వరి సాగుకోసం కరిగెట చేస్తున్న రైతు
కల్వకుర్తి : రైతన్నకు ప్రభుత్వం మరో శుభవార్త ఇచ్చింది. బ్యాంకులిచ్చే పంట రుణాలు పెరిగాయి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరానికి 2 నుంచి 5 శాతం పెంచింది. ధాన్యం, చిరు ధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటలకు రుణాలు పెరిగాయి. బ్యాంకు అధికారులు ప్రతి ఏటా ఖరీఫ్, రబీలో రైతులు వేసుకున్న పంటల ఆధారంగా రుణాలు ఇస్తుంటారు. వాటికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. 2018–19 ఏడాదికి పెంచిన దాని ప్రకారం రుణాలివ్వాలని ప్రభుత్వం ఇటీవలే అన్ని బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది.
పంట పెట్టుబడికి రుణాలు
రైతులు పంటలు సాగు చేసే ముందు పెట్టుబడికి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. పంట సాగును పరిగణలోకి తీసుకుని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇస్తుంటారు. ఖరీఫ్, రబీల ముందు రైతులకు పహాణి, పాసుపుస్తకాలు పరిశీలించి రుణాలు అందజేస్తారు. సకాలంలో చెల్లిస్తే వడ్డీ మాఫీ సైతం ఉంటుంది. బ్యాంకులు రైతులకు అందించే రుణాలును పంటల పెట్టుబడి వ్యయం దృష్టిలో ఉంచుకొని రుణం పెంచుతుంటారు. ఏటా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వివిధ పంటలకు ఇచ్చే రుణాలను వివరిస్తూ ఖరీఫ్ ముందు ఉత్తర్వులు అందిస్తుంది.
ఇదీ.. ప్రయోజనం
ప్రధాన పంటైన వరికి గతేడాది ఎకారానికి రూ.30వేలు రుణం ఇచ్చేవారు. ఈ ఏడాది రూ.34 వేలు ఇవ్వనున్నారు. వరిసీడ్‌కు రూ.40వేల నుంచి రూ.42వేలకు పెంచారు. అలాగే పత్తి పంటకు రూ.30వేల నుంచి రూ.35వేలకు పెంచారు. అదేవిధంగా పత్తి సీడ్ పంట సాగుకు రూ.1.26 లక్షలు ఇవ్వనున్నారు. మొక్కజొన్నకు రూ.28వేలు, మిర్చికి రూ.58వేలు, వేరుశెనగకు ఎకరానికి రూ. 23వేలు, జొన్న పంటకు రూ.16వేలు, వర్షాధార కంది పంటకు రూ.14వేలు, బోరుకింద సాగు పంటకు రూ.18వేలు ఇవ్వనున్నారు. ఆముదం పంటకు రూ.11వేల వరకు పెంచారు. ఉల్లిగడ్డకు రూ.25వేల నుంచి రూ.30వేలకు పెరిగింది. సన్‌ప్లవర్ పంటకు రూ.18వేలు ఇవ్వనున్నారు.
పండ్ల తోటలు, కూరగాయలు
పెంచిన రుణం పండ్ల తోటలు, కూరగాయలకు సైతం వర్తిస్తుంది. బోరు కింద సాగు చేసే టమాటాకు ఎకరానికి రూ.35వేలు, వర్షాదారానికి సాగు చేసే టమాటాకు రూ.30వేలు, పండ్ల తోటలు మామిడికి రూ.35వేలు, బత్తాయికి రూ.38వేలు, సపోటా తోటకు రూ.30వేలు, జామ రూ30వేలు, గ్రేప్స్ రూ.90వేలు, పుచ్చకాయలు రూ.22వేలు బొప్పాయికి రూ. 52వేలు ఇవ్వనున్నారు. పెరిగిన రుణసాయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment