మీ ఆనందమే నా తపన: సీఎం జగన్‌ | CM Jagan Letter To Elderly Pensioners Get 2500 From 1st January 2022 | Sakshi
Sakshi News home page

మీ ఆనందమే నా తపన: సీఎం జగన్‌

Published Mon, Dec 27 2021 3:57 AM | Last Updated on Mon, Dec 27 2021 7:59 PM

CM Jagan Letter To Elderly Pensioners Get 2500 From 1st January 2022 - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్థిక భారమైనా, కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా.. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల ముఖాల్లో ఆనందం చూడాలనేదే తన తపన అని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ నూతన సంవత్సర శుభ దినాన పింఛన్లను నెలకు మరో రూ.250 పెంచుతూ రూ.2,500 చేస్తున్నట్టు సీఎం జగన్‌ తెలిపారు. పెన్షన్‌ పెంపు నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి నెలా రూ.2,250 చొప్పున డబ్బులు అందుకుంటున్న లబ్ధిదారులు ప్రతి ఒక్కరికీ సీఎం జగన్‌ వ్యక్తిగతంగా లేఖ రాశారు. వలంటీర్లు 1వ తేదీన పింఛన్‌ డబ్బులతో పాటు ఆయా లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖను అందజేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో ఇంతియాజ్‌ ‘సాక్షి’కి వివరించారు. సీఎం రాసిన లేఖ ఇలా ఉంది.   

కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న మీకు నూతన సంవత్సర శుభాకాంక్షులు చెబుతూ ఒక శుభవార్త అందించాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. నా సుదీర్ఘ పాదయాత్రలో అవ్వాతాతల కష్టాలను స్వయంగా గమనించా. 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు గత ప్రభుత్వం పెన్షన్‌గా మీకిచ్చిన చాలీ చాలని వెయ్యి రూపాయలతో మీరెన్ని అవస్థలు పడ్డారో కళ్లారా చూశాను. ఆత్మాభిమానం చంపుకొని జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరుగుతూ లంచాలు, వివక్షతో కూడిన వ్యవస్థలో వృద్ధులు, దివ్యాంగులు రోజుల తరబడి చేంతాడంత కూలైన్లలో పడ్డ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. 

గత ప్రభుత్వం కోటా పెట్టింది.. 
అర్హులు ఎంత మంది ఉన్నా, ఎలాగైనా పెన్షన్ల సంఖ్య తగ్గించాలని ఒక్కో గ్రామానికి ఇన్నే పెన్షన్లని గత ప్రభుత్వం కోటా పెట్టింది. ఆ కోటాకు మించి ఎంత మంది అర్హులున్నా వారెవ్వరికీ పెన్షన్లు ఇవ్వలేదు. అయ్యా.. మేము అర్హులమని అడిగిన వారికి నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా, అమానవీయంగా ‘మీ ఊరిలో ఎవరైనా పెన్షనర్‌ చనిపోతే నీ సంగతి అప్పుడు చూద్దాంలే’ అన్నారు. మనిషన్న వారికెవరికైనా ఇలాంటి సమాధానాలు వింటే కన్నీళ్లు రాకుండా ఉంటాయా? గత ప్రభుత్వంలో దిక్కుమాలిన జన్మభూమి కమిటీలను వారి వర్గం, పార్టీ వారితో నింపి.. ఆ కమిటీలు అర్హులను గుర్తిస్తాయని ఉత్తర్వులు ఇవ్వడంతో సీనియర్‌ సిటిజన్లు అయిన మీరు ఆ పనికి మాలిన జన్మభూమి కమిటీల ముందు కాళ్లా వేళ్లా పడే పరిస్థితిని కల్పించారు.

లంచాలు ఇస్తేనే, తమ వర్గం వారు అయితేనో, తమ పార్టీ వారు అయితేనో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. ఇంతా చేసి వారు ఇచ్చింది కేవలం 39 లక్షల మందికి మాత్రమే.  వాళ్లు పెన్షన్లపై నెలకు ఖర్చు చేసింది కేవలం రూ.400 కోట్లే. ఈ దుస్థితిని చూసి.. ఈ పరిస్థితి మారాలి.. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడవాలి.. వారి ముఖంలో కనిపించే చిరునవ్వులే నాకు ఆశీర్వాదాలు అవ్వాలని ఆనాడే నా మనస్సులో దృఢంగా సంకల్పించుకున్నాను. ఇదే విషయాన్ని నా పాదయాత్రలో ప్రకటించాను. మేనిఫెస్టోలో కూడా రాశాను. 

అప్పుడు 39 లక్షలు.. ఇప్పుడు 61 లక్షలు 
గత పాలకులు దిగిపోయే ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య 39 లక్షలు అయితే నేడు మన ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల సంఖ్య దాదాపు 61 లక్షలు. గత ప్రభుత్వం పెన్షన్ల మీద ఖర్చు పెట్టింది నెలకు రూ.400 కోట్లు అయితే నేడు మన ప్రభుత్వం నెలకు ఖర్చు పెడుతున్నది దాదాపు రూ.1,450 కోట్లు. ఆర్థిక భారమైనా, కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల ముఖాల్లో ఆనందం చూడాలన్న తపనతో ఏటా దాదాపు రూ.18,000 కోట్ల పెన్షన్ల ఖర్చును చిరునవ్వుతో మనందరి ప్రభుత్వం భరిస్తోంది. ఈ జనవరి 1 నుంచి పెంచబోతున్న పెన్షన్‌తో ఈ ఖర్చు ఈ యేడు దాదాపు రూ.20,000 కోట్లకు చేరుతుంది.

మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్లపై ఖర్చు చేసింది దాదాపు రూ.45 వేల కోట్లు. ‘పెన్షన్లను క్రమంగా రూ.3 వేల వరకు పెంచుతాం’ అన్న మాటను నిలబెట్టుకుంటూ ఈ నెల నుంచి క్రమం తప్పకుండా మీకు పెంచిన పెన్షన్‌ రూ.2,500 అందుతుంది. ఒకవేళ పెన్షన్‌ అందుకోవడంలో మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే మీ గ్రామ, వార్డు వలంటీర్‌ లేదా గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. వాళ్లే దగ్గర ఉండి మీ చేయి పట్టుకుని నడిపిస్తారు. మీకు పెన్షన్‌ అందేలా అన్ని విధాలా సహాయం చేస్తారు. మీరు బాగుండాలని, దేవుడు మీకు మంచి చేసే అవకాశం ఇంకా ఎక్కువ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. 
– ప్రేమతో మీ కుటుంబ సభ్యుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి     

ఇప్పుడు మీ ఇంటికే పెన్షన్‌  
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజే తొలి సంతకంగా, నా ప్రమాణ స్వీకారోత్సవంలోనే పెన్షన్ల పెంపునకు ఆదేశాలు ఇచ్చాను. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెలా మొదటి రోజు మీ గడప ముందుకు వచ్చి, మీ తలుపులు తట్టి, మీకు గుడ్‌మార్నింగ్‌ చెప్పి, పెంచిన పెన్షన్‌ మీకు అందేలా వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాను. కరోనా కారణంగా ఎన్ని ఇక్కట్లు ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మీ కష్టాలు తెలుసు కాబట్టి ఠంచన్‌గా పింఛన్‌ అందే విధంగా చూసుకుంటున్నాను. పెన్షన్లు ఎలా తగ్గించాలనేది గత పాలకుల విధానం అయితే అర్హులు ఏ ఒక్కరూ పెన్షన్‌కు దూరంగా ఉండకూడదన్నది నా పోరాటం.

అందుకే అత్యంత పారదర్శక విధానంలో కులం, మతం, ప్రాంతం ఆఖరుకు ఏ రాజకీయ పార్టీ అనేది కూడా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ లంచాలు, వివక్షకు తావులేకుండా నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పెన్షన్లు అందిస్తున్నామని సగర్వంగా చెబుతున్నాను. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించి మరీ సామాజిక తనిఖీ ద్వారా అర్హులను గుర్తించి వారికి పెన్షన్‌ అందిస్తున్నాం. అర్హులెవరైనా ఏ కారణం చేతనైనా మిగిలిపోతే కూడా, వాళ్లకు మరో అవకాశం ఇస్తూ వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ధ్రువీకరించుకుని వారికి కూడా పెన్షన్‌ అందిస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement