గ్రేటర్ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు
‘ఆస్కి’తో కలసి పనిచేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం
- మూడు నెలల్లో 150 బస్టాప్‌ల ఆధునీకరణ
- మెహిదీపట్నంలో ప్రయోగాత్మకంగా స్కైవాక్ సౌకర్యం
- కనీస సదుపాయాల కల్పనపై మంత్రి కేటీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగర ప్రజలకు తక్కువ సమయంలో ఎక్కువ సదుపాయాలు కల్పించేందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)తో కలసి పనిచేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నిర్ణయించింది. నగరంలో కనీస సదుపాయాల కల్పన, వాటి అభివృద్ధిపై పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఆస్కి కార్యాలయంలో సంస్థ ప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో చర్చించారు. బస్టాప్‌ల అభివృద్ధి, ఇంటి నంబర్ల కేటాయింపు, పార్కుల నిర్వహణ, స్వచ్ఛ హైదరాబాద్ అంశాల్లో జీహెచ్‌ఎంసీకి సహకరించాలని సూచించారు.
ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ఆస్కి... సీటింగ్ సదుపాయాలతో కూడిన బస్టాప్‌లు, వాటికి అనుబంధంగా మరుగుదొడ్లు వంటి అంశాల్లో సహకరిస్తామని తెలిపింది. నగరవ్యాప్తంగా 300 బస్టాప్‌లను ఆధునీకరించాలని...వచ్చే మూడు నెలల్లో కనీసం 150 బస్టాప్‌లలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలని ఆస్కి ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు. అలాగే మెహిదీపట్నంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన బస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ప్రయోగాత్మకంగా స్కై వాక్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మౌలిక వసతుల కల్పన, జంక్షన్లు, డివైడర్ల అభివృద్ధి, ల్యాండ్ స్కేపింగ్ పనులను యుద్ధప్రాతిపదికన చేపడతామని కేటీఆర్ తెలిపారు. పౌర సదుపాయాల నిర్వహణలో ముందంజలో ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనానికి జీహెచ్‌ఎంసీ అధికారులు 26న ఢిల్లీలో పర్యటిస్తారన్నారు. పార్కుల నిర్వహణ బాధ్యతను నగరంలోని ప్రజాప్రతినిధులకు అప్పగించే యోచనలో ఉన్నామన్నారు.
సీవరేజ్ బోర్డు స్వయంసమృద్ధి సాధించాలి...
హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) పనితీరుకు సంబంధించి కేటీఆర్ పలు సూచనలు చేశారు. నీటి సరఫరాకు సంబంధించిన పైపులైన్ల సమగ్ర సమాచారం బోర్డు వద్ద ఉండాలని.. ఆదాయం పెంచుకుని స్వయం సమృద్ధి సంస్థగా ఎదగాలన్నారు. స్కాడా టెక్నాలజీని వినియోగిస్తున్నా.. నీటి సరఫరాలో నష్టాలను నివారించలేకపోవడాన్ని మంత్రి ప్రశ్నించారు. నగరంలో 9 వేల కిలోమీటర్లకుపైగా రోడ్లు ఉన్నాయని.. రోడ్లవారీగా సర్వే బాధ్యతలను ప్రత్యేక సంస్థలకు అప్పగించాలన్నారు. బోర్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బంది, ఉద్యోగులకు అవార్డులు ఇస్తామన్నారు.