శుక్రవారం జాతీయ టౌన్, కంట్రీ ప్లానర్ల సదస్సులో మంత్రి కేటీఆర్. చిత్రంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్
సాక్షి, హైదరాబాద్: నిర్ణీత ప్రదేశంలో భవన నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులను అతిక్రమించి అదనపు స్థలాల్లో నిర్మించిన భవనాలు ప్రభుత్వానికే చెందేలా కఠిన చట్టాలు చేయాల్సిన అవసరముందని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకమారారావు పేర్కొన్నారు. లక్ష చదరపు అడుగుల ఏరియాలో భవన నిర్మాణానికి అనుమతులిస్తే.. లక్షా 20 వేల చదరపు అడుగుల నిర్మాణాలు జరుగుతున్నాయని, అలా అదనంగా నిర్మించిన 20 వేల చదరపు అడుగుల కట్టడాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. అలా అదనంగా నిర్మించిన వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఈ మేరకు అడ్డగోలుగా భవన నిర్మాణాలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకొస్తామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ప్రారంభమైన ‘నేషనల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
ప్రణాళికాయుత అభివృద్ధే పరిష్కారం
పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధి ఒక్కటే దీనికి పరిష్కారమని చెప్పారు. రాష్ట్రంలో 73 పురపాలికలు ఉండగా.. 41 శాతం జనాభా వాటిల్లోనే నివసిస్తోందని పేర్కొన్నారు. 2050 నాటికి సగానికి పైగా దేశ జనాభా పట్టణ ప్రాంతాల్లో నివస్తుందని.. గత ఐదు వేల ఏళ్లలో జరిగిన పట్టణీకరణతో పోల్చితే వచ్చే ఐదేళ్లలో అంతకు మించి పట్టణీకరణ జరుగనుందని చెప్పారు. టౌన్ ప్లానర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని.. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్య, ట్రాఫిక్, వరదలు, కాలుష్య సమస్యలకు సరైన పరిష్కారాలు చూపాలని సూచించారు.
కొత్తగా నగర పంచాయతీలు
రాష్ట్రంలో 15 వేలకు పైగా జనాభా కలిగిన గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాయని.. ఇలా ఇప్పటివరకు 29 నగర పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ శివార్లలోని గ్రామ పంచాయతీల్లో ఎలాంటి ప్రణాళికలు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు జరుగుతున్నాయని.. వాటిని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసి చక్కదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు న్యాయపరమైన చిక్కులతో సాధ్యం కావడం లేదని వెల్లడించారు. పారిశుధ్యం విషయంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని.. ఇందుకోసం జపాన్‌లోని క్లీన్ అథారిటీ ఆఫ్ టోక్యో సంస్థ తరహాలో క్లీన్ అథారిటీ ఆఫ్ హైదరాబాద్ సంస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఎన్నో సంస్కరణలు తెచ్చాం
దేశంలో మరెక్కడ లేనట్లుగా రాష్ట్ర పురపాలన విభాగంలో సంస్కరణలను తీసుకొచ్చామని కేటీఆర్ చెప్పారు. భవన నిర్మాణ అనుమతుల జారీలో అవినీతిని నిర్మూలించేందుకు ‘డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం’ను అమల్లోకి తెచ్చామని, ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. మరింత పారదర్శకత కోసం అనుమతుల జారీకి 21 రోజుల గడువు విధించామని, ఆలోగా స్పందన లేకపోతే అనుమతించినట్లే పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సదస్సులో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్‌ప్లానర్స్ ఇండియా అధ్యక్షుడు కేఎస్ అకోడెతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన టౌన్ ప్లానర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment