Kishan Rao
-
రైతన్నకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్నలకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, డీబీటీ పథకాలు ఎంతో బాగున్నాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావు కారద్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుందని, డీబీటీతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. మంగళవారం విశాఖలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పథకాల అమలుకు బ్యాంకర్లు విధిగా సహకరించాలని సూచించారు. ఏపీలో ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో బ్యాంకర్ల సేవలు మెరుగ్గా ఉన్నాయని, ఎస్ఎల్బీసీ లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సేవలను విస్తృతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు మరింత విస్తరించాలని సూచించారు. ప్రైవేట్ బ్యాంకులు తీరు మార్చుకుని సేవలను మెరుగు పరచుకోవాలన్నారు. ‘ముద్ర’ రుణాల మంజూరులో కరూర్ వైశ్యా బ్యాంకు బాగా వెనకబడిందని, మూడు నెలల్లో తీరు మార్చుకోవాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఎక్కువ మంది మహిళలకు రుణాలివ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న తోడు’ పథకం గురించి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఆరా తీశారు. కౌలు రైతులకు బ్యాంకులు సహకారం అందించాలి.. ప్రైవేట్ బ్యాంకులు ఆశించిన స్థాయిలో రుణాలివ్వడం లేదని, కౌలు రైతులకు కొన్ని బ్యాంకుల నుంచి తగిన సహకారం అందడం లేదని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకిస్తున్న రుణాలు, టిడ్కో ఇళ్ల రుణ పరిమితిని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవసాయం, అనుబంధ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకర్లు మరింత సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రం లో సక్రమంగా అమలవుతున్నాయని రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రావత్ తెలిపారు. సమావేశంలో ఎస్ఎల్బీసీ కన్వీనర్ నవనీత్‌కుమార్, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ (ఏపీ) ఓఏ బషీర్, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, యూనియన్ బ్యాంక్ సీజీఎం మహాపాత్ర, ఎస్ఎల్బీసీ కోఆర్డినేటర్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
44 మందికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు
నాంపల్లి: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో విశేషమైన సేవలందించిన 44 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020వ సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన సాహితీ ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. పురస్కారాల విజేతలు వీరే... డాక్టర్ సముద్రాల వెంకటరంగ రామానుజాచార్యులు(ఆధ్యాత్మిక సాహిత్యం), పుత్తా పుల్లారెడ్డి(ప్రాచీన సాహిత్యం), డాక్టర్ వి.వి.రామారావు (సృజనాత్మక సాహిత్యం), టి.వి. ప్రసాద్ (కాల్పనిక సాహిత్యం), వారాల ఆనంద్ (అనువాద సాహిత్యం), ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి(బాల సాహిత్యం), డాక్టర్ ఎ.వి.వీరభద్రాచారి(వచన కవిత), కొరుప్రోలు మాధవరావు(తెలుగు గజల్), జి.వి.కృష్ణమూర్తి(పద్యరచన), డాక్టర్ మాదిరాజు బ్రహ్మానందరావు(పద్యరచన), డాక్టర్ పసునూరి రవీందర్(కథ), వేముల ప్రభాకర్(నవల), ఆర్.సి.కృష్ణస్వామిరాజు (హాస్య రచన), జి.భగీరథ(జీవిత చరిత్ర), తాళ్లపల్లి మురళీధరగౌడ్(వివిధ ప్రక్రియలు), చిలువేరు రఘురాం(నాటక రచయిత), డాక్టర్ వి.