పర్యాటక క్షేత్రంగా శిల్పారామం!
- కబ్జాలను నిర్మూలించి పూర్వవైభవం తీసుకొస్తాం
- హస్తకళలల ప్రదర్శన ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
- ప్రతి జిల్లా కేంద్రంలో మినీ శిల్పారామం
- కాకతీయ శిల్పసంపదనుకాపాడిన నిజాములు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తమ కళాఖండంగా తీర్చి దిద్దుతామని, శిల్పారామా న్ని అద్భుత కళాక్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా మార్చుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. శిల్పారామంలో అఖిలభారత హస్తకళల ప్రదర్శనను సోమవారం సీఎం ప్రారంభించి అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. పర్యాటక కేంద్రాలతో పాటు, జిల్లా కేంద్రాల్లో శిల్పారామాలను ఏర్పాటు చేస్తామన్నారు.
శిల్పారామానికి ప్రభుత్వం కేటాయించిన 67 ఎకరాల్లో 24 ఎకరాలు కొందరు దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాల క్రయావిక్రయాల నిషేధపుస్తకంలో దీన్ని గత ప్రభుత్వం నమోదు చేయకపోవడంతోనే కబ్జాకు గురయిందన్నారు. పల్లె సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా ఉండాల్సిన శిల్పారామంలో సిమెంట్ నిర్మాణాలు జరిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగుళం స్థలం కూడా కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వప్రధాన కార్యదర్శిని, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు తన రక్తం ధారవోసి దీన్ని నిర్మించారని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రశంసించారు.
శిల్పాలను కాపాడిన అసఫ్‌జాహీలు...
నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరలు, రామప్ప శిల్పాలు, గద్వాల్ చేనేత వస్త్రాలు తెలంగాణకు తలమానికమన్నారు. కాకతీయుల కళావైభవాన్ని స్మరించుకుంటూ ‘కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప’ అనే చరణాన్ని తానే రాశానని సీఎం కేసీఆర్ చెప్పారు. కాకతీయుల కళారూపాలను అసిఫ్‌జాహీ రాజులు సైతం ఎంతో అపురూపమైనవిగా పరిగణించి కాపాడారని తెలిపారు. నిజాం కాలంలో జరిగిన ఓ ఉదంతాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.
నాటి వరంగల్ జిల్లా కలెక్టర్ రామప్పగుడిలో అమర్చిన ఓ చిన్న శిల్పాన్ని తీసుకెళ్లి తన కార్యాలయం బల్లపై పెట్టుకోగా, విచారణ జరిపించిన నిజాం వెంటనే కలెక్టర్ హోదాను తగ్గించి అక్కడి నుంచి బదిలీ చేసి, ఆ శిల్పాన్ని గుడిలో యథాస్థానంలో ప్రతిష్ఠింపజేశారని వివరించారు. ‘మనుషులుగా మనం ఈ రోజు వుంటాం. రేపు ఉండం. సాంస్కృతికి వైభవం ఓ తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ ఉంటది. దానిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ నెల 31 వరకు మేళా...
19వ అఖిల భారత హస్తకళా మేళ ఈ నెల 31వ వరకు కొనసాగుతుంది. హస్తకళా మేళాలో నిర్వహించిన మహబూబ్‌నగర్ బైండ్ల కళాకారుల జమిడిక మోత, కరీంనగర్ కళాకారుల డప్పు దరువులు, వరంగల్ లంబాడి నృత్యాలు, పోతురాజుల ఆటలు, పంజాబీ దాండియా రక్తికట్టించాయి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మంత్రి జగదీశ్‌రెడ్డి,సలహాదారు పాపారావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి, పర్యాటక శాఖ కార్యదర్శి బీపీ ఆచార్య, ప్రత్యేకాధికారి కిషన్‌రావు, జనరల్ మేనేజర్ సాయన్న తదితరులు పాల్గొన్నారు.