సాక్షి, అమరావతి/గూడూరు: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న నగదు మొత్తాన్ని వారి పాత బకాయిల చెల్లింపులకు బ్యాంకులు సర్దుబాటు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి గురువారం ఓ లేఖలో తెలిపారు. ఈ మేరకు గతంలోనే ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టమూరులో 74 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని కెనరా బ్యాంకు శాఖ పాత బకాయిల కింద సర్దుబాటు చేసిన విషయాన్ని ‘సాక్షి’ గురువారం వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న విద్యాదీవెన కింద జమ చేసిన మొత్తాన్ని లబ్ధిదారులకు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇలాంటి చర్యలు ఎక్కడా పునరావృతం కాకుండా బ్యాంకులకు తగిన మార్గదర్శకాలను మరోసారి జారీ చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1920కి వచ్చే వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల నిధులు దారిమళ్లితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల్లూరు ఘటనపై కూలంకషంగా విచారణ జరిపించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు వెంటనే నెల్లూరు జిల్లాలోని సంబంధిత బ్యాంకు శాఖ అధికారులతో మాట్లాడి ఆ 74 మంది లబ్ధిదారులకు పూర్తి మొత్తాన్ని విడుదల చేయించారు.
సాక్షికి ధన్యవాదాలు
మా కుమారుడు కావలిలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. జగనన్న విద్యాదీవెన కింద నగదు నా ఖాతాలో జమ అయ్యింది. కానీ మాకు బ్యాంకులో మరో అప్పు ఉండడంతో.. మా అకౌంట్ హోల్డ్‌లో ఉందని నగదు డ్రా చేసుకునేందుకు వీలు లేదని మేనేజర్ చెప్పారు. ‘సాక్షి’ కథనంతో ప్రభుత్వం స్పందించి అధికారులను ఆదేశించడంతో విద్యాదీవెన నగదును గురువారం డ్రా చేసుకోమని చెప్పారు. సాక్షికి మా ధన్యవాదాలు.
– సన్నారెడ్డి భారతి, తంబుగారిపాళెం, ఆరూరు పంచాయతీ
చదవండి:
అసత్య కథనాలతో ఆందోళన సృష్టించొద్దు
సీఎం వైఎస్ జగన్‌కు గడ్కరీ కృతజ్ఞతలు
Comments
Please login to add a commentAdd a comment