శంషాబాద్ పట్టణం
శివారు గ్రామాలకు ఇక పట్టణ శోభ రానుంది. త్వరలోనే ఈ పంచాయతీలు పురపాలక శాఖ పరిధిలో చేరనున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాలు కొత్తగా ఏర్పాటయ్యే నగర పంచాయతీ/మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి. ఈ మేరకు ప్రతిపాదిత నగర పంచాయతీల జాబితాను జిల్లా యంత్రాంగం రూపొందించింది. స్థానిక శాసనసభ్యుల సూచనలకు అనుగుణంగా జాబితాను ఖరారు చేసిన అధికారులు.. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగరీకరణ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిని అనుకొని ఉన్న పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించిన ప్రజాప్రతినిధులు.. గ్రేటర్‌లో కలపడం తగదని స్పష్టం చేశారు. ఈ గ్రామాలను నగర పంచాయతీ లేదా మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసిన తర్వాతే గ్రేటర్‌లో కలిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎమ్మెల్యేల అభిప్రాయంతో ఏకీభవించిన మంత్రి కేటీఆర్.. గ్రేటర్‌లో విలీనం చేయాలనే యోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఇప్పటికే నగరంలో అంతర్భాగమైన గండిపేట మండలంలోని మణికొండ, పుప్పాల్‌గూడ మినహా మిగతా పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో కలపడమే మేలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిపాలనాపరంగా, ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరగాలంలే ఇది తప్పనిసరి అని తేల్చిచెప్పారు. కొత్త నగరపంచాయతీ/మున్సిపాలిటీల ఏర్పాటుపై మంగళవారంలోగా ప్రతిపాదనలు అందజే యాలని శాసనసభ్యులకు కేటీఆర్ సూచించారు. దీని కి అనుగుణంగా ప్రతిపాదిత నగర పంచాయతీలు, వాటి పరిధిలోకి వచ్చే గ్రామాల కూడిన జాబితాను పంపారు.
కొత్తగా ఏడు మున్సిపాలిటీలు
ప్రభుత్వ తాజా నిర్ణయానికి అనుగుణంగా జిల్లాలో కొత్తగా ఏడు నగర పంచాయతీలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. గండిపేట/బండ్లగూడ, తుర్కయంజాల్, తుక్కుగూడ, ఆదిబట్ల/కొంగరకలాన్, శంషాబాద్, శంకర్‌పల్లి, ఆమనగల్లు పురపాలక సంఘాలుగా మారే వీలుంది. ఇవేగాకుండా కొత్తూరును నగర పంచాయతీగా మార్చే అంశంపై జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. సమీప గ్రామాలను కలిపినా.. నిర్దేశిత జనాభా లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తోంది. గండిపేట మండలం కేవలం మణికొండ, పుప్పాల్‌గూడ మాత్రమే జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని, మిగతా గ్రామాలన్నింటిని కలుపుతూ గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో ఖానాపూర్, వట్టినాగుపల్లి, గండిపేట గ్రామాలు ఔటర్ రింగ్‌రోడ్డు అవతల ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మ్యాపుల తయారీలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది.
48 గ్రామాలు ఉష్‌కాకి!
కొత్త మున్సిపాలిటీలతో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 48 గ్రామాలను పురపాలక శాఖలో విలీనం కానున్నాయి. గండిపేట, శంకర్‌పల్లి, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్లు మండలాల పరిధిలోని ఈ గ్రామాలు నగర పంచాయతీల సరసన చేరనున్నాయి. కాగా, షాద్‌నగర్‌కు చేరువలో ఉన్న కొన్ని గ్రామాలను ఆ మున్సిపాలిటీలో చేర్చాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అయితే, గ్రామాల్లో ఇంకా 80శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నందున.. వాటి విలీనంపై పునరాలోచన చేస్తోంది. మరోవైపు తుర్కయంజాల్‌లో మునగనూరు చేరికపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. భౌగోళికంగా పెద్దఅంబర్‌పేట, జీహెచ్‌ఎంసీకి దగ్గరగా ఉన్న ఈ గ్రామాన్ని యంజాల్ మున్సిపాలిటీలో ప్రతిపాదిస్తే స్థానికంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సివస్తుందని యంత్రాంగం అంటోంది. నగర పంచాయతీల ఏర్పాటుపై శాస్త్రీయత ప్రశ్నిస్తూ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే న్యాయపరమైన ఇబ్బందులు తప్పవని భావిస్తోంది.
తుర్కయంజాల్: రాగన్నగూడ, తుర్కయంజాల్, ఇంజాపూర్, మునగనూరు, తొర్రూరు, బ్రాహ్మణపల్లి, కమ్మగూడ, ఉమర్‌ఖాన్‌గూడ దాయర, కోహెడ,
బండ్లగూడ లేదా గండిపేట: కిస్మత్‌పూర్, నార్సింగి, హైదర్షాకోట్, పీరంచెరువు, మంచిరేవుల, నెక్నాంపూర్, గండిపేట, వట్టినాగులపల్లి, ఖానాపూర్, బండ్లగూడ, హిమాయత్‌సాగర్, కోకాపేట్
కొంగర లేదా ఆదిబట్ల: బొంగ్లూరు, మంగల్‌పల్లి, కొంగరకలాన్, ఆదిబట్ల, పటేల్‌గూడ, రాందాస్‌పల్లి
తుక్కుగూడ: మంకాల్, రావిర్యాల, తుక్కుగూడ, సర్దార్‌నగర్
శంషాబాద్: సాతంరాయి, చిన్నగొల్లపల్లి, ఊట్‌పల్లి, కొత్వాల్‌గూడ, శంషాబాద్, తొండుపల్లి
శంకర్‌పల్లి: ఫతేపూర్, బుల్కాపూర్, సింగాపూర్, శంకర్‌పల్లి
ఆమనగల్లు: ఆమనగల్లు, విఠాయిపల్లి
Comments
Please login to add a commentAdd a comment