విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద మంగళవారం ఇండిగో విమానంలో గందరగోళం నెలకొంది. ల్యాండ్ అయ్యేందుకు రన్‌వే పైకి వచ్చిన విమానం మళ్లీ గాల్లోకి ఎగిరింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానంలో చంద్రబాబు భార్య భువనేశ్వరీ ఉండడంతో సోషల్ మీడియా ఈ వార్తకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
ఏం జరిగింది.?
హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉదయం ఇండిగో విమానం వచ్చింది. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఇండిగో విమానాన్ని లాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే టేకాఫ్ సమయంలో విమానం చక్రాలు ఉన్న ప్యానెల్ తెరుచుకోలేదు. రెండు మార్లు ప్రయత్నించినా.. వీల్ ప్యానెల్ ఓపెన్ కాకపోవడంతో పైలట్ విమానాన్ని మళ్లీ పైకి లేపాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు (ATC) సమాచారం ఇవ్వడంతో పాటు ప్రయాణీకులకు కూడా విషయాన్ని వివరించాడు. సుమారు 20 నిమిషాల పాటు విమానాన్ని గాల్లోనే తిప్పి.. వీల్ ప్యానెల్‌ను చెక్ చేసుకున్నాడు. అంతా ఓకే అయిన తర్వాత రెండో సారి విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై దించాడు పైలట్. ఎలాంటి ప్రమాదం జరక్కుండా క్షేమంగా దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణీకులు.
భువనేశ్వరీ ప్రయాణం
ఇవ్వాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు నిజం చెబుతానంటూ నారా భువనేశ్వరీ పర్యటనలను షెడ్యూల్ చేసుకున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపంతో కొందరు చనిపోయారని అప్పట్లో ఎల్లోమీడియా ప్రచారం చేసింది. ఆ కుటుంబాలను పరామర్శిస్తానని అప్పట్లో భువనేశ్వరీ ఓ రెండు రోజులు పర్యటించి సుదీర్ఘ విరామం ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ పర్యటనలు పునఃప్రారంభించారు. ఇవ్వాళ్టి నుంచి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు.
కేరాఫ్ హైదరాబాద్
హైదరాబాద్‌లో చంద్రబాబు కుటుంబం జూబ్లీహిల్స్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంది. కేవలం సభలు, సమావేశాలు, పర్యటనలున్నప్పుడే మాత్రమే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం పరిపాటే. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వస్తున్నప్పుడు విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురక్షితంగా విమానం లాండవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment