రెండో కంతు చెల్లించని ప్రభుత్వం
రుణమాఫీ కోసం అన్నదాతల ఎదురుచూపు
మాటలతో సరిపెడుతున్న వైనం
చిత్తూరు: రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఎన్నికల్లో ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్నదాతలను వంచించి అరకొర రుణమాఫీతో సరిపెట్టారు. పోనీ, ఇస్తామన్న మొత్తమైనా చెల్లించారా అంటే అదీలేదు. తొలి కంతుతోనే చెల్లుచీటీ పలికారు. బాబు పాలనకు రెండేళ్లు కావస్తున్నా రెండోకంతు సంగతి తేల్చడం లేదు. త్వరలోనే ఇస్తామని చెప్పి ఇంతవరకు పైసా కూడా ఇవ్వలేదు. అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తామంటూ ముఖ్యమంత్రితోపాటు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పలుమార్లు హామీ ఇచ్చినా ఆచరణలో ముందడుగు పడడం లేదు. దీంతో బ్యాంకులు రుణ బకాయిలు చెల్లించాలంటూ రైతులపై ఒత్తిడి పెంచాయి. బకాయిలు చెల్లించని వారికి నోటీసులు జారీచేసి బలవంతపు వసూళ్లకు దిగాయి. కొన్నిచోట్ల గడువు తీరిన బంగారాన్ని వేలం వేశాయి. ఇంత జరుగుతున్నా బాబు సర్కార్ రుణమాఫీ రెండో కంతు సంగతి పట్టించుకోలేదు. బలవంతపు వసూళ్లకు పాల్పడవద్దని కనీసం బ్యాంకులను ఆదేశించలేదు. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు.
జిల్లావ్యాప్తంగా 2013 డిసెంబర్ 31 నాటికి వివిధ బ్యాంకుల్లో 7,43,158 మంది రైతులు రూ.5,404.30 కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే ప్రభుత్వం కేవలం 3,67,893 మంది రైతులే రుణమాఫీకి అర్హులంటూ లెక్కలు తేల్చింది. రూ.50 వేల లోపు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తున్నామని, రూ.50వేలు నుంచి 1.5 లక్షల రుణాలను నాలుగు కంతుల్లో మాఫీచేస్తామని ప్రకటించింది. రూ.50 వేలు లోపు మాఫీ చేశామని ప్రభుత్వం ప్రకటించినా వాస్తవానికి వాటిల్లో 50 శాతం రుణాలను కూడా మాఫీ చేయలేదు. ఇక రూ.50 వేల పైన రుణాలకు సంబంధించి కేవలం తొలి కంతు మాత్రమే బ్యాంకుల్లో జమ చేసిన ప్రభుత్వం మిగిలిన మూడు కంతుల సంగతిని గాలికొదిలేసింది. రుణమాఫీ కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం బాండ్ల రూపంలో జమ చేస్తుందని భావించిన బ్యాంకులకు చుక్కెదురైంది. దీంతో ఆగ్రహించిన బ్యాంకులు రుణాల వసూళ్ల కోసం రైతులపై ఒత్తిడి పెంచాయి.
ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాను పరిశీలిస్తే మొదటి విడతలో రూ.50 వేల లోపు రుణం తీసుకున్న వారు 2,31,388 మంది ఉండగా, రూ.50 వేలకు పైగా తీసుకున్న వారు 1,04,495 మంది. రెండో విడతలో రూ.50 వేలకు లోపు 13,765 మంది రుణం తీసుకోగా, రూ.50వేలకు పైగా 9,093 మంది, మూడవ విడతలో రూ.50వేల లోపు తీసుకున్న వారు 6,232, రూ.50వేలకు పైగా 2,920 మంది ఉన్నారు. మొత్తం మూడు విడతల్లో రూ.50 వేల లోపు వారు 2,51,385 మంది ఉండగా, 50వేలకు పైగా రుణం తీసుకున్న వారు 1,16,508 మంది ఉన్నారు. ఈ లెక్కన మొత్తం రుణం తీసుకున్న రైతులు 3,67,893 మంది ఉన్నారు. వీరికి రూ.513.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే 50 వేల లోపు రుణాలు తీసుకున్న 2,51,385 మందిలో సగం మందికి కూడా రుణమాఫీ జరిగిన దాఖలాల్లేవు. మిగిలిన వారికి రూ.50 వేల వంతున చెల్లించాల్సి ఉంది. దీంతోపాటు రూ.50వేలకు పైగా రుణం తీసుకున్న 1,16,508 మందికి ఇప్పటివరకు మొదటి కంతుకు మాత్రమే జమచేసిన ప్రభుత్వం మిగిలిన మూడు కంతుల మొత్తం ఎప్పుడు చెల్లిస్తుందో తెలియక రైతులు ఆందోళనలో ఉన్నారు.