలు, కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రూ. 10 లక్షలు, విజయవాడ ఆటోనగర్ ఐలా వారు రూ. 5 లక్షలు, గుంటూరు కాటన్ జిన్నర్స్ అసోసియేషన్ రూ. 5 లక్షలు, సుచిత్రా రూపకుమార్ రూ. 1 లక్ష, గౌతం స్కూల్ (కైకలూరు) రూ. 50 వేలు విరాళాలను స్వయంగా సీఎంకు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు కామినేని శ్రీనివాస్, ఉమా, పుల్లారావు, రవీంద్ర, మాణిక్యాలరావు, ఎంపీలు పాల్గొన్నారు. -
ప్రస్తుతానికి 20% రుణాలే చెల్లింపు
మిగతా రుణాలన్నీ నాలుగు దఫాలుగా చెల్లిస్తాం: సీఎం చంద్రబాబు జనవరి నుంచి రైతు సాధికారిత సంస్థ ద్వారా రుణాలు కేసీఆర్ అనుభవ రాహిత్యంతోనే తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాలు నెల్లూరు: రైతుల రుణాల్లో ఈ నెల 22న 20 శాతం, మిగతావి పది శాతం వడ్డీతో నాలుగు విడతలుగా బ్యాంకులకు చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. నెల్లూరు రూరల్ మండలం వెంకటేశ్వపురం పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో, వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాలను రీ షెడ్యూల్ చేరుుస్తానని, రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవచ్చని అన్నారు. జనవరి నుంచి రైతు సాధికారిత సంస్థ ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డ్వాక్రా రుణాల మాఫీలో భాగంగా రూ.10 వేలు చొప్పున చెల్లించనున్నామన్నారు. వడ్డీ మొత్తాన్ని చెల్లించడంతో పాటుగా తిరిగి వడ్డీ లేని రుణాలిప్పిస్తామని చెప్పారు. నాలుగు నెలల్లో 900 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం ద్వారా విద్యుత్ కోతలను అధిగమించామని చంద్రబాబు పేర్కొన్నారు. జూన్ నుంచి మరో 2వేల మెగావాట్ల విద్యుత్‌ను కొంటున్నామన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కర్నూలు, అనంతపురంలలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. 4 వేల మెగావాట్లు ఉత్పత్తి చేసే ఎన్టీపీసీని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం ద్వారా, అందులో 85 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేలా రూపకల్పన చేశామని చెప్పారు. కృష్ణపట్నంలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. దాన్ని కూడా ఉపయోగించుకుని 24 గంటలూ ప్రజలకు విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుభవ రాహిత్యంతో ఆ రాష్ట్ర ప్రజలు కరెంటు కష్టాలు పడుతున్నారని విమర్శించారు. సభలో ఎర్రచందనం దొంగలున్నారా: సీఎం వెలుగొండ అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్ల భరతం పడతానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. డక్కిలి గురుకుల కళాశాల గ్రౌండ్లో మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారి తోకలైనా కత్తింరించడం ఖాయమన్నారు. వీరు శేషాచలం, వెలుగొండ అడవులు మొదలకుని హిమాచలం వరకు ఎర్రచందనం నరికి చెన్నైకి తరలిస్తున్నారన్నారు. ఈ సభలో ఎవరైనా ఎర్రచందనం దొంగలు ఉన్నారా అని అడిగారు. దీంతో ప్రజా ప్రతినిధులు సీఎం వైపు చూసి మిన్నకుండిపోయారు. పారిశ్రామిక, పర్యాటక హబ్‌గా నెల్లూరు నెల్లూరు జిల్లాలో సమృద్ధిగా వనరులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని జిల్లాను పారిశ్రామిక, పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని బాబు అన్నారు. వెంకటగిరి నుంచి ఏర్పేడు వరకు ప్రత్యేక ప్రాంతంగా గుర్తించి పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు పింఛనుదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. డక్కిలి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు.రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.