ఆర్భాటం ఫుల్.. ప్రాధాన్యత నిల్ | Limited at the start of the farmer is the authoritative body | Sakshi
Sakshi News home page

ఆర్భాటం ఫుల్.. ప్రాధాన్యత నిల్

Published Sat, Nov 8 2014 1:59 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

ఆర్భాటం ఫుల్.. ప్రాధాన్యత నిల్ - Sakshi

ఆర్భాటం ఫుల్.. ప్రాధాన్యత నిల్

ప్రారంభానికే పరిమితమైన  రైతు సాధికార సంస్థ
ఖరారు కాని విధివిధానాలు
అధికారులనూ నియమించలేదు
రుణమాఫీ గురించి తెలియదంటున్న
డిప్యుటేషన్ అధికారులు
 

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రైతు సాధికార సంస్థకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. గత నెల 21న గన్నవరంలో ఈ సంస్థను ఏర్పాటుచేయగా, ఇప్పటివరకు కార్యకలాపాలు కూడా ప్రారంభం కాలేదు. ఈ సంస్థను రుణమాఫీ కోసమే కాదు.. రైతు ఎంపవర్‌మెంట్ కోసం కూడా వినియోగిస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇక్కడ పర్మినెంట్ అధికారులు, ఉద్యోగులను కూడా నియమించలేదు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు సరికదా విధివిధానాలు కూడా ఖరారు చేయలేదు. దీంతో రుణమాఫీపై సందేహాలు తీర్చుకునేందుకు వివిధ జిల్లాల నుంచి నిత్యం వస్తున్న రైతులకు సమాచారం ఇచ్చే నాథుడే కరువయ్యాడు. రైతుసాధికార సంస్థకు సంబంధం లేకుండానే రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను బ్యాంకర్లు సిద్ధం చేశారు. దీంతో ఈ సంస్థను ఎందుకు ఏర్పాటుచేశారని పలువురు రైతు నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

లక్ష్యాలు ఇవీ...

రైతులకు ప్రభుత్వం అందించే సాయాన్ని రైతుసాధికార సంస్థ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. తొలిగా రుణమాఫీని ఈ సంస్థ ద్వారానే అమలుచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తొలి విడత రుణమాఫీ కోసం రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు జీవో కూడా విడుదల చేశారు. కానీ, ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రుణమాఫీ సొమ్మును ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రైతుసాధికార సంస్థకు ఒక్క రూపాయి కూడా అందకుండా తమ ఖాతాల్లో డబ్బు ఎలా జమచేస్తారని రైతులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.  
 చెప్పిందొకటి..

జరుగుతున్నది మరొకటి..

రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన ప్రతి అంశం రైతుసాధికార సంస్థ ద్వారానే నెరవేరుస్తామని పాలకులు ప్రకటించారు. రుణమాఫీని ఈ సంస్థ ద్వారానే ప్రతిష్టాత్మకంగా చేపడతామని చెప్పారు. ఆచరణలో మాత్రం ఈ సంస్థను అసలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. రుణమాఫీకి అర్హులైన వారి జాబితాలను రూపొందించాలని ప్రభుత్వం కొన్ని నిబంధనలను బ్యాంకులకు పంపాయి. ఈ మేరకు బ్యాంకర్లు నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. మళ్లీ కొన్ని మార్పులు చేశారు. ఎట్టకేలకు తుది జాబితాను సిద్ధమైంది. దీంతో రైతుసాధికార సంస్థకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వలేదని, బ్యాంకర్లకు నచ్చినట్టే జాబితాలు రూపొందించారని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

క్లారిటీ లేదు...

ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఓ రైతు గన్నవరంలోని రైతు సాధికార సంస్థకు వచ్చారు. తాను రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో తెలంగాణ జిల్లాలో బ్యాంకు నుంచి వ్యవసాయ రుణం పొందానని తెలిపారు. ఇప్పుడు రుణం చెల్లించాలని ఆ బ్యాంకు మేనేజర్ ఒత్తిడి చేస్తున్నారని, రుణమాఫీతో తమకు సంబంధం లేదని స్పష్టంగా చెబుతున్నారని, తన రుణం మాఫీ అవుతుందో లేదో చెప్పాలని ఆయన రైతు సాధికార సంస్థ అధికారులను కోరారు. వాస్తవానికి రైతు సాధికార సంస్థ విధివిధానాలు ఖరారు కాలేదని, రుణమాఫీ విషయంలో తమకు కూడా క్లారిటీ లేదని అధికారులు బదులిచ్చారు. అంతటితో ఆగక.. ‘గతం వేరు. ఇప్పుడు వేరు. ఇప్పటి లెక్కప్రకారం మీరు వేరే రాష్ట్రంలో అప్పు తీసుకున్నట్టే. కాబట్టి రుణమాఫీ అయ్యే అవకాశం లేదు’ అని చెప్పడంతో సదరు రైతు కంగుతిన్నాడు. ఇలా నిత్యం ఇక్కడికి వచ్చే రైతులకు సరైన సమాధానం లభించక అసంతృప్తితో తిరిగి వెళుతున్నారు.

అంతా డిప్యుటేషన్ పైనే..

ప్రస్తుతం వ్యవసాయ శాఖ నుంచి జేడీ, ఏడీ స్థాయి అధికారులు తొమ్మిది మంది డిప్యుటేషన్‌పై రైతుసాధికార సంస్థకు వచ్చారు. వ్యవసాయ శాఖ డెప్యూటీ డెరైక్టర్ హోదా కలిగిన అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. వీరంతా రాష్ట్రంలోని 13 జిల్లాల వ్యవసాయ శాఖ, ఇతర అనుబంధ కార్యాలయాల నుంచి సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయశాఖ జేడీ, పశుసంవర్థక శాఖ జేడీ, ఆత్మ ప్రాజెక్ట్ పీడీ, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్, సహకార శాఖ జిల్లా కార్యాలయాల అధికారుల ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. వారి వద్ద ఉన్న సమచారాన్ని తమకు పపాలని కోరుతున్నారు. తమ వద్ద ఉన్న వివరాలను జిల్లా కార్యాలయాలకు పంపిస్తున్నారు. వాస్తవానికి రైతుసాధికార సంస్థను రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసినందు వల్ల పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
 
జాబితాలు బ్యాంకుల్లో.. ఫిర్యాదులు తహశీల్దార్ కార్యాలయాల్లో..!


ఈ నేపథ్యంలో రుణమాఫీకి అర్హుల జాబితాలను బ్యాంకుల్లో పెడతారు. వాటిపై అభ్యంతరాలు, ఫిర్యాదులను తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే రుణం ఎందుకు మాఫీ కాలేదనే విషయం బ్యాంకర్లకు తెలుస్తుందని, కాని తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి ఎలా తెలుస్తుందని, గందరగోళానికి గురిచేసేందుకే ప్రభుత్వం ఇటువటి నిర్ణయాలు తీసుకుంటోందని రైతులు మండిపడుతున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement