ఏపీలో రైతుల రుణాల్లో భారీ కోత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ ప్రకటనతో రైతులు బ్యాంకు రుణాల రాక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏపీలో రైతులకు రుణాల మంజూరులో భారీ కోత విధించారు. గతేడాది రుణాల లక్ష్యం 56,019 కోట్ల రూపాయలకు గాను 22,443 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ 189వ ఎస్ఎల్బీసీ నివేదికను లీడ్ బ్యాంక్ ప్రకటించింది. శుక్రవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగుతోంది.
ఏపీలో 40 శాతం మాత్రమే రుణాలు ఇవ్వగలిగామని బ్యాంకులు వెల్లడించాయి. ఈ ఏడాది ఖరీఫ్లో 13,789 కోట్లు, రబీలో 8,684 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినట్లు ప్రకటించాయి. చంద్రబాబు రణమాఫీ చేస్తానని ప్రకటించడంతో రైతులు రుణాలు చెల్లించలేదని ఎస్ఎల్బీసీ నివేదికలో పేర్కొన్నారు. దీంతో బకాయిలు గణనీయంగా పెరిగిపోయాయని, నిధులు, బ్యాంకుల లావాదేవీలను తీవ్రంగా దెబ్బతీశాయని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో మూడు రోజులు ముగుస్తోందని, రైతులు బకాయిలు చెల్లించి రుణాలకు అర్హత పొందాలని సూచిస్తున్నట్టు ఎస్ఎల్బీసీ పేర్కొంది.