సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటనను మీడియాలో ప్రచారం చేసుకునేందుకే బాంబులు, రాళ్ల దాడులంటూ వీధి నాటకాలకు దిగారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారని చెప్పుకునేందుకు ఆయన సిగ్గుపడాలన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పునాదులు కదిలిపోవడంతో ఎప్పుడూ లేనిది వంగి వంగి నమస్కారాలతో చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నిన్నటి వరకు గంజాయి, హెరాయిన్.. ఆ తర్వాత దాడులంటూ పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
చర్చకు సిద్ధమే..
ఎవరైనా అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు రమ్మంటారు. బూతులపై చర్చకు రావాలని సవాళ్లు విసురుతున్నారంటే చంద్రబాబు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయినా సరే.. ఎక్కడికి రావాలో చెబితే చర్చకు మేం సిద్ధం. చంద్రబాబు చేత చంద్రబాబు కోసం నడుపుతున్న వ్యవస్థలుగా కొన్ని పత్రికలు, చానళ్లు పని చేస్తున్నాయి. చంద్రబాబు మీద దాడి చేయాల్సిన అవసరం వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు లేదు. చంద్రగిరి నుంచి బదిలీపై వచ్చిన టూరిజం ఉద్యోగి మోహన్‌పై చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే కనీసం వారించలేదు. శాంతి భద్రతలు క్షీణించాయంటూ చేస్తున్న విష ప్రచారానికి కొనసాగింపే తాజా డ్రామా. ఒక వ్యక్తి హుందాతనానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు కూడా చెప్పాయి. మరి రాష్ట్ర ప్రతిష్ట దిగజారేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు కదా? మరి ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు?
రైతుల బలవన్మరణాలపై దారుణ కథనం ...
రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందంటూ ఈనాడు దినపత్రిక ఓ దారుణమైన కథనాన్ని ప్రచురించింది. ఎన్‌సీఆర్బీ డేటా ప్రకారం 2020లో ఏపీలో 889 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో కౌలు రైతులే ఎక్కువని కథనంలో పేర్కొంది. 2020లో కేవలం 225 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా బాధిత కుటుంబాలకు పరిహారం కూడా చెల్లించాం. రైతాంగాన్ని ఆదుకోవడంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో సీఎం జగన్ ఉన్నారు. రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎన్సీఆర్బీకి పోలీసు శాఖ పంపిస్తున్న గణాంకాలు, తమ గణాంకాల మధ్య వ్యత్యాసం ఉందని, సరిచూసుకోవాలంటూ 2020 సెప్టెంబర్‌లో రాష్ట్ర అగ్రికల్చర్ కమిషనర్ లేఖ కూడా రాశారు.
గంటా, అయ్యన్న ఏమన్నారో గుర్తుందిగా?
టీడీపీ హయాంలో 3 వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు రికార్డుల్లో ఉందంటే సాగు జరిగినట్లే కదా? గంజాయి సాగు, మాఫియా పేట్రేగిపోయాయని మంత్రులుగా ఉన్నప్పుడు గంటా, అయ్యన్నపాత్రుడు మాట్లాడటం నిజం కాదా? గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహరిస్తామని సీఎం జగన్ హెచ్చరించారు. ఎస్‌ఈబీ ద్వారా ఉక్కుపాదం మోపుతున్నాం. పక్క రాష్ట్రాల్లో సాగు చేసి ఏపీ మీదుగా తరలిస్తుండటంతోమనకు అపకీర్తి వస్తోంది. లోకేశ్ తాను పప్పు కాదని బ్రాండింగ్ చేసుకునేందుకు బూతులు తిట్టే పనిలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment