సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక రూ. 1,61,120 కోట్లుగా నిర్దేశించారు. ఇం దులో వ్యవసాయ రంగానికి రూ.75,141 కోట్లు కాగా, పంట రుణాల లక్ష్యం రూ. 53,222 కోట్లుగా ఉంది. అందులో వానాకాలంలో 60%, యాసంగిలో 40% కలిపి రైతులకు వీటిని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టు కున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశం పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 2020–21 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు.
రుణ ప్రణాళిక ప్రకారం గతేడాది కంటే ఈసారి మొత్తం రుణాలు 10.62 శాతం పెరిగాయి. ఇక పంట రుణాల విషయానికొస్తే గత ఆర్థిక సంవత్సరంలో రూ. 48,740 కోట్లుగా ఉంది. ఈసారి రూ. 53,222 కోట్లుగా నిర్దేశించుకున్నారు. అంటే 9.20 శాతం పెరిగింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఇవ్వాల్సిన దీర్ఘకాలిక రుణాలు రూ. 12,061 కోట్లు చూపారు. గతేడాది కంటే 5.38 శాతం పెంచారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయల కల్పన కోసం రూ. 2,422 కోట్లు కేటాయించారు. ఇది గతం కంటే 16.02 శాతం పెంచారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 7,435 కోట్లు కేటాయించారు. రుణ ప్రణాళికలో గతేడాదితో చూస్తే మొత్తంగా వ్యవసాయ రంగానికి 9.54 శాతం రుణాలు పెంచారు. ప్రధానంగా పంటల ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవసాయ సంబంధ మౌలిక సదుపాయల కల్పన, నీటి వనరులు, ఉద్యాన, పట్టు పరిశ్రమలు, అటవీ సంపద, పడావు భూములను అభివృద్ధి చేయడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న పంట రుణాల్లో 76.13 శాతమే పంపిణీ చేశారు.
ఎంఎస్‌ఎంఈకి 35,196 కోట్లు
సూక్ష్మ , చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి (ఎంఎస్‌ఎంఈ) రూ. 35,196 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా ఉంది. విద్యా రుణాలు రూ. 2,165.73 కోట్లు , గృహ సంబంధిత రుణాలు రూ. 8,048 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలకు రూ. 2,167 కోట్లు పంపిణీ చేయాలని ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆత్మనిర్బర్ కింద రుణాలు...
కరోనా నేపథ్యంలో ఆత్మనిర్బర్ భారత్ అభయాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని రంగాలకు ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేసినట్లు ఎస్‌ఎల్‌బీసీ తన నివేదికలో వెల్లడించింది. ఎంఎస్‌ఎంఈలకు రూ. 2,513 కోట్లు మంజూరు కాగా ఇప్పటికే రూ. 1,688 కోట్లు అత్యవసర రుణం కింద అర్హులకు ఇచ్చారు. అదే సమయంలో రూ. 231 కోట్లు అర్హులైన రైతులకు ఇచ్చినట్లు తెలిపారు.
68,190 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 370 కోట్లు అదనంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా స్ట్రీట్ వెండర్స్‌కు కూడా ప్రత్యేక రుణం ఇస్తున్నట్లు ఎస్‌ఎల్‌బీసీ వెల్లడించింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రాస్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షులు, ఎస్‌బీఐ సీజీఎం ఓం ప్రకాశ్ మిశ్రా, నాబార్డు సీజీఎం కృష్ణారావు, ఇతర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment