సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో బ్యాంకులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కొనియాడారు. రైతులకు పంట రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కౌలు రైతులకు మరిన్ని రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరారు. సచివాలయంలో మంగళవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) 220వ సమావేశం మంత్రి బుగ్గన అధ్యక్షతన జరిగింది.
ఇందులో ప్రధానంగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక అమలులో బ్యాంకులు సాధించిన ప్రగతి, సూచికలవారీ సాధించిన లక్ష్యాలు తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు.
సూక్ష, చిన్నతరహా, మధ్యతరహా రంగాలు (ఎంఎస్‌ఎంఈ)పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఆ రంగంలో కూడా బ్యాంకులు సహకరించాలని కోరారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలన్నారు. అలాగే టిడ్కో గృహాలు, ఇతర గృహనిర్మాణ పథకాల లబ్ధిదారులకు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరులో పూర్తి తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను కోరారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ నవనీత్ కుమార్ జూన్ 30 వరకు బ్యాంకులు సాధించిన ప్రగతిని వివరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్, కంట్రీ హెడ్ ఫర్ అగ్రికల్చర్ శ్రీనివాసరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్.రావత్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం ఇన్‌చార్జి అనిల్ మిశ్రా, నాబార్డు జీఎం ఎన్‌ఎస్ మూర్తి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, వివిధ బ్యాంకులు, శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతులకు మరిన్ని రుణాలందించాలి
Published Wed, Oct 12 2022 6:30 AM | Last Updated on Wed, Oct 12 2022 7:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment