రుణమాఫీపై ఆశలు | farmers hopes on loan waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై ఆశలు

Published Wed, Oct 1 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

farmers hopes on loan waiver

 సాక్షి, ఒంగోలు: పండగ రోజుల్లో పల్లెల్లో దైన్యం నెలకొంది. పంట రుణాల మాఫీపై రైతులు గంపెడాశతో ఉన్నారు. పీక ల్లోతు అప్పుల్లో కూరుకున్న వారు పాతరుణాలు మాఫీ అయితే.. కొత్త రుణాలొస్తాయని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పథకం అమల్లో పట్టీపట్టనట్టు వ్యవహరించడంతో.. క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు కూడా రైతులకు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు.

రుణమాఫీ అమలు విధివిధానాల మేరకు ప్రభుత్వం సూచించిన వివరాల కంప్యూటరీకరణపై బ్యాంకులు నిర్లక్ష్యం చూపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు మండలాల నుంచి బాధిత రైతులు సోమవారం ఒంగోలులో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై కలెక్టర్‌కు బ్యాంకర్లపై ఫిర్యాదులిచ్చారు. రైతుల రుణాలకు సంబంధించి సమగ్ర వివరాలను ‘ఆన్‌లైన్’లో పొందుపరచడంపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందినా.. బ్యాంకర్ల తీరులో మార్పుకనిపించడం లేదు.

 రాష్ట్రంలో ప్రతీ ఒక్క రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు పంటరుణం మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 7.5 లక్షల రైతుల రుణాల ఖాతాలుండగా, వాటిల్లో సుమారు రూ.3,600 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని అధికారుల అంచనా. రైతుల పేరుతో కొంతమంది బినామీలు తీసుకున్న రుణాల్ని గుర్తించేందుకు విధాన నిర్ణయాలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది.

ఆమేరకు సమగ్ర వివరాలను అందించాలని రైతులను కోరింది. ఇందుకు జిల్లాలోని బ్యాంకర్ల నుంచి పూర్తిస్థాయి సహకారం అందడం లేదు. వివరాలను పొందుపర్చడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. వీటిని పర్యవేక్షించాల్సిన లీడ్‌బ్యాంక్ అధికారుల ఆదేశాలను కొన్ని బ్యాంకులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 53.50 శాతం మాత్రమే వివరాలను పొందుపరిచారు.

  లీడ్‌బ్యాంకు గణాంకాల ప్రకారం జిల్లాలో 7,5,524 మంది రైతుల పంటరుణాల ఖాతాలన్నాయి. ఇవన్నీ రుణమాఫీకి అర్హమైనవిగా గుర్తించారు. సుమారు రూ.3,600 కోట్లు వరకు రుణమాఫీ చేయాల్సి ఉంది. ఎక్కువ రుణం తీసుకున్న రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తోందని ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పింది.

రుణాలు ఇప్పటికే చెల్లించిన వారికి తిరిగి చెల్లింపులు జరుపుతారని అధికారపార్టీ నేతలు ప్రచారం చేస్తున్నా.. వాటిల్లో స్పష్టత లేదు. మార్గదర్శకాల పేరుతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తొలుత సమగ్ర వివరాల కంప్యూటరీకరణకు గడువు సెప్టెంబర్ 25తో ఆఖరు అని ప్రకటించినా... బ్యాంకుల జాప్యంతో వచ్చేనెల 1వ తేదీ వరకు పొడిగించారు. అయినప్పటికీ గడువులోగా కంప్యూటరీకరణ చేయడంలో బ్యాంకులెంతగా సఫలీకృతులవుతారో తెలియాల్సి ఉంది.

 పాతసమాచారాన్నే.. కొత్తగా పొందుపరుస్తూ..
 రైతులు పంటరుణం తీసుకునే సమయంలో పట్టాదారు పాసుపుస్తకాలు తనఖా పెడతారు. టైటిల్‌డీడ్‌నూ బ్యాంకులు తీసుకుంటున్నాయి. బంగారం పెట్టినప్పుడు సేద్యం భూముల వివరాలను సమగ్రంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేస్తారు. సర్వే నంబర్‌తో సహా పొలం విస్తీర్ణం కూడా నమోదు చేసుకుంటూనే ఉన్నారు. రుణ అర్హతకు ఏఏ పంటలు వర్తిస్తాయనేది పరిశీలించి మరీ.. ఆయా పంటలు పండించే రైతులకే రుణాలిస్తారు.

నిబంధనల ప్రకారం రైతులకు ఎలాంటి తనఖా (కుదువ) లేకుండా రూ.లక్ష వరకు రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అయితే, బ్యాంకులు దీన్ని పాటించడం లేదు. కౌలు రైతులకు రుణాలు తీసుకునే సమయంలో ఎల్‌ఈసీ (రైతురుణ అర్హత గుర్తింపు) కార్డు ఉండాలి. పొలం సర్వేనంబర్ తప్పనిసరిగా అవసరం. అయితే, ఈ రెండింటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని రుణమిచ్చిన బ్యాంకులే లేకపోవడం గమనార్హం.

 కంప్యూటరీకరిస్తోన్న సమగ్ర వివరాలివే..
 రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకుల్లో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఇవ్వాలి.
 తాజాగా పట్టాదారు పాసుపుస్తకం కూడా బ్యాంకర్లకు అందజేయాలని కొత్త నిబంధన పెట్టారు. ఎంత విస్తీర్ణంలో ఏయే పంటలు సాగుచేస్తున్నారో కూడా వివరాలను అందజేయాల్సి ఉంటుంది.
 
ఆయా భూముల సర్వే నంబర్‌లు తప్పనిసరిగా ఇవ్వాలంటున్నారు. గతంలో పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులు వీఆర్వోల నుంచి ధ్రువీకరణలు తీసుకుని వాటిద్వారా రుణాలు తీసుకున్నారు. ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా తీసుకున్న పొలం అడంగల్ కాపీలు బ్యాంకర్లకు అందజేయాలి. అయితే, ప్రస్తుతం పాసుపుస్తకాలు లేని రైతులు నానాకష్టాలు పడుతున్నారు.
 
 వివాదాలు, డాట్ భూములకు సంబంధించిన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీకావడంలో జిల్లా అధికారుల వద్ద వందల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి రుణమాఫీ వర్తించడం సందిగ్ధమేనని తెలుస్తోంది.

 ఒకే సర్వే నంబర్‌పై పలు బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్న లబ్ధిదారులు అనేకమంది ఉన్నారు. ప్రస్తుతం వీటన్నింటినీ క్రోడీకరించి వీటిల్లో ఒక బ్యాంకు రుణాల్నే మాఫీచేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
 బ్యాంకుల్లో సిబ్బంది కొరత వల్ల ఈ పనులను తాము చేయలేకపోతున్నామని బ్యాంకర్లు వివరణ ఇస్తున్నారు. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా అకౌంట్‌ల సమగ్ర జాబితా తయారు చేసుకోవడం.. తాజాగా జన్‌ధన్ యోజన కింద కొత్త బ్యాంకు అకౌంట్‌లు తెరవడం తదితర కారణాలతో సిబ్బంది బిజీగా మారారంటూ బ్యాంకర్లు వివరణ ఇస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement