తెలంగాణ జల విధానం భేష్
- వాటర్ రిసోర్స్ కాంగ్రెస్‌లో నిపుణుల ప్రశంసలు
- అమెరికాలో మంత్రి కేటీఆర్ ప్రసంగానికి స్పందన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ నీటి యాజమాన్య, సరఫరా, సంరక్షణ విధానాలకు అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు లభించాయి. రెండో రోజు అమెరికా పర్యటన సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మంగళవారం అక్కడి శాక్రమెంటో నగరంలో జరిగిన ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల సదస్సులో ప్రసంగించారు. నీటి యాజమాన్య, సరఫరా, సంరక్షణ అంశాలతో తెలంగాణ ప్రజల జీవితాలతో వీడదీయలేని అనుబంధం ఉందని పేర్కొన్న మంత్రి.. తెలంగాణ ప్రజలు జరుపుకొనే బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రసంగానికి విశేష ఆదరణ లభించిందని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ ఇంటింటికీ రక్షిత తాగునీటి సరఫరా కోసం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామని, ఇంతటి భారీ కార్యక్రమాన్ని ఇప్పటి దాకా దేశంలో ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదన్నారు. ప్రజలందరికీ సరిపడేంతగా రక్షిత మంచినీరు అందించాలని, ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి 6వ లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని రూపొందించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. నీటితో పాటు ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రపంచంతో అనుసంధానమయ్యే అవకాశం లభిస్తుందన్నారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఈ హెల్త్, ఈ ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో గణనీయ మార్పు వస్తుందన్నారు.
46 వేల చెరువుల పునరుద్ధరణకు ‘కాకతీయ’
సాగునీటి సంరక్షణ పద్ధతుల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాష్ట్రంలోని 46 వేల గొలుసుకొట్టు చెరువుల పునరుద్ధరణ కోసం ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సదస్సులో అధ్యయనానికి మిషన్ కాకతీయ చక్కగా సరిపోతుందన్నారు. ఈ కార్యక్రమం కింద చేపట్టిన చెరువుల పూడికతీత ద్వారా నీటి వనరుల సంరక్షణతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని, ప్రస్తుతం బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న పంటలకు సుస్థిర సాగునీటి లభ్యత సాధ్యం అవుతుందన్నారు.
ఇతర దేశాలకు ఆదర్శం...
నీటి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సదస్సుకు హాజరైన మేధావులు, సాగునీటి రంగ నిపుణులు ప్రశంసించారు. ఈ విధానాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా ఉంటాయని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, సదస్సుకు చక్కటి ప్రారంభం లభించిందని వాటర్ కాంగ్రెస్‌కు కాబోయే అధ్యక్షురాలు క్రిస్టినా స్వాలో అభిప్రాయ పడ్డారని మంత్రి కార్యాలయం పేర్కొంది.
శాన్‌మినో సీఈఓతో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సేవల సంస్థ ‘శాన్‌మినో’ను ఐటీ మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. రెండో రోజు అమె రికా పర్యటనలో భాగంగా కేటీఆర్ మంగళ వారం సిలికాన్ వ్యాలీలో ‘శాన్‌మినో’ సంస్థ చైర్మన్ అండ్ సీఈఓ జ్యూర్ సోలాతో సమా వేశమై చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలతలను వివరించారు. రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ పాలసీని తెలియ జేశారు. తెలంగాణకు శాన్‌మినో ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆహ్వానించారు.
కేటీఆర్‌కు టై సిలికాన్ వ్యాలీ విందు
కేటీఆర్ గౌరవార్థం టై సిలికాన్ వ్యాలీ చాప్టర్ విందు ఏర్పాటు చేసింది. టై సిలికాన్ వ్యాలీ ప్రతినిధులు రాజురెడ్డి, రాంరెడ్డి, అడోబ్ కం పెనీ సీఈఓ శాంతను నారాయణ్, అరుబా నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు కీర్తి మెల్కోటె తదితరులు విందుకు హాజరయ్యారు.