వి.వెంకటరమణ(జనరంజక విజ్ఞానం), ఎస్.వి.రామారావు (పరిశోధన), అన్నవరపు బ్రహ్మయ్య(పత్రికారచన), రాళ్లపల్లి సుందర్రావు(భాష), ఘట్టమరాజు అశ్వత్థామనారాయణ(సాహిత్య విమర్శ), కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి(అవధానం), పి.వి.సాయిబాబ (లలిత సంగీతం), డాక్టర్ కె.శేషులత(శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు), ఎం.డి.రజియా(జానపద కళారంగం), పస్తం కొమురమ్మ(జానపద కళలు), డాక్టర్ పొనుగోటి సరస్వతి(ఉత్తమ రచయిత్రి), శైలజామిత్ర(ఉత్తమ రచయిత్రి), నాగమణి(ఉత్తమనటి), మాలెల అంజిలయ్య(ఉత్తమ నటుడు) ప్రొఫెసర్ భాస్కర్ శివాల్కర్ (నాటక రంగంలో కృషి), పేరిణి ప్రకాశ్(పేరిణి), డాక్టర్ రుద్రవరం సుధాకర్(కూచిపూడి నృత్యం), డాక్టర్ గెల్లి నాగేశ్వరరావు(సంఘసేవ), పేరలింగం(హేతువాద ప్రచారం), బండారు విజయ(మహిళాభ్యుదయం), డాక్టర్ ముదిగంటి సుధాకర్‌రెడ్డి (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), ప్రొఫెసర్ గజ్జల రామేశ్వరం(గ్రంథాలయకర్త), ఆకృతి సుధాకర్(సాంస్కృతిక సంస్థ నిర్వహణ), శ్యామ్ (ఇంద్రజలం), నారు (కార్టూనిస్ట్), డాక్టర్ ఎ.ఎస్.ఫణీంద్ర (జ్యోతిషం), ఎజాజ్ అహ్మద్ (ఉత్తమ ఉపాధ్యాయుడు), ప్రొఫెసర్ ప్రీతి సంయుక్త(చిత్రలేఖనం) తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ నెల 28, 29వ తేదీలలో హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రూ.5,116 నగదు, పురస్కారపత్రంతో సత్కరిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
అవార్డులు గౌరవాన్ని పెంచాలి
సిరిసిల్ల కల్చరల్: జ్ఞాన సముపార్జనకు వయసుతో నిమిత్తంలేదని, జీవితకాలంపాటు అధ్యయనం చేయొచ్చని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు అన్నారు. రంగినేని సుజాతమోహన్‌రావు తన మాతృమూర్తి ఎల్లమ్మ స్మారకార్థం ఇచ్చే జాతీయస్థాయి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం ఆదివారం ఇక్కడ ప్రముఖకవి జూకంటి జగన్నాథం అధ్యక్షతన జరిగింది. కిషన్‌రావు మాట్లాడుతూ కవిగా వచ్చిన గుర్తింపు, అందిన పురస్కారాలు గౌరవాన్ని పెంచాలని, గర్వాన్ని దరి చేరనీయొద్దని సూచించారు. ప్రాంతానికో మాండలీకం ఉన్నప్పటికీ మౌలికంగా సంవేదనలోంచి వచ్చిన కవిత్వమే సమాజంలో నిలిచిపోతుందన్నారు. అనంతరం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ల గోపాల్‌కు రంగినేని సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రశంసాపత్రం, రూ.25 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో కవులు డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ పత్తిపాక మోహన్, అన్నవరం దేవేందర్, పెద్దింటి అశోక్, డాక్టర్ బెల్లి యాదయ్య, ఎలగొండ రవి, జిందం అశోక్, మానేరు రచయితల సంఘం, సాహితీ సోపతి, సిరిసిల్ల సాహితీ సమితి ప్రతినిధులతోపాటు సిద్దిపేట, కరీంనగర్‌కు చెందిన పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. మానేటి బిడ్డనే.. మేనమామ ఇంట్లో పుట్టా.. ఇదే జిల్లాలోని గూడెం గ్రామం మా అమ్మమ్మ వాళ్లది. మేనమామ ఇంట్లోనే పుట్టాను. నా మూడేళ్ల వయçసులో అనుకుంటా. ఎడ్లబండి మీద సిరిసిల్లలోని రాజేశ్వర్ థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చాను. తోటివాళ్లంతా సినిమా చూస్తుంటే నేను మాత్రం ఉశికెతో ఆడుకున్నట్లు గుర్తుంది. అలా మానేరు నా మదిలో ఉండిపోయింది. – తంగెడ కిషన్‌రావు, తెలుగు వర్సిటీ వీసీ మానేటి కవులే నాకు ప్రేరణ పశువుల కాపరిని సాహిత్యానికి పరిచయం చేసిన పాలమూరుకు, నన్ను కవిగా ఆవిష్కరించుకునేందుకు ప్రేరణ ఇచ్చిన మానేటి కవులకు కృతజ్ఞతలు. సత్కరించిన మానేటి సహృదయులకు పాలమూరు కన్నీటి బొట్లతో అభిషేకం చేస్తున్నా. మా అమ్మ పేరూ ఎల్లమ్మనే కాబట్టి ఈ పురస్కారాన్ని అందుకోవాలని కలలు కన్నా. – తగుళ్ల గోపాల్, రంగినేని ఎల్లమ్మ పురస్కార గ్రహీత -
యాదాద్రి విల్లాకు రూ.7.5 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండకు దిగువన యాదగిరిపల్లి సమీపంలో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలకు దాతలు సహకారాన్ని అందించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రెసిడెన్షియల్ సూట్‌తో పాటు 14 విల్లాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక వీవీఐపీ విల్లాకు హైదరాబాద్‌కు చెందిన కాటూరి వైద్య కళాశాల చైర్మన్ కాటూరి సుబ్బారావు రూ.7.5 కోట్ల విరాళం అందించారు. వీవీఐపీ విల్లా తాళాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డిలు దాత కాటూరి సుబ్బారావుకు అందజేశారు. గత నెల 12న ప్రెసిడెన్షియల్ సూట్‌తోపాటు 13 విల్లాలను దాతలకు అధికారులు కేటాయించారు. -
అన్ని వర్గాలకు జరిగేలా బడ్జెట్లో కేటాయింపులు: కేంద్ర మంత్రి
-
బడ్జెట్‌పై దేశమంతా చర్చలు
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావు కరాడే తెలిపారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అనంతరం బడ్జెట్‌పై వివిధ రంగాల నిపుణులతో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ప్రతిపక్షాలు బడ్జెట్‌పై చేస్తున్న అసత్యాలను ప్రజలు నమ్మవద్దని, వాస్తవాలను అర్థం చేసుకోవాలని కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నులు విధించకుండా ప్రాధాన్యతా రంగాలకు అధిక కేటాయింపులు చేసినట్లు చెప్పారు. జాతీయ రహదారులు, పోర్టులు, ఇండస్ట్రియల్ సెక్టార్‌కు భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. గ్రామీణ భారతంలో పోస్టాఫీసుల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందజేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. దేశ ప్రజలందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణం 78 శాతం పూర్తయిందన్నారు. రాష్ట్రంలో పోర్టులు కట్టాలని మోదీ కలలు కంటున్నారని చెప్పారు. లతా మంగేష్కర్ మృతిపట్ల సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. లతా మరణం దేశానికి తీరని లోటని సోము వీర్రాజు పేర్కొన్నారు. కార్యకర్తలు కష్టపడితే బీజేపీకి అధికారం కార్యకర్తలు కష్టించి పనిచేస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారం సాధించడం సాధ్యమేనని కేంద్రమంత్రి భగవత్ కిషన్‌రావు కరాడే పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. భగవత్ కిషన్‌రావు కరాడేకు ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్, ప్రెసిడెంట్–ఎలక్ట్ పొట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌తో కూడిన బృందం వినతిపత్రం అందజేసింది. దుర్గమ్మ సేవలో కేంద్ర మంత్రి ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావు కరాడే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. -
వేగం పుంజుకున్న ‘యాదాద్రి’ పనులు
సాక్షి, యాదాద్రి : యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రధానాలయంతోపాటు శివాలయం, కొండ కింద చేపట్టిన పనులు వేగవంతమయ్యాయి. సీఎం కేసీఆర్ గతనెల 17న యాదాద్రిలో పర్యటించిన సమయంలో ఇచ్చిన ఆదేశాలతో పనుల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. ఫిబ్రవరిలో మహాయాగాన్ని చేపట్టి ప్రధానాలయంలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలని సీఎం సూచించిన విషయం తెలిసిందే. సీఎం ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంతోపాటు అధికారులకు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ప్రధానాలయం పనులను వేగవంతం కోసం అధికారులు, శిల్పులు శ్రమిస్తున్నారు. గర్భాలయం, ముఖమండపం, ఆలయంలో పంచనారసింహుల రాతి విగ్రహాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గర్భాలయంలో కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేయగా మరికొన్నింటిని ప్రతిష్టించే పనిలో ఉన్నారు. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం పక్కన మెట్ల పనులు జరుగుతుండగా, గరుత్మంతుడు, ఆంజనేయస్వామి విగ్రహాల ఏర్పాటు, ఆలయ నవీకరణ, ఫ్లోరింగ్, ప్రాకార మండపాలు, తిరుమాఢవీధుల్లో ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. అష్టభుజి మండపాలపై శిల్పాలకు మెరుగుదిద్దడం, పంచతల రాజగోపురాలపై మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. కొండపైన సత్యనారాయణ వ్రతమండపం, ప్రసాదాల తయారీ భవనం, కల్యాణ మండపం, అష్టభుజి ప్రాకారాల తుది మెరుగులతోపాటు ఆలయంలో విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. శివాలయం పనుల్లో కూడా వేగం పెంచారు. కొండపైన ఆలయం శిల్పాల పనులతో సమాంతరంగా సివిల్ పనులు చేస్తున్నారు. అలాగే కొండపైన వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. రహదారుల విస్తరణ పనులు.. యాదాద్రి ప్రధానాలయానికి నలుదిక్కులా రోడ్ల విస్తరణపై అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా రాయగిరి నుంచి యాదగిరిగుట్టకు చేరుకునే రోడ్డు పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం పాతగుట్ట క్రాస్ రోడ్డు వద్ద నిలిచిపోయిన పనులను ప్రధానాలయం వరకు చేసే కార్యక్రమంలో అధికారులు బిజీబిజీగా ఉన్నా రు. రోడ్డు వెడల్పు చేయడంతోపాటు సెంట్రల్ లైటింగ్, ఇరువైపులా మొక్కలు నాటడం, రోడ్డును తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నారు. రోడ్డు విస్తరణ విషయంలో బాధితులతో పలు మార్లు చర్చలు జరిపినప్పటికీ వారికి ఆశిం చిన మేరకు లబ్ధి చేకూరడం లేదన్న ఆందోళనలో ఉన్నారు. నిర్వాసితులు తగిన నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కొత్త విద్యుత్ టవర్ల ఏర్పాటు రోడ్డు వెడల్పు సమయంలో విద్యుత్ టవర్లను ఏర్పాటు చేయడానికి ఆ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రహదారి విస్తరణతో సమాంతరంగా టవర్లు ఏర్పాటు చేయడానికి ట్రాన్స్‌కో అధికారులు సిద్ధమయ్యారు. అధికారులు భూసేకరణ చేసే సమయంలోనే టవర్ల కోసం స్థల సేకరణ చేయనున్నారు. దేవస్థానంలో జరుగుతున్న ప్రధానాలయం పునర్నిర్మాణ పనులను మంగళవారం ఉదయం వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు పరిశీలించారు. గర్భాలయం, రాజగోపురాలు, ఆలయ తిరుమాడ వీధులు, ఇటీవల వచ్చిన జయ, విజయుల ద్వార పాలకుల విగ్రహాలను పరిశీలించారు. అక్కడి నుంచి శివాలయానికి వెళ్లి పనులను పరిశీలించారు. ముఖ, నవగ్రహ మండపాల పనులను సరిగ్గా నడుస్తున్నాయా ? లేదా అని ఆరా తీశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నంచి నూతనంగా నిర్మాణం జరుగుతున్న ప్రసాద విక్రయశాల నిర్మాణ భవనాలను సందర్శించారు. ప్రసాదాల తయారీకి సంబంధించి మరిని మషనరీలరావడంతో వాటి ఉపయోగం గురించి ఆయనకు తెలియజేశారు. ప్రసాదాల తయారీకి సంబంధించిన 4అంతస్థుల భవనంలో ఏయే అంతస్థులో ఏమేమి వస్తాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట స్థపతి ఆనందాచారి వేలు, ఆలయ ఈఓ గీతారెడ్డి, శిల్పులు మొగిలి, ఆదిత్య చిరంజీవి, పలువురు అధికారులు ఉన్నారు. -
సమకాలీనతకు అద్దంపట్టే చిత్రాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఖ్యాతిని ఆర్జించే తరహాలో అత్యద్భుతంగా నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయం బాహ్య ప్రాకారంలోని అష్టభుజి మండపంలో సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించే ఆకృతులను శిల్పులు చెక్కారని వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్‌రావు పేర్కొన్నారు. సమాజంపై ప్రభావం చూపిన అంశాలకు సంబంధించిన చిత్రాలను భావి తరాలకు అందించే ఉద్దేశంతో దేవాలయాల్లో శిల్పాలు, చిత్రాలు చెక్కడం అనాదిగా వస్తోందన్నారు. యాదాద్రిలో శిల్పాలకు సంబంధించి శిల్పులు సొంతంగా తీసుకున్న నిర్ణయమే తప్ప, ప్రభుత్వ పాత్ర లేదని ఆయన స్పష్టంచేశారు. యాదాద్రి దేవాలయం బాహ్య ప్రాకారంలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ చిహ్నం కారు సహా పలు చిత్రాలు ఉన్న తీరుపై ఓ పత్రికలో కథనం వచ్చిన నేపథ్యంలో ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, స్థపతి సలహాదారు వేలుతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. పెద్దపెద్ద ఆలయాలను కట్టించిన రాజులు, ప్రధాన శిల్పుల చిత్రాలతోపాటు నాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రాలు తిరుపతి, అహోబిళం, శ్రీశైలం సహా పలు పురాతన దేవాలయాల్లో కనిపిస్తాయని.. ఆ కోవలోనే ఈ చిత్రాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇందులో కేసీఆర్‌ను పోలిన ఔట్లైన్తో కూడిన చిత్రమే ఉందని, అది ఆయన పూర్తి ముఖ రూపు కాదని తెలిపారు. కారు బొమ్మ కూడా ఓ పార్టీ చిహ్నంగా భావించొద్దని, ఈ కాలంలో ఉన్న వాహనాలకు గుర్తుగా దాన్ని చెక్కారని వివరణ ఇచ్చారు. కారుతోపాటు సైకిల్, సైకిల్ రిక్షా, గుర్రపు బండి చిత్రాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కమలం పువ్వు చిత్రం కూడా ఉందని, అంత మాత్రాన దాన్ని ఓ పార్టీ చిహ్నం గా భావిస్తామా అని ప్రశ్నించారు. -
పంజాబ్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర ఆగ్రోస్ బృందం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ సంబంధిత అంశాలను అధ్యయనం చేసేందుకు ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, ఎండీ ఎం.సురేందర్, జనరల్ మేనేజర్ చంద్రరాజమోహన్‌లతో కూడిన బృందం పంజాబ్‌లో పర్యటిస్తోంది. ఈ మేరకు ఆగ్రోస్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మూడో రోజు సందర్శనలో భాగంగా వీరు లూథియానా జిల్లాలో ఉన్న పంజాబ్ రాష్ట్ర ఆగ్రోస్ పెట్రోల్ పంప్ పనితీరును, పంజాబ్ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలోని ప్యాకింగ్ హౌస్ పనితీరును పరిశీలించారు. పంజాబ్ ఆగ్రోస్‌కు చెందిన మెగా ఫుడ్ పార్కును సందర్శించారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మెగా ఫుడ్ పార్కులో గోద్రెజ్, బజాజ్, మెగా మీట్, గోదాము లు, కోల్డ్ స్టోరేజీలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా చైర్మన్ కిషన్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పాలని, రైతుకు లాభం చేకూరేలా రైతు ఉత్పత్తి చేసిన సరుకులను ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా మార్కెటింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
