సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షం బలంగా లేదని.. అధికార టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ సరిగా పోరాటం చేయడం లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జాతీయ నాయకత్వం బలహీనపడడం వల్ల కాంగ్రెస్‌లో ఉండి ఏమీ చేయలేకపోయానని, కాంగ్రెస్‌ను బాధతోనే వీడుతున్నట్లు ఆయన ఆవేదనగా చెప్పుకొచ్చారు.
మంగళవారం సాయంత్రం మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్ పార్టీని సైతం వీడుతున్నట్లు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ సరిగా పోరాటం చేయడం లేదు కాబట్టే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ‘‘నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం దూసుకుపోతోంది. అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ బలహీనపడింది. నా రాజీనామా ద్వారా ప్రజలకు కొంత మేలు జరుగుతుంది అని అనుకుంటున్నా. నా పోరాటం కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ భవిష్యత్ కోసమే. మునుగోడులో ఎవరు గెలుస్తారనేది ప్రజలే నిర్ణయిస్తార’’ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉద్ఘాటించారు.
అసలు కాంగ్రెస్ నా మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది? నేను ఏ తప్పు చేశా?. ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల కింద 20 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్న మేం పని చేయాలా?. నా జిల్లాలోనే అవకాశవాద రాజకీయాలు చేసేవాళ్లు ఉన్నారు. 20 ఏళ్లపాటు సోనియాను తిట్టిన ఓ వ్యక్తిని పీసీసీ చేశారు. ఆయన కింద మమ్మల్ని పని చేయమంటున్నారు. కమిటీలు వేసేటప్పుడు కూడా కనీసం మాట్లాడలేదు. ఇంతకన్నా అవమానం ఉందా?. సోనియా మీద ఉన్న గౌరవంతో తాను ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శించదల్చుకోలేదని చెప్పారాయన.
కాంట్రాక్టుల కోసం నేను రాజీనామా చేస్తున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నేతగా నా పలుకుబడిని ఏనాడూ వ్యాపారానికి ఉపయోగించుకోలేదు. నా వ్యాపారానికి, రాజకీయ జీవితానికి సంబంధం లేదు. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఈ పదవీ త్యాగంతో ముఖ్యమంత్రి కళ్లు తెరవాలని పేర్కొన్నారు.
బీజేపీలో చేరతారా? అని విలేఖరులు ప్రశ్నించగా.. ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడే పార్టీతో ఉంటానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే విషయమై తన కార్యకర్తలు, అనుచరులతో చర్చిస్తానని చెప్పారు. ఆ తర్వాతే ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని చెప్తానని ఆయన స్పష్టత ఇచ్చారు. తన ఆవేదనను మునుగోడు ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారాయన.
Comments
Please login to add a commentAdd a comment