ఏడాది చివరికల్లా రోజూ నీళ్లు | KTR comments on water supply in hyderabad city | Sakshi
Sakshi News home page

ఏడాది చివరికల్లా రోజూ నీళ్లు

Published Sun, Mar 19 2017 4:00 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

ఏడాది చివరికల్లా రోజూ నీళ్లు - Sakshi

ఏడాది చివరికల్లా రోజూ నీళ్లు

హైదరాబాద్‌లో ఎక్కడా తాగునీటి కొరత లేదు: కేటీఆర్‌
⇒ ప్రతిపక్షాలకు ఖాళీ కుండల ప్రదర్శనలకు అవకాశం ఇవ్వబోం

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా నీటి సరఫరా జరుగుతోందని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి నుంచి ప్రతిరోజూ తాగునీరు సరఫరా చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌ తాగు నీటి అవసరాలకు 20 టీఎంసీల సామ ర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తా మని, అందులో శామీర్‌పేట రిజర్వాయర్‌ నిర్మా ణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ప్రతిపక్షా లకు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు ఖాళీ కుండలతో ప్రదర్శనలు చేసే అవకాశం ఇవ్వబోమని అన్నారు. శనివారం అసెంబ్లీలో బీజేపీ సభ్యుడు చింతల రాంచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. సిద్దిపేట, గజ్వేల్‌ ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించి, హైదరాబాద్‌కు తాగునీటిలో కోత పెడుతున్నారన్న చింతల వ్యాఖ్యలను మంత్రి తప్పుపట్టారు.

గోదావరి నీటిని తరలిస్తున్న దారిలో ఉన్న ప్రాంతాలకు నీళ్లివ్వడం తప్పా? అని ప్రశ్నించారు. గతేడాది మార్చిలో హైదరాబాద్‌లో 352 ఎంజీడీ(మిలియన్స్‌ ఆఫ్‌ గ్యాలన్స్‌ పర్‌ డే) నీటిని సరఫరా చేయగా.. ఈ ఏడాది ప్రస్తుతం 372 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. కాగా, చింతల మాట్లాడుతున్న సమయంలో అధికార పార్టీ సభ్యులు, మంత్రులు అడ్డుతగలడంతో బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తమ సభ్యుడి ప్రసంగానికి అడ్డు తగులుతున్న వారిని రేవంత్‌రెడ్డిని సస్పెండ్‌ చేసినట్టుగా సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే దీన్ని స్పీకర్‌ సీరియస్‌గా తీసుకోలేదు.

బస్సులపై అక్బర్‌ కస్సుబుస్సు..
రాజధాని నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ, పాత బస్సులు, వాటి సగటు జీవన కాలం వంటి అంశాలపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ సంధించిన ప్రశ్నలు సభలో కాసేపు వేడి పుట్టించాయి. బస్సుల అంశంపై ఆయన ఏకంగా 15 వరకు ప్రశ్నలు సంధించారు. నగరంలో బస్సుల సగటు జీవిత కాలం ఎంత? జీహెచ్‌ఎంసీలో ఎన్ని బస్సులున్నాయి? అందులో ఏసీవి ఎన్ని.. నాన్‌ ఏసీ ఎన్ని?, సెట్విన్‌ బస్సులెన్ని.. బస్సులు రోజు తిరిగే సగటు దూరం ఎంత?  అందులో ఎక్కుతున్న ప్రయాణికులు ఎందరు? వాటి నుంచి ఉత్పత్తి అయ్యే కార్బన్‌ మోనాక్సైడ్‌ ఎంత? అంటూ ప్రశ్నలు సంధిస్తూ పోయారు. దీంతో విసుగు చెందిన స్పీకర్‌ మధుసూదనాచారి అభ్యంతరం తెలిపారు. ఇన్ని ప్రశ్నలు వేస్తే సభా సమయం సరిపోదని అన్నారు. దీనిపై అక్బరుద్దీన్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు.

ప్రజాస్వామ్యంలో తాము అనుకున్నట్టే సభ నడవాలంటే కుదరదని, సభ్యుడికి ఎన్ని ప్రశ్నలైనా వేసుకునే అవకాశం ఉంటుందని, దాన్ని కాదని నియంతృత్వ ప్రజాస్వామ్యం చేస్తామంటే మంచిది కాదని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. నియంతృత్వ ప్రజాస్వామ్యం అన్న పదాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. స్పీకర్‌ సైతం కలుగజేసుకొని.. తక్కువ ప్రశ్నలు అడిగితే సభా సమయం వృథా కాదని చెప్పడంతో అక్బరుద్దీన్‌ మరో నాలుగు ప్రశ్నలు వేసి కూర్చున్నారు. ఆ తర్వాత కూడా ఎంఐఎం ఎమ్మెల్యేలు ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్, మోజమ్‌ ఖాన్‌లు సైతం చెరో ఐదారు ప్రశ్నలు వేయడంతో అధికారపక్ష సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఈ ప్రశ్నలపై మంత్రి మహేందర్‌రెడ్డి సమాధానమిస్తూ.. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఐదు జోన్లలో 160 ఏసీ, 154 మెట్రో డీలక్స్‌ , 888 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, 2,242 సిటీ ఆర్డినరీ సర్వీసులతోపాటు 85 ఏసీ బస్సులున్నాయని, కేవలం పాత నగరంలో 1,700 బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నా యన్నారు. మహిళలు, ఉద్యోగులు, ఇతర అవసరాల కోసం నగరంలో 390 బస్సులను నడుపుతున్నామని వివరించారు.

మూడు చోట్ల జల విద్యుత్‌ కేంద్రాలు: జగదీశ్‌రెడ్డి
మేడిగడ్డ, తుపాకులగూడెం, తమ్మిడిహెట్టి ప్రాజెక్టుల వద్ద జల విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సభలో టీఆర్‌ఎస్‌ సభ్యుడు సోమారపు సత్యనారాయణ, జలగం వెంకట్రావ్‌ తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. థర్మల్‌ ప్లాంట్ల కన్నా.. సోలార్‌ విద్యుదుత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచనపై మంత్రి స్పందిస్తూ... ఇప్పటికే రాష్ట్రంలో 1,456 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందన్నారు. ఈ ఏడాది చివరికి 2 వేల మెగావాట్ల ఉత్పత్తికి యత్నిస్తున్నామన్నారు. సోలార్‌ ఉత్పత్తిలో త్వరలో రాష్ట్రం ఛాంపియన్‌ కాబో™ øందన్నారు. యాదాద్రి థర్మల్‌ ప్లాంటును ఆపబోమని స్పష్టంచేశారు.

నిబంధనలు సవరించి నోటిఫికేషన్‌ ఇవ్వలేరా: జీవన్‌రెడ్డి
గురుకులాల్లో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ రద్దు చేసి.. మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి నిలదీశారు. ‘‘నోటిఫికేషన్‌ నిబంధనలు ఆక్షేపణీయంగా ఉన్నాయని రద్దు చేశారు.  ప్రభుత్వం డీఎస్సీ ఎలాగూ వేయడం లేదు. కనీసం గురుకులాల నోటిఫికేషన్‌ అయినా ఇవ్వాలి’’ అని డిమాండ్‌ చేశారు. మంత్రి జోగు రామన్న స్పందిస్తూ.. ‘‘గురుకులాల నోటిఫికేషన్‌లో నిబంధనలు సవరించి ఇప్పటికే టీఎస్‌పీఎస్సీకి పంపాం. నియామక ప్రక్రియ మొదలు పెట్టాలని కోరాం. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన టీచింగ్, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను రిక్రూట్‌మెంట్‌ చేయాలని కలెక్టర్లకు ఆదే శాలు ఇచ్చాం. నియామకాలు పూర్తయ్యే వరకు వారితో బోధన కొనసాగిస్తాం’’ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement