parking policy
-
మరో పది కోట్ల కార్లు రోడ్డెక్కితే..
సాక్షి, న్యూఢిల్లీ : ‘యూ డోంట్ నో వాట్ యూ గాట్ టిల్ ఇట్స్ గాన్, దే పేవ్ పారడైజ్ పుటప్ ఏ పార్కింగ్ లాట్ (నీవు పోగొట్టుకున్న దాని విలువ అది పొయ్యాకగానీ తెలియదు. వారు స్వర్గాన్ని చదునుచేసి పార్కింగ్ స్థలం చేస్తారు)’ అనే పాటను ‘బిగ్ ఎల్లో టాక్సీ’ ఆల్బమ్‌లో జోని మిశ్చెల్ పాడుతారు. అది నిజమయ్యే రోజు మరెంతో దూరంలో లేదు. నివాసిత కాలనీల్లోని ఖాళీ స్థలాలు, సాయం సంధ్య వేళల్లో పిల్లలు ఆడుకునే ఆట స్థలాలు, కొంటె కబుర్లు చెప్పుకుంటూ కుర్రాళ్లు కాలక్షేపంచేసే కూడలి స్థలాలు, ఇరు సంధ్యల్లో వాహ్యాలికి వెళ్లి ముసలివాళ్లు ముచ్చట్లు పెట్టుకునే స్థలాలు పార్కింగ్ స్థలాలుగా మారిపోతున్నాయి. మరో నాలుగు రోజులు పోతే అక్కడక్కడ ఉన్న పార్కులు, పశ్చిక బయళ్లు, ఫౌంటేన్లు కూడా పార్కింగ్ స్థలాలు అయ్యే ప్రమాదం ఉంది. భారత దేశంలో ప్రైవేటు వాహనాల సంఖ్య పది కోట్లు దాటడానికి దాదాపు 60 ఏళ్లు పట్టింది. మరో పదేళ్ళలోనే మరో పది కోట్ల వాహనాలు రోడ్లమీదకు వస్తాయని ప్రస్తుత అంచనాలు తెలియజేస్తున్నాయి. ఆదాయం పెరగడం వల్లనో, సౌకర్యం కోసమో, హోదా కోసమో ప్రజలు కార్ల కొనుగోలుకు పోటీ పడుతున్నారు. ఫలితంగా పుణె, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో వాహనాల కొనుగోళ్లు జనాభా పుట్టుక కన్నా రెండింతలు పెరిగాయి. హైదరాబాద్, చెన్నై, జైపూర్ నగరాలు కూడా వాటికి దగ్గరగానే పోతున్నాయి. మున్ముందు నగరాల్లో ఐదుగురు సభ్యుల కుటుంబం ఉండేందుకు 20 చదరపు మీటర్ల స్థలం దొరక్కపోవచ్చేమోగానీ ఉచిత కారు పార్కింగ్ చోటు మాత్రం కచ్చితంగా దొరుకుతుంది. రోజు రోజు పెరిగి పోతున్న పార్కింగ్‌కు ప్రభుత్వాలు సరైన స్థలాలు చూపించలేక పోవడం, పబ్లిక్ స్థలాల్లో పార్కింగ్ చేయడం తమ హక్కని వాహనాల యజమానులు భావించడం అందుకు కారణం. ఫ్రీ పార్కింగ్ అన్నది కార్లకు పునరుత్పత్తి డ్రగ్గు లాంటిదని అంతర్జాతీయ పార్కింగ్ గురు ‘డొనాల్డ్ షౌప్’ వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అన్ని నగరాల్లో అన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్ వ్యవస్థ ఉంది. భారత దేశంలో తక్కువగా పెయిడ్ పార్కింగ్, ఎక్కువగా ఫ్రీ పార్కింగ్లు ఉన్నాయి. పబ్లిక్ స్థలాల్లో ఉచితంగా పార్క్ చేసే హక్కు ప్రైవేటు కార్లకు ఎక్కడిదన్న ప్రశ్న ఆ దేశాలది. కొన్న కారుపై, వాడుతున్న ఇంధనంపై ఇప్పటికే పన్ను కడుతున్న తమ వద్ద నుంచి పార్కింగ్ చార్జీలు కూడా వసూలు చేస్తారా? అన్నది భారతీయుల ప్రశ్న. ప్రశ్నలో లాజిక్ ఉందిగానీ, దూర దృష్టి లేదు. ఉచిత పార్కింగ్ పేరిట అన్ని ఖాళీ స్థలాలు ఆక్రమించుకుంటూ పోతే మున్ముందు పబ్లిక్ స్థలాలంటూ మిగలవు. రోడ్లపై కేవలం ట్రాఫిక్ నియంత్రణకే పరిమితమవుతున్న ట్రాఫిక్ పోలీసుల వ్యవస్థ, నగర పాలనా వ్యవస్థతో కలిసి ఆధునిక పద్ధతిలో అన్ని చోట్ల పార్కింగ్ స్థలాల నిర్మాణం కోసం పూనుకోవాలి. అందుకు పార్కుల లాంటి పబ్లిక్ స్థలాల జోలికి వెళ్లకుండా ప్రత్యామ్నాయ స్థలాలు చూసుకోవాలి. ‘ఏం ట్రాఫిక్‌రా బాబు!’ అంటూ విసుక్కునే వాహన యజమానులు పార్కింగ్ స్థలాల కోసం ప్రభుత్వంపై విసుక్కోవాలి. -
ప్రైవేట్ పార్కింగ్లు!
సాక్షి,హైదరాబాద్: నగరంలో ప్రైవేట్ పార్కింగ్ స్థలాలు రానున్నాయి. నగరంలో కనీసం 100 గజాల ఖాళీ స్థలం ఉన్న వ్యక్తులెవరైనా ఆ స్థలాన్ని ప్రైవేట్ పార్కింగ్‌గా మార్చుకోవచ్చని జీహెచ్ఎంసీ తెలిపింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ నుంచి వ్యాపార అనుమతులను పొందాల్సి ఉంటుంది. ముందుగా తొలి మూడు నెలలకు మాత్రమే ఈ అనుమతులు ఇస్తారు. తర్వాత వాటిని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్‌కు ఇచ్చిన స్థలాలను జియో ట్యాగింగ్ చేస్తారు. ఆ ప్రదేశంలో ఏర్పాటు చేసే బోర్డులో ఫీజుల వివరాలు ఉంటాయి. నిర్ణీత ఫీజుకంటే అధికంగా వసూలు చేసే వారిపై ఫిర్యాదు చేసేందుకు అధికారుల ఫోన్ నంబర్లను కూడా అందులో పేర్కొంటారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులు, ఇతరత్రా భూముల్లో మాత్రం పార్కింగ్ ఏర్పాట్లకు అనుమతులివ్వరు. తమ స్థలాలను పార్కింగ్‌కు ఇవ్వాలనుకునేవారు 99495 46622, 040–21 11 11 11 నంబర్లకు ఫోన్ లేదా ్చఛ్ఛిట్ట్చ్ట్ఛటజిౌuటజీnజఃజఝ్చజీ .ఛిౌఝ కు మెయిల్‌చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు. పార్కింగ్ ఫీజులు ఇలా ⇒ కార్లు, తదితర 4 చక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు:రూ.20 ⇒ ఆ తర్వాత ప్రతి గంటకు :రూ.5 ⇒ బైక్‌లు, తదితర ద్విచక్ర వాహనాలకు మొదటి రెండు గంటలకు: రూ.10 ⇒ ఆ తర్వాత ప్రతి రెండు గంటలకు: రూ.5 యాప్ ద్వారా రిజర్వేషన్ ప్రైవేట్ పార్కింగ్‌కు అనుమతించిన ప్రదేశాలు, తదితర వివరాలతో ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు.ఈ యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ కూడా చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. మలిదశలో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే లారీలు, టిప్పర్లు, తదితర వాహనాలకు రాత్రివేళల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దందాగా మారే అవకాశం? పార్కింగ్ దందాతో అక్రమాలు పెరిగిపోవడంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉన్న 54 పార్కింగ్ స్లాట్లలో ఉచిత పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. త్వరలో అందుబాటులోకి రానున్న ప్రైవేట్ పార్కింగ్ ప్రదేశాలతో తిరిగి పార్కింగ్ దందాలుగా మారకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకుంటే అవి కూడా అక్రమార్కుల కేంద్రాలుగా మారే ప్రమాదముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎక్కడ పడితే అక్కడ ఇక చెల్లదు
♦ మార్గదర్శకాలతో నూతన పార్కింగ్ పాలసీ ♦ ప్రైవేటు పార్కింగ్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలు ♦ ఆస్తిపన్నులో మినహాయింపు.. భవనం ఎత్తు పెంచుకునే వెసులుబాటు ♦ నివాస, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో పార్కింగ్‌కు కొత్త నిబంధనలు ♦ నూతన విధానం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.. ఆఫ్‌స్ట్రీట్ పార్కింగ్ లాట్స్‌కు ప్రోత్సాహకాలు బీవోటీ విధానంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో పార్కింగ్ లాట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఖాళీ స్థలాల్లో పార్కింగ్, మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలు కల్పించే వారికి పార్కింగ్ నిర్వహణ లైసెన్స్‌ల జారీ. పార్కింగ్ సదుపాయం కల్పించే వ్యక్తులకు అంతే స్థల పరిమాణంతో 100 శాతం టీడీఆర్ హక్కులు కల్పిస్తారు. జోన్ల నిబంధనలను సడలించి వాణిజ్య ఉపయోగాలకు అనుమతిస్తారు. పార్కింగ్‌కు మల్టిపుల్ ఫ్లోర్లను కేటాయిస్తే భవన ఎత్తు విషయంలో నిబంధనల సడలింపు. నిర్ణీత కాలం పాటు పార్కింగ్‌కు స్థలం కేటాయిస్తే 100 శాతం ఆస్తి పన్ను మినహాయింపు. 100 శాతం భవన నిర్మాణ రుసుం మినహాయింపు . సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం, రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలను అభివృద్ధి పరచడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ‘పార్కింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండగా వాహనాల పార్కింగ్ సదుపాయం మాత్రం పరిమితం ఉంది. దీంతో రోడ్లు, వీధుల్లో వాహనాల అక్రమ పార్కింగ్ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాలను పెంపొందించేందుకు కొత్త మార్గదర్శకాలతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ఈ పాలసీని ప్రకటించింది. అందులోని ముఖ్యాంశాలివీ.. నివాస ప్రాంతాల్లో పార్కింగ్ ఇలా.. నివాస ప్రాంతాల్లో వాహనాలను రోడ్ల వెంట పార్కింగ్‌కు అనుమతించరు. పార్కింగ్ ఏర్పాట్లు ప్రోత్సహించేందుకు బిల్డింగ్ బైలాస్ అమలు చేస్తారు. ప్రైవేట్ ఆఫ్‌స్ట్రీట్ ప్రాంతాల్లో పార్కింగ్‌ను ప్రోత్సహించేలా భవన నిర్మాణ అనుమతుల్లో మార్పులు. ప్రైవేట్ పార్కింగ్‌లను ప్రోత్సహించేందుకు ఆస్తిపన్ను చెల్లింపులో మినహాయింపు. పార్కింగ్‌ల కోసం నిర్మాణాలు చేసే వారికి ఆ మేరకు భవనం ఎత్తు పెంచుకునే వెసులుబాటు. ఫ్లాట్ల యజమానులు, సందర్శకులు ఆన్‌స్ట్రీట్ రోడ్లపై పార్కింగ్ చేయడంపై నిషేధం. ప్రభుత్వ కార్యాలయాలు, థియేటర్లు తదితర ప్రాంతాల్లో... విద్యా సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య కాంప్లెక్సులు, సినిమా థియేటర్లు, కల్యాణ మండపాలు, వినోద కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు తమ సిబ్బంది, సందర్శకులకు ఆఫ్‌స్ట్రీట్ పార్కింగ్ సదుపాయం కల్పించాలి. వివిధ సంస్థలు తమ ఉద్యోగులు, సందర్శకుల అవసరాలకు తగినంతగా పార్కింగ్ సదుపాయం కల్పించాలి ఆయా సంస్థల్లో పార్కింగ్ సదుపాయాలు చాలని వారికి రోడ్లపై పార్కింగ్‌ను అనుమతించరు. ∙పని వేళల తర్వాత పార్కింగ్ సదుపాయాలు కల్పించే సంస్థలను ప్రోత్సహిస్తారు. భారీ వాహనాల పార్కింగ్ ఇలా... బస్సులు, ట్రక్కులు, ఓమ్ని బస్సులు, టూరిస్టు బస్సులు, వ్యాన్లు, వాటర్ ట్యాంకర్లు, కంటైనర్ లారీలు రాత్రిళ్లు మేజర్ రోడ్లపై పార్కింగ్ చేయడాన్ని అనుమతించరు. వాటికోసం ప్రత్యేకంగా ఆఫ్‌స్ట్రీట్ పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తారు. వినియోగంలో లేని వాహనాలను కూడా అక్కడ పార్కింగ్ చేయవచ్చు. ∙తగిన ఫీజులతో నిర్దేశిత ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాలు రాత్రంతా పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. క్యాబ్స్, బస్సులు, ట్రక్కులు వాణిజ్య కార్యకలాపాల లైట్ వెహికల్స్‌ను రాత్రివేళల్లో నివాస ప్రాంతాల్లో పార్కింగ్‌కు అనుమతించరు. బస్, రైల్వే స్టేషన్లలో... సబర్బన్ రైల్వే, ఎంఎంటీఎస్, మెట్రోస్టేషన్లు, ఆర్టీసీ బస్ టెర్మినల్స్ వద్ద ప్రయాణికుల కోసం పార్కింగ్ సదుపాయాలు మెరుగుపరచాలి. అవసరమైతే ఈ ప్రాంతాల్లో ప్రైవేటు పార్కింగ్ సదుపాయాన్ని ప్రోత్సహించాలి. -
పార్కింగ్ కోసం ప్రత్యేక పాలసీ: కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ నగరంతోపాటు, ఇతర పట్టణాల్లో పార్కింగ్ కోసం ప్రత్యేకమైన పాలసీ తీసుకురానున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖాధికారులతో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రజలకు ప్రధానంగా పార్కింగ్, రోడ్ల నిర్వహణ లోపాల వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే పలు దఫాలుగా రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్లు, మున్సిపల్ శాఖా అధికారులతో పార్కింగ్ పాలసీ రూపకల్పనపైన సమావేశాలు నిర్వహించామన్నారు. ఈ మేరకు రూపొందించిన పార్కింగ్ పాలసీ డ్రాప్ట్ పైనా అధికారులతో చర్చించారు. రోడ్లపైన వాహనాలు తిరిగేందుకు నిర్ధారించిన మార్గాన్ని కాపాడడం, రద్దీని తగ్గించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ పాలసీ ఉంటుందన్నారు. నగరంలోని ప్రణాళిక బద్దమైన అభివృద్ది దిశగా తీసుకుకెళ్లేందుకు ఈ పార్కింగ్ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. నగరంలో మల్టీ లెవల్ పార్కింగ్ ఎర్పాట్లతో పాటు ఖాళీ ప్రదేశాల్లోను పార్కింగ్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఖాళీ ప్రదేశాల యాజమాన్యాలను చైతన్యవంతం చేసేలా అధికారులు ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ మేరకు పార్కింగ్ కోసం ముందుకు వచ్చే వారికి పలు ప్రొత్సాకాలను ఇస్తామన్నారు. నూతనంగా భవనాలు నిర్మాణం చేసేవారు పార్కింగ్ కోసం నిర్దారిత పార్కింగ్ కన్నా అధికంగా పార్కింగ్ కల్పిస్తే వారికి భవన నిర్మాణ అనుమతుల్లో కొన్ని సడలింపులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. గతంలో పార్కింగ్ కోసం ఉద్దేశించిన ప్రదేశంలో నిర్మాణాలు చేసిన కాంప్లెక్స్ ల్లో కూల్చివేతలు వేంటనే చేపట్టాలని ఛీప్ టౌన్ ప్లానింగ్ అఫీసర్ కు ఆదేశాలిచ్చారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు.