సాక్షి,హైదరాబాద్: నగరంలో ప్రైవేట్ పార్కింగ్ స్థలాలు రానున్నాయి. నగరంలో కనీసం 100 గజాల ఖాళీ స్థలం ఉన్న వ్యక్తులెవరైనా ఆ స్థలాన్ని ప్రైవేట్ పార్కింగ్‌గా మార్చుకోవచ్చని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ నుంచి వ్యాపార అనుమతులను పొందాల్సి ఉంటుంది. ముందుగా తొలి మూడు నెలలకు మాత్రమే ఈ అనుమతులు ఇస్తారు. తర్వాత వాటిని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్‌కు ఇచ్చిన స్థలాలను జియో ట్యాగింగ్ చేస్తారు. ఆ ప్రదేశంలో ఏర్పాటు చేసే బోర్డులో ఫీజుల వివరాలు ఉంటాయి. నిర్ణీత ఫీజుకంటే అధికంగా వసూలు చేసే వారిపై ఫిర్యాదు చేసేందుకు అధికారుల ఫోన్ నంబర్లను కూడా అందులో పేర్కొంటారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులు, ఇతరత్రా భూముల్లో మాత్రం పార్కింగ్ ఏర్పాట్లకు అనుమతులివ్వరు. తమ స్థలాలను పార్కింగ్‌కు ఇవ్వాలనుకునేవారు 99495 46622, 040–21 11 11 11 నంబర్లకు ఫోన్ లేదా ్చఛ్ఛిట్ట్చ్ట్ఛటజిౌuటజీnజఃజఝ్చజీ .ఛిౌఝ కు మెయిల్‌చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు.
పార్కింగ్ ఫీజులు ఇలా
⇒ కార్లు, తదితర 4 చక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు:రూ.20
⇒ ఆ తర్వాత ప్రతి గంటకు :రూ.5
⇒ బైక్‌లు, తదితర ద్విచక్ర వాహనాలకు మొదటి రెండు గంటలకు: రూ.10
⇒ ఆ తర్వాత ప్రతి రెండు గంటలకు: రూ.5
యాప్ ద్వారా రిజర్వేషన్
ప్రైవేట్ పార్కింగ్‌కు అనుమతించిన ప్రదేశాలు, తదితర వివరాలతో ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు.ఈ యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ కూడా చేసుకోవచ్చని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. మలిదశలో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే లారీలు, టిప్పర్లు, తదితర వాహనాలకు రాత్రివేళల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
దందాగా మారే అవకాశం?
పార్కింగ్ దందాతో అక్రమాలు పెరిగిపోవడంతో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఉన్న 54 పార్కింగ్ స్లాట్‌లలో ఉచిత పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. త్వరలో అందుబాటులోకి రానున్న ప్రైవేట్ పార్కింగ్ ప్రదేశాలతో తిరిగి పార్కింగ్ దందాలుగా మారకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకుంటే అవి కూడా అక్రమార్కుల కేంద్రాలుగా మారే ప్రమాదముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment