
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్నలకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, డీబీటీ పథకాలు ఎంతో బాగున్నాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావు కారద్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుందని, డీబీటీతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. మంగళవారం విశాఖలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పథకాల అమలుకు బ్యాంకర్లు విధిగా సహకరించాలని సూచించారు.
ఏపీలో ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో బ్యాంకర్ల సేవలు మెరుగ్గా ఉన్నాయని, ఎస్‌ఎల్‌బీసీ లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సేవలను విస్తృతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు మరింత విస్తరించాలని సూచించారు. ప్రైవేట్ బ్యాంకులు తీరు మార్చుకుని సేవలను మెరుగు పరచుకోవాలన్నారు.
‘ముద్ర’ రుణాల మంజూరులో కరూర్ వైశ్యా బ్యాంకు బాగా వెనకబడిందని, మూడు నెలల్లో తీరు మార్చుకోవాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఎక్కువ మంది మహిళలకు రుణాలివ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న తోడు’ పథకం గురించి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఆరా తీశారు.
కౌలు రైతులకు బ్యాంకులు సహకారం అందించాలి..
ప్రైవేట్ బ్యాంకులు ఆశించిన స్థాయిలో రుణాలివ్వడం లేదని, కౌలు రైతులకు కొన్ని బ్యాంకుల నుంచి తగిన సహకారం అందడం లేదని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకిస్తున్న రుణాలు, టిడ్కో ఇళ్ల రుణ పరిమితిని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవసాయం, అనుబంధ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకర్లు మరింత సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రం లో సక్రమంగా అమలవుతున్నాయని రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రావత్ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ నవనీత్‌కుమార్, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ (ఏపీ) ఓఏ బషీర్, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, యూనియన్ బ్యాంక్ సీజీఎం మహాపాత్ర, ఎస్‌ఎల్‌బీసీ కోఆర్డినేటర్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment