విశాఖ మన్యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యతో నల్లమల అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల అలజడి లేదని చేసిన పోలీసుల ప్రకటనతో మారుమూల గ్రామాలకు వెళ్లి ఉన్న ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా తమ పంథా మార్చుకున్నారు. మహబూబ్‌నగర్, కర్నూలు, గుంటూరు జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యతో పాటు తెలంగాణ పరిధిలో మావోల మూవ్‌మెంట్ ఉండటంతో నల్లమలను షెల్టర్‌జోన్‌గా ఉపయోగించుకునే అవకాశాలపై పోలీసులు దృష్టి సారించారు.
మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతం ఇప్పుడు గ్రేహౌండ్స్ బూట్ల చప్పుళ్లతో మార్మోగుతోంది. ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించేందుకు పోలీసు ఉన్నతాధికారులు గ్రేహౌండ్స్ దళాలను రంగంలోకి దించాయి. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు విశాఖ మన్యంలోలా యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దించి టార్గెట్‌లపై దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటన్న అంశంపై పోలీస్ అధికారులు దృష్టి సారించారు. గతంలో మావోల టార్గెట్‌లో ఉన్న నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల కదలికలపై ఎస్పీ సత్య ఏసుబాబు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మార్కాపురం డివిజన్‌లోని ప్రజాప్రతినిధుల భద్రతపై డీఎస్పీ రామాంజనేయులు సమీక్ష చేసి గన్‌మెన్‌లు, పీఏలకు పలు సూచనలు చేశారు.
తమ అనుమతి లేకుండా గ్రామాలకు వెళ్లవద్దని, గ్రామ దర్శినితో పాటు పార్టీ కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు తమకు సమాచారం అందించాలని, తాము కల్పించే భద్రతతో వెళ్లాలని చెప్పారు. అనుమానిత వ్యక్తులను ఎమ్మెల్యేల వద్దకు రానివ్వద్దని గన్‌మెన్‌లకు సూచించారు. మావోయిస్టు సానుభూతిపరులు, లొంగిపోయిన వారిపై కూడా నిఘా పెట్టారు. గతంలో మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన పెద్ద దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, అర్ధవీడు, గిద్దలూరు, రాచర్ల మండలాల్లోని యడవల్లి, గంటవానిపల్లె, చిలకచర్ల, కొత్తూరు, నల్లగుంట్ల, బంధంబావి, చినారుట్ల, పెదారుట్ల, బైర్లూటి, తుమ్మలబైలు, పాలుట్ల, శతకోడు, అక్కచెరువు, గంజివారిపల్లె, గన్నేపల్లి, వెలగలపాయ, బొమ్మిలింగం, కాకర్ల, దిగువమెట్ట, జల్లి వారి పుల్లలచెరువు తదితర గ్రామాలపై పోలీసులు దృష్టి పెట్టారు. గతంలో ఈ ప్రాంతాల్లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు, ఎదురు కాల్పులు జరగటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
మార్కాపురంలో బేస్ క్యాంప్ ఏర్పాటు
నల్లమలలో గతంలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తో పాటు అగ్రనేతలు శాఖమూరి అప్పారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడ చనిపోయారు. అప్పట్లో గ్రేహౌండ్స్ పార్టీని మార్కాపురంలో ఏర్పాటు చేశారు. అయితే గత మూడు, నాలుగేళ్ల నుంచి మావోల కదలికలు లేకపోవటంతో గ్రేహౌండ్స్ దళాల బేస్ క్యాంప్‌లు తరలించారు. కాగా, మళ్లీ మావోయిస్టుల యాక్షన్ టీం రంగంలోకి రావడంతో అప్రమత్తమైన పోలీసులు మార్కాపురంలోని స్పెషల్ పార్టీ పోలీసులతో బేస్‌క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
ఇదీలా ఉండగా తెలంగాణ ప్రాంతం నుంచి, ఏఓబీ నుంచి మావోయిస్టులు నల్లమలకు షెల్టర్‌గా ఉపయోగించుకునే అవకాశాలు ఉండటంతో గ్రేహౌండ్స్ దళాల కూంబింగ్‌తో పాటు, మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట, కర్నూలు జిల్లా ఆత్మకూరు, నంద్యాల, గుంటూరు జిల్లా నరసరావుపేట, గురజాల పోలీస్ అధికారులతో స్థానిక డీఎస్పీ రామాంజనేయులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకుని సమీక్షించుకుంటున్నారు. గతంలో మావోయిస్టుల ఉద్యమం ఉన్నప్పుడు మార్కాపురం డివిజన్‌లో పనిచేసిన పోలీస్ అధికారుల సూచనలు, అనుభవాలను విశ్లేషించుకుంటున్నారు. పోలీస్ అధికారులు కూడ అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.
ప్రజాప్రతినిధులకు సూచనలు
మార్కాపురం డివిజన్‌లోని ప్రజాప్రతినిధులు, గన్‌మెన్లకు, పీఏలకు పలు సూచనలు చేసినట్లు రామాంజనేయులు తెలిపారు. మావోయిస్టుల బలపడకుండా, ప్రజలు వారి వైపు ఆకర్షితులు కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీశాఖ, ఐటీడీఏ సిబ్బంది సహకారం కూడ తాము తీసుకుంటున్నామని తెలిపారు. మారుమూల గ్రామాలకు వెళ్లే ప్రజాప్రతినిధులు సమీపంలోని ఎస్సైలకు సమాచారం అందించకుండ వెళ్లకూడదని స్పష్టం చేశారు.
–డీఎస్పీ రామాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment