- యలమంచిలి కోర్టులో 19 మందిపై వ్యాజ్యాలు
- మరో 37 మందిపై దాఖలుకు చర్యలు
- నిర్ధారించిన ఎస్‌బీఐ బ్రాంచి మేనేజర్
యలమంచిలి : రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం తాత్సారంతో బ్యాంకర్లు తమపని తాము చేసుకుంటూ పోతున్నాయి. కాలపరిమితి తీరిన రుణాలపై నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు కూడా బ్యాంకులకు చెల్లించొద్దంటూ పదే పదే సభల్లో ప్రకటిస్తున్నారు. ప్రభుత్వమే అప్పులు తీరుస్తుందంటున్నారు.
ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలయినా రుణమాఫీ అమలు కాలేదు. డ్వాక్రా మహిళలూ రుణమాఫీ ఆశతో బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. ఈ క్రమంలో కాలపరిమితి తీరిన మొండి బకాయిల విషయంలో యలమంచిలి స్టేట్ బ్యాంక్ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. యల మంచిలి మున్సిపాలిటీ పరిధి కొక్కిరాపల్లికి చెందిన 19 మంది డ్వాక్రా మహిళలపై యల మంచిలి సబ్‌కోర్టులో దావాలు వేశారు.
కొక్కిరాపల్లిలోని 40 స్వయం సహాయక సంఘాలకు రూ.2కోట్లకుపైగా ఆరేళ్లక్రితం యలమంచిలి ఎస్‌బీఐ అప్పులిచ్చింది. దాదాపు 400 మంది మహిళలు రుణాలు పొందారు. వీరు తీసుకున్న రుణం వడ్డీతో కలిపి రూ.3.50కోట్లకు చేరుకుందని ఎస్‌బీఐ బ్రాంచి మేనేజర్ పి.ఎస్.శ్రీనివాసమూర్తి గురువారం విలేకరులకు చెప్పారు. తొలి దశలో 19 మంది మహిళలపై కేసులు వేశామన్నారు. మరో 37 మందిపై న్యాయస్థానంలో కేసులు వేసేందుకు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కాలపరిమితి తీరిన రుణాలపై నిబంధనల ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వం రుణమాఫీని వెంటనే అమలు చేసి తమను ఆదుకోవాలని డ్వాక్రా మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క ఎస్‌బీఐ నుంచే కాకుండా మిగతా బ్యాంకర్లు కూడా కోర్టుల్లో వ్యాజ్యాలు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ పరిణామం యలమంచిలిలో సంచలమైంది. డ్వాక్రా మహిళలు ఆందోళన చెందుతున్నారు.