బీసీ సంఘాల నేతలది ఆర్థిక రాజకీయం
సాక్షి, హైదరాబాద్: కొందరు బీసీ సంఘాల నేతలు ఆర్థిక రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి కిషన్‌రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన టీఆర్ఎస్ నేత చిక్కాల రామారావుతో కలిసి తెలంగాణ భవ న్లో విలేకరులతో మాట్లాడారు. ‘బీసీ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ను తప్పుపడుతూ కొన్ని పార్టీలు, బీసీ సంఘాల నేతలు మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. కొందరు బీసీ సంఘాల నేతల ముసుగులో ఆర్థిక రాజకీయం చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వానికి బీసీలు బ్రహ్మరథం పట్టారు. టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచేందుకు తోడ్పడ్డారు. కేసీఆర్‌ను విమర్శిస్తున్న నాయకుల వెంట బీసీలు లేరు. బీసీల కోసం ఏ సీఎం ప్రవేశపెట్టని పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టారు. బీసీలకు రాజకీయంగా ఉన్నత పదవులిచ్చి గౌరవించారు. అందుకే బీసీలు ఓట్లతో ఆశీర్వదించారు’అని వ్యాఖ్యానించారు. -
‘సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ’
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.కిషన్‌రావు అన్నారు. బుధవారం సింగరేణి భవన్లో జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ పండుగను సింగరేణి కాలరీస్ ప్రాంతాల్లో ఈ ఏడాది వైభవంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇలాంటి పండుగల ద్వారా ఉద్యోగుల్లో మరింత అంకిత భావం నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజా కవి జయరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ప్రేమ్‌కుమార్, జనరల్ సెక్రటరీ రాజశేఖర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ బి.భాస్కర్ , సింగరేణి భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పంపిణీ భూమిని పరిశీలించిన కలెక్టర్
దామరచర్ల మండల పరిధిలోని ముదిమానిక్యం గ్రామంలోని దళితులకు పంపిణీ చేయనున్న 80 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. కలెక్టర్‌తో పాటు ఆర్డీఓ కిషన్‌రావు, తహసీల్దార్ గణేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్ ఉన్నారు. -
జానకీపురం ఎన్‌కౌంటర్‌పై ఆర్డీఓ విచారణ
మిర్యాలగూడ మోత్కూర్ మండలం జానకీపురం వద్ద ఏప్రిల్ 4వ తేదీన సిమి ఉగ్రవాదులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పులపై మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో మిర్యాలగూడ ఆర్డీఓ బి.కిషన్‌రావు విచారణ నిర్వహించారు. విచారణకు ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరినీష, ఆయన సోదరులు దస్తగిరి, పెద్ద పాష, దస్తయ్య, గాంధీ మెడికల్ ప్రొఫెసర్ తఖియొద్ధీన్, ఎన్కౌంటర్లో మృతిచెందిన సిమి ఉగ్రవాది ఎజాజుద్ధీన్ తండ్రి అజాజుద్ధీన్, మోత్కుర్ ఎస్ఐ పురుందర్‌బట్ హాజరు కావల్సి ఉంది. అయితే మోత్కూర్ ఎస్ఐ మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని ఆర్డీఓ నమోదు చేసుకున్నారు. మోత్కూర్ మండలం జానకిపురం వద్ద పోలీసులు - సిమి ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనపై మొత్తం 43 మందిని విచారణ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆరుగురు మినహా అందరినీ విచారించినట్లు ఆర్డీఓ తెలిపారు. ఏడుగురిలో ఆరుగురు హాజరు కాకపోవడంతో విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. -
పర్యాటక క్షేత్రంగా శిల్పారామం!
కబ్జాలను నిర్మూలించి పూర్వవైభవం తీసుకొస్తాం హస్తకళలల ప్రదర్శన ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ ప్రతి జిల్లా కేంద్రంలో మినీ శిల్పారామం కాకతీయ శిల్పసంపదనుకాపాడిన నిజాములు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తమ కళాఖండంగా తీర్చి దిద్దుతామని, శిల్పారామా న్ని అద్భుత కళాక్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా మార్చుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. శిల్పారామంలో అఖిలభారత హస్తకళల ప్రదర్శనను సోమవారం సీఎం ప్రారంభించి అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. పర్యాటక కేంద్రాలతో పాటు, జిల్లా కేంద్రాల్లో శిల్పారామాలను ఏర్పాటు చేస్తామన్నారు. శిల్పారామానికి ప్రభుత్వం కేటాయించిన 67 ఎకరాల్లో 24 ఎకరాలు కొందరు దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాల క్రయావిక్రయాల నిషేధపుస్తకంలో దీన్ని గత ప్రభుత్వం నమోదు చేయకపోవడంతోనే కబ్జాకు గురయిందన్నారు. పల్లె సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా ఉండాల్సిన శిల్పారామంలో సిమెంట్ నిర్మాణాలు జరిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగుళం స్థలం కూడా కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వప్రధాన కార్యదర్శిని, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు తన రక్తం ధారవోసి దీన్ని నిర్మించారని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రశంసించారు. శిల్పాలను కాపాడిన అసఫ్జాహీలు... నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరలు, రామప్ప శిల్పాలు, గద్వాల్ చేనేత వస్త్రాలు తెలంగాణకు తలమానికమన్నారు. కాకతీయుల కళావైభవాన్ని స్మరించుకుంటూ ‘కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప’ అనే చరణాన్ని తానే రాశానని సీఎం కేసీఆర్ చెప్పారు. కాకతీయుల కళారూపాలను అసిఫ్జాహీ రాజులు సైతం ఎంతో అపురూపమైనవిగా పరిగణించి కాపాడారని తెలిపారు. నిజాం కాలంలో జరిగిన ఓ ఉదంతాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. నాటి వరంగల్ జిల్లా కలెక్టర్ రామప్పగుడిలో అమర్చిన ఓ చిన్న శిల్పాన్ని తీసుకెళ్లి తన కార్యాలయం బల్లపై పెట్టుకోగా, విచారణ జరిపించిన నిజాం వెంటనే కలెక్టర్ హోదాను తగ్గించి అక్కడి నుంచి బదిలీ చేసి, ఆ శిల్పాన్ని గుడిలో యథాస్థానంలో ప్రతిష్ఠింపజేశారని వివరించారు. ‘మనుషులుగా మనం ఈ రోజు వుంటాం. రేపు ఉండం. సాంస్కృతికి వైభవం ఓ తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ ఉంటది. దానిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నెల 31 వరకు మేళా... 19వ అఖిల భారత హస్తకళా మేళ ఈ నెల 31వ వరకు కొనసాగుతుంది. హస్తకళా మేళాలో నిర్వహించిన మహబూబ్‌నగర్ బైండ్ల కళాకారుల జమిడిక మోత, కరీంనగర్ కళాకారుల డప్పు దరువులు, వరంగల్ లంబాడి నృత్యాలు, పోతురాజుల ఆటలు, పంజాబీ దాండియా రక్తికట్టించాయి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మంత్రి జగదీశ్‌రెడ్డి,సలహాదారు పాపారావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి, పర్యాటక శాఖ కార్యదర్శి బీపీ ఆచార్య, ప్రత్యేకాధికారి కిషన్‌రావు, జనరల్ మేనేజర్ సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ పోలీసు అధికారుల సర్వీసు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ పోలీసు అధికారుల సర్వీసును రెండు సంవత్సరాల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇంటెలిజెన్స్ విభాగంలో పొలిటికల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి కిషన్‌రావు, యాంటీ నక్సలైట్ నిఘా విభాగంలో నాన్‌కేడర్ ఎస్పీగా పనిచేస్తున్న నర్సింగ్‌రావు, ఇంటెలిజెన్స్ హైదరాబాద్ రీజినల్ అధికారి, అదనపు ఎస్పీ జగన్మోహన్రెడ్డి ఈ సర్వీసు పొడిగించిన జాబితాలో ఉన్నారు. ఇందులో కిషన్‌రావు ఇంటెలిజెన్స్ ఎస్పీగా 2003లోనే పదవీవిరమణ చేయాల్సి ఉంది. అయితే నిఘా విభాగంలో అపార అనుభవం కలిగి, అత్యంత సమర్థుడిగా పేరు పొందిన కిషన్‌రావు సేవలు అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వాలు 2003 నుంచి పొడిగిస్తూ వస్తున్నాయి.