శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్‌రావు. చిత్రంలో çస్థపతి సలహాదారు వేలు, ఆనంద్‌సాయి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఖ్యాతిని ఆర్జించే తరహాలో అత్యద్భుతంగా నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయం బాహ్య ప్రాకారంలోని అష్టభుజి మండపంలో సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించే ఆకృతులను శిల్పులు చెక్కారని వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్‌రావు పేర్కొన్నారు. సమాజంపై ప్రభావం చూపిన అంశాలకు సంబంధించిన చిత్రాలను భావి తరాలకు అందించే ఉద్దేశంతో దేవాలయాల్లో శిల్పాలు, చిత్రాలు చెక్కడం అనాదిగా వస్తోందన్నారు. యాదాద్రిలో శిల్పాలకు సంబంధించి శిల్పులు సొంతంగా తీసుకున్న నిర్ణయమే తప్ప, ప్రభుత్వ పాత్ర లేదని ఆయన స్పష్టంచేశారు. యాదాద్రి దేవాలయం బాహ్య ప్రాకారంలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ చిహ్నం కారు సహా పలు చిత్రాలు ఉన్న తీరుపై ఓ పత్రికలో కథనం వచ్చిన నేపథ్యంలో ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, స్థపతి సలహాదారు వేలుతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
పెద్దపెద్ద ఆలయాలను కట్టించిన రాజులు, ప్రధాన శిల్పుల చిత్రాలతోపాటు నాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రాలు తిరుపతి, అహోబిళం, శ్రీశైలం సహా పలు పురాతన దేవాలయాల్లో కనిపిస్తాయని.. ఆ కోవలోనే ఈ చిత్రాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇందులో కేసీఆర్‌ను పోలిన ఔట్‌లైన్‌తో కూడిన చిత్రమే ఉందని, అది ఆయన పూర్తి ముఖ రూపు కాదని తెలిపారు. కారు బొమ్మ కూడా ఓ పార్టీ చిహ్నంగా భావించొద్దని, ఈ కాలంలో ఉన్న వాహనాలకు గుర్తుగా దాన్ని చెక్కారని వివరణ ఇచ్చారు. కారుతోపాటు సైకిల్, సైకిల్ రిక్షా, గుర్రపు బండి చిత్రాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కమలం పువ్వు చిత్రం కూడా ఉందని, అంత మాత్రాన దాన్ని ఓ పార్టీ చిహ్నం గా భావిస్తామా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment