బ్యాంకుల్లో పైసల్లేవు.. | No money in the banks | Sakshi
Sakshi News home page

బ్యాంకుల్లో పైసల్లేవు..

Published Thu, Jun 22 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

బ్యాంకుల్లో పైసల్లేవు..

బ్యాంకుల్లో పైసల్లేవు..

అదనంగా నెలకు రూ. 2 వేల కోట్లివ్వండి
- రిజర్వ్‌ బ్యాంకును కోరిన ఎస్‌ఎల్‌బీసీ
- రూ. 400 కోట్లు అడిగిన ఎస్‌బీఐ
- ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ. 39,752 కోట్లు


సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకుల్లో నగదు కొరత వేధిస్తోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)కు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) మొరపెట్టుకుంది. ఖరీఫ్‌లో పంట రుణాలు ఇవ్వలేకపోతున్నామని, కాబట్టి తమ అవసరాలకు తగ్గట్లు డబ్బు అందజేయాలని కోరింది. ఎస్‌ఎల్‌బీసీ విన్నపానికి స్పందించిన ఆర్బీఐ ఎంత నగదు కావాలో బ్యాంకుల వారీగా ఇండెంట్‌ ఇవ్వాలని కోరింది. దీంతో వెంటనే ఎస్‌ఎల్‌బీసీ పంట రుణాలు అందజేసేందుకు ఇప్పుడున్న నగదుకు అదనంగా నెలకు రూ.2 వేల కోట్లు కావాలని ఆర్బీఐని కోరినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.

ఉమ్మడి ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్‌ బ్యాంకే నెలకు రూ.400 కోట్లు అదనంగా ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీంతో త్వరలో నగదు పంపిస్తామని చెప్పింది. అయితే ఎప్పటిలోగా అందజేయనుందో మాత్రం ప్రకటించలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నగదు కొరత ఎప్పుడు తీరుతుందో రైతు చేతికి ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియకుండా ఉంది.

బ్యాంకుల్లోనే వేల కోట్ల రైతు డబ్బు..
వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్‌  పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 12 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగింది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు కోసం రైతులు పంట రుణాలకు వెళ్తున్నారు. బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును తీసుకుందామనుకున్నా అక్కడ డబ్బు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి కొనుగోళ్లు చివరి దశకు వచ్చాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. విక్రయించిన ఆ ధాన్యానికి ప్రభుత్వం రూ.5,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది.

మొత్తం 7 లక్షల మంది రైతుల డబ్బు బ్యాంకుల్లోనే ఉంది. ఈ డబ్బులో దాదాపు రూ.1,500 కోట్లు మాత్రమే రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన రూ.4 వేల కోట్ల రైతు సొమ్ము బ్యాంకుల్లోనే ఉంది. అవసరాల కోసం రైతులు తమ సొమ్మును తామే తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రంలో పలు చోట్ల రైతులు బ్యాంకుల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. వరి అమ్మగా వచ్చిన రూ.75 వేలను ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసిందని, దాన్ని తీసుకోవడానికి బ్యాంకులకు వెళితే నగదు లేదంటూ చెబుతున్నారని బోధన్‌కు చెందిన రైతు లచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇచ్చిన పంట రుణాలు 2,573 కోట్లు
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఏటా దాదాపు 40 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారని అంచనా. అందులో బుధ వారం నాటికి 3.91 లక్షల మంది రైతులకు రూ. 2,573 కోట్ల పంట రుణాలు రైతులకు అందినట్లు అధికారులు తెలిపారు.

రేపు పంట రుణాల ప్రణాళిక..
ఈ ఏడాది పంట రుణాల ప్రణాళికను ఎస్‌ఎల్‌బీసీ తయారుచేసింది. ఆ ప్రణాళికను శుక్రవారం విడుదల చేయనుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వర్షాకాలం, యాసంగి పంటలకు రూ.39,752 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధారించినట్లు తెలిసింది. అందులో ఖరీఫ్‌కు రూ.23,852 కోట్లు, రబీకి రూ.15,900 కోట్లు నిర్ధారించినట్లు సమాచారం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పంట రుణాల ప్రణాళిక రూ.30,140 కోట్లు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement