15లోగా ఖాతాల్లోకి మాఫీ సొమ్ము
అప్పటివరకూ ఏ రైతూ రుణాల మీద వడ్డీ కట్టొద్దు రైతు సాధికార సంస్థ ప్రారంభ సభలో ఏపీ సీఎం వెల్లడి
విజయవాడ నుంచే వ్యవసాయ మిషన్ పనిచేస్తుంది
‘ఈ-కామర్స్’ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడింగ్
విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ సభ
ఇంటివద్దకే ఎఫ్‌ఐఆర్, రాష్ట్ర కంట్రోల్ రూం ప్రారంభం
విజయవాడ బ్యూరో: నవంబర్15వ తేదీ లోగా రాష్ట్రంలోని రైతుల ఖాతాలకు రుణ మాఫీ సొమ్ము అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అప్పటి వరకూ ఏ రైతు కూడా వడ్డీలు చెల్లించాల్సిన పనిలేదని.. ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. గన్నవరం పశు వైద్య కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని సీఎం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను దశల వారీగా తీర్చే దిశగా టీడీపీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. తనపై నమ్మకంతో పట్టం కట్టిన రైతు సోదరుల కోసం రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి, తొలి విడతగా రూ. 5,000 కోట్లను నిధులను విడుదల చేసి, 20 శాతం మందికి రుణ విముక్తి కలిగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని పేర్కొన్నారు.
వచ్చే నెల 15 లోగా తొలి దశలోని రైతులకు ఆయా నగదు ఖాతాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు సాధికార సంస్థ ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించడం, సమస్యలను పరిష్కరించడం, రుణ పరపతి పెరిగేలా చూడటం, ఆధునిక వ్యవసాయాన్ని పరిచయం వంటివన్నీ చేస్తామని చెప్పారు. ఇసుక వేలం పాటలను డ్వాక్రా మహిళలకే కట్టబెట్టి వచ్చే ఆదాయంలో 25 శాతాన్ని డ్వాక్రామహిళలకు, 75 శాతాన్ని రైతు సాధికార సంస్థకు అందేలా చూస్తామని తెలిపారు. ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దనీ, రైతు రుణం తీర్చుకుంటానని ఉద్ఘాటించారు. త్వరలో ఈ-కామర్స్ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించబోతోందని.. దీంతో ై ఆన్‌లైన్‌లోనే ఉత్పత్తులను అమ్ముకునే వీలుంటుందని చంద్రబాబు అన్నారు.
తుపాను బాధితుల కోసం విరాళాలు...
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం తమ విరాళాలను ముఖ్యమంత్రికి అందజేశారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు రూ. 5.07 కోట్లు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు రూ. 1 కోటి, కేసీపీ షుగర్స్ రూ. 25 లక్షలు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు రూ. 20 లక్షలు, కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రూ. 10 లక్షలు, విజయవాడ ఆటోనగర్ ఐలా వారు రూ. 5 లక్షలు, గుంటూరు కాటన్ జిన్నర్స్ అసోసియేషన్ రూ. 5 లక్షలు, సుచిత్రా రూపకుమార్ రూ. 1 లక్ష, గౌతం స్కూల్ (కైకలూరు) రూ. 50 వేలు విరాళాలను స్వయంగా సీఎంకు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు కామినేని శ్రీనివాస్, ఉమా, పుల్లారావు, రవీంద్ర, మాణిక్యాలరావు, ఎంపీలు పాల్గొన్నారు.