రైతులూ.. రుణాలు చెల్లించొద్దు! | don't pay the loans - chandra babu | Sakshi
Sakshi News home page

రైతులూ.. రుణాలు చెల్లించొద్దు!

Published Tue, Oct 7 2014 12:49 AM | Last Updated on Mon, Aug 20 2018 5:29 PM

రైతులూ.. రుణాలు చెల్లించొద్దు! - Sakshi

రైతులూ.. రుణాలు చెల్లించొద్దు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
రుణమాఫీపై నాదీ భరోసా.. అప్పులన్నీ నేనే చెల్లిస్తా
ఏ బ్యాంకరూ మీ ఇంటి వద్దకు రాకుండా, ఆస్తులు జప్తు చేయకుండా చూసే బాధ్యత నాది
మాఫీకి కేంద్రం, ఆర్బీఐ మోకాలడ్డుతున్నాయి
వర్షాకాలానికల్లా హంద్రీ-నీవా పూర్తి చే సి సీమ జిల్లాలకు నీరందిస్తాం
పింఛన్ నిబంధనల్లో ‘అనంత’కు సడలింపు

కాంగ్రెస్ నేతలు చెల్లని కాసుల్లాంటి వాళ్లు
 
అనంతపురం: రాష్ట్రంలో రైతులు రుణాలు చెల్లించవద్దని సీఎం నారా చంద్రబాబునాయుడు చెప్పారు. రుణ మాఫీ విషయంలో పూర్తి భరోసా తనదేనన్నారు. రైతుల భారాన్ని భుజస్కంధాలపై మోస్తానని, అప్పులన్నీ చెల్లిస్తానన్నారు. ఏ బ్యాంకరూ రైతుల ఇంటి వద్దకు రాకుండా, ఆస్తులు జప్తు చేయకుండా చూసే బాధ్యత తనదేనని తెలిపారు. సోమవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురంలో జరిగిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే లక్ష్యంతో ఏర్పాటైన ‘ప్రాథమిక రంగ వ్యవసాయ మిషన్’ను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంతో కలసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతపురంలో ప్రారంభించనున్న నూనె గింజల పరిశోధన కేంద్రం, కనగానపల్లి మండలంలో ఏర్పాటు చేసే గోరుచిక్కుడు, జిగురు పరిశ్రమలు, నంబులపూలకుంటలో ఏర్పాటు చేసే వేరుశనగ విత్తన ఉత్పత్తి, పరిశోధన కేంద్రాల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి వాట ర్ ప్లాంటునూ ప్రారంభించారు. ఈ సందర్భంగా గరుడాపురంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అధ్యక్షతన జరిగిన సభలో బాబు ప్రసంగించారు. ‘గత ఏడా ది నేను చేసిన పాదయాత్రంలో జిల్లాలోని చిప్పగిరి రైతుల కష్టాలను చూసి చలించిపోయి రుణమాఫీ హామీ ఇచ్చా. తర్వాత రాష్ట్రం విడిపోవడంతో రూ.15 వేల కోట్ల ఆర్థిక లోటు ఏర్పడింది. రుణ మాఫీకి కేంద్రం, ఆర్బీఐల నుంచి సహకారం లేదు. అయినా వెన క్కు తగ్గేది లేదు. ఈ నెల 22లోగా రైతు రుణాల్లో 20 శాతం బ్యాం కులకు జమ చేస్తాను. రుణాలు రీషెడ్యూల్ చేసి, ఫిబ్రవరి నాటికి కొత్త రుణాలు ఇప్పిస్తాను. మిగిలిన రుణాలను నాలుగేళ్లలో నాలుగు విడతల్లో సాధికార సంస్థ ద్వారా చెల్లిస్తాం. ఇందుకోసం అప్పులు తీసుకొస్తాం’’ అని చెప్పారు. మహిళా రుణాలను రద్దు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రతి మహిళకు రూ.10 వేల సహా యాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ఎవరైనా బ్యాం కులకు వడ్డీ చెల్లించివుంటే వెనక్కి తిరిగి ఇచ్చేలా చూస్తామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రాథమిక రంగ వ్యవసాయమిషన్‌ను ప్రారంభించానన్నారు. రాష్ట్రంలో బిందు, తుంపర్ల సేద్యాలను ప్రోత్సహిస్తామని చెప్పారు. అనంతపురం జిల్లాలో గతంలో ఐదు ఎకరాలకు మాత్రమే బిందు, తుంపర్ల సేద్య పరికరాలకు సబ్సిడీ ఇచ్చేవాళ్లని, ఇప్పుడు పదెకరాల వరకు ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, మిగిలిన రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఇతర జిల్లాల రైతులకు 50 శాతం సబ్సిడీతో పరికరాలు అందిస్తామన్నారు. ఎన్ని కోట్లు ఖర్చయినా వచ్చే వర్షాకాలంనాటికి హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి చేసి సీమ జిల్లా ప్రజలకు సాగు, తాగు నీరు అందిస్తామని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి హెచ్‌ఎల్‌సీ కాలువను వెడల్పు చేసి 32.5టీఎంసీల తుంగభద్ర నీటినీ రాష్ట్రానికి రప్పిస్తామని చెప్పారు.

అనంతపురం జిల్లాలో వాటర్  గ్రిడ్

అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు కాలువలను అనుసంధానం చేయడానికి అనంతపురం జిల్లా నుంచే వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బాబు ప్రకటించారు. ఈ గ్రిడ్‌కు రూ.1,500 కోట్లు ఖర్చు చేసైనా జిల్లాలోని ప్రతి ఇంటికీ నీటిని అందిస్తానన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు.అయిదెకరాల పొలం ఉన్న వారికి పింఛను ఇవ్వకూడదన్న నిబంధనను అనంతపురం జిల్లావాసులకు సడలించి, పదెకరాలకు పెంచుతున్నామని చెప్పా రు. రాగి సంగటి, జొన్న రొట్టెలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. దేశానికి ఎంతో ఖ్యాతిని తెచ్చిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ నేతలు చెల్లని కాసులవంటి వారని, మేఘమథనంలో డబ్బులు దోచుకున్న వారు సైతం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మం త్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
 
మిషన్లుంటే సరిపోదు.. రైతుకు ఫలితం అందాలి: కలాం
 
మిషన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, వాటి ఫలాలు రైతులకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే విప్లవాత్మక మార్పులు తేవాలని సూచించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురంలో సోమవారం నిర్వహించిన ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమంలో ఆయన ప్రాథమిక రంగ వ్యవసాయ మిషన్‌ను ప్రారంభించారు. ఇక్రిశాట్ డెరైక్టర్ విలియమ్స్ డార్ రూపొందించిన ‘నిరుపేద కంచంలో నిండైన భోజనం’ అనే పుస్తకాన్ని కలాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. అనంతపురం జిల్లాలో సాగు విధానంలోనూ ఎంతో వైవిధ్యం ఉందని చెప్పారు. ‘నాకు రెక్కలు ఉన్నాయి.. ఎగురగలను..’ అని అనంత ప్రజలు భావిస్తే.. ప్రగతి సాధిస్తారన్నారు. ఐదేళ్ల తరువాత జిల్లాలోని ప్రతి గ్రామం అద్భుత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ‘అందరం వ్యవసాయాన్ని ప్రేమిస్తాం’ అని సభకు హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement