వేగంగా వాటర్‌గ్రిడ్ పనులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్‌గ్రిడ్)ను మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పనులు పూర్తయిన ప్రాంతాల్లో వెంటనే నీటి సరఫరా చేస్తామని పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు తె లిపారు. వాటర్‌గ్రిడ్‌కు సుమారు 200 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, విద్యుత్ పనుల ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే వాటిని చేపట్టేందుకు రూ.100 కోట్లు అడ్వాన్స్‌ను ఇచ్చామని చెప్పారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సోమవారం విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.
వాటర్‌గ్రిడ్ పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేసేలా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రెండు విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, వారంలోగా రెండు విభాగాల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి డిస్కమ్‌లు, జిల్లాలవారీగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. విద్యుత్ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైతే షార్ట్ టెండర్లు పిలవాలని మంత్రి సూచించారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన ట్రాన్స్‌మిషన్ లైన్లు, సబ్‌స్టేషన్లకు సంబంధించిన వివరాలను వెంటనే విద్యుత్ శాఖకు అందజేయాలని వాటర్‌గ్రిడ్ అధికారులను ఆదేశించారు.