మీడియాతో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
లోకేష్ చెప్పడంతో ప్రధాని అయ్యే అవకాశం వదులుకున్నా
ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పింది నేనే
అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసేందుకు చాలా కష్టపడ్డా
23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ప్రయత్నించా
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదిలేసుకున్నానని ఆయన అన్నారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటిస్తూ ఈ విషయం చెప్పారు. ముఖ్యమంత్రి పదవి అయితే శాశ్వతంగా ఉంటుందని.. ప్రధానమంత్రి పదవి తాత్కాలికమేనని అప్పట్లో తన కుమారుడు లోకేష్ బాబు చెప్పడంతో.. ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకున్నానని ఆయన అన్నారు.
అంతేకాదు.. 23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి తాను ప్రయత్నించానని కూడా చంద్రబాబు అన్నారు. (వాస్తవానికి ఏపీలో మండలి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అందులోకి ప్రవేశించడానికి కనీస వయసు 30 ఏళ్లు అని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి చెప్పారు). 28 ఏళ్లకే తాను మంత్రిని అయ్యానని, అసలు రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఎన్టీ రామారావుకు చెప్పింది కూడా తానేనని ఆయన అన్నారు. (ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అవసరమైతే మామపై పోటీ చేసేందుకు సిద్ధమని నాటి కాంగ్రెస్ నాయకుడిగా చంద్రబాబు ప్రకటించారు). ఇక అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసేందుకు తాను చాలా కష్టపడ్డానని కూడా ఆయన తెలిపారు. చివరకు నాటి ప్రధానమంత్రి వాజ్‌పేయిని అందుకు ఒప్పించానన్నారు.