సాక్షి, న్యూఢిల్లీ : ‘యూ డోంట్ నో వాట్ యూ గాట్ టిల్ ఇట్స్ గాన్, దే పేవ్ పారడైజ్ పుటప్ ఏ పార్కింగ్ లాట్ (నీవు పోగొట్టుకున్న దాని విలువ అది పొయ్యాకగానీ తెలియదు. వారు స్వర్గాన్ని చదునుచేసి పార్కింగ్ స్థలం చేస్తారు)’ అనే పాటను ‘బిగ్ ఎల్లో టాక్సీ’ ఆల్బమ్‌లో జోని మిశ్చెల్ పాడుతారు. అది నిజమయ్యే రోజు మరెంతో దూరంలో లేదు. నివాసిత కాలనీల్లోని ఖాళీ స్థలాలు, సాయం సంధ్య వేళల్లో పిల్లలు ఆడుకునే ఆట స్థలాలు, కొంటె కబుర్లు చెప్పుకుంటూ కుర్రాళ్లు కాలక్షేపంచేసే కూడలి స్థలాలు, ఇరు సంధ్యల్లో వాహ్యాలికి వెళ్లి ముసలివాళ్లు ముచ్చట్లు పెట్టుకునే స్థలాలు పార్కింగ్ స్థలాలుగా మారిపోతున్నాయి. మరో నాలుగు రోజులు పోతే అక్కడక్కడ ఉన్న పార్కులు, పశ్చిక బయళ్లు, ఫౌంటేన్లు కూడా పార్కింగ్ స్థలాలు అయ్యే ప్రమాదం ఉంది.
భారత దేశంలో ప్రైవేటు వాహనాల సంఖ్య పది కోట్లు దాటడానికి దాదాపు 60 ఏళ్లు పట్టింది. మరో పదేళ్ళలోనే మరో పది కోట్ల వాహనాలు రోడ్లమీదకు వస్తాయని ప్రస్తుత అంచనాలు తెలియజేస్తున్నాయి. ఆదాయం పెరగడం వల్లనో, సౌకర్యం కోసమో, హోదా కోసమో ప్రజలు కార్ల కొనుగోలుకు పోటీ పడుతున్నారు. ఫలితంగా పుణె, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో వాహనాల కొనుగోళ్లు జనాభా పుట్టుక కన్నా రెండింతలు పెరిగాయి. హైదరాబాద్, చెన్నై, జైపూర్ నగరాలు కూడా వాటికి దగ్గరగానే పోతున్నాయి. మున్ముందు నగరాల్లో ఐదుగురు సభ్యుల కుటుంబం ఉండేందుకు 20 చదరపు మీటర్ల స్థలం దొరక్కపోవచ్చేమోగానీ ఉచిత కారు పార్కింగ్ చోటు మాత్రం కచ్చితంగా దొరుకుతుంది. రోజు రోజు పెరిగి పోతున్న పార్కింగ్‌కు ప్రభుత్వాలు సరైన స్థలాలు చూపించలేక పోవడం, పబ్లిక్ స్థలాల్లో పార్కింగ్ చేయడం తమ హక్కని వాహనాల యజమానులు భావించడం అందుకు కారణం. ఫ్రీ పార్కింగ్ అన్నది కార్లకు పునరుత్పత్తి డ్రగ్గు లాంటిదని అంతర్జాతీయ పార్కింగ్ గురు ‘డొనాల్డ్ షౌప్’ వ్యాఖ్యానించారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో అన్ని నగరాల్లో అన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్ వ్యవస్థ ఉంది. భారత దేశంలో తక్కువగా పెయిడ్ పార్కింగ్, ఎక్కువగా ఫ్రీ పార్కింగ్‌లు ఉన్నాయి. పబ్లిక్ స్థలాల్లో ఉచితంగా పార్క్ చేసే హక్కు ప్రైవేటు కార్లకు ఎక్కడిదన్న ప్రశ్న ఆ దేశాలది. కొన్న కారుపై, వాడుతున్న ఇంధనంపై ఇప్పటికే పన్ను కడుతున్న తమ వద్ద నుంచి పార్కింగ్ చార్జీలు కూడా వసూలు చేస్తారా? అన్నది భారతీయుల ప్రశ్న. ప్రశ్నలో లాజిక్ ఉందిగానీ, దూర దృష్టి లేదు. ఉచిత పార్కింగ్ పేరిట అన్ని ఖాళీ స్థలాలు ఆక్రమించుకుంటూ పోతే మున్ముందు పబ్లిక్ స్థలాలంటూ మిగలవు. రోడ్లపై కేవలం ట్రాఫిక్ నియంత్రణకే పరిమితమవుతున్న ట్రాఫిక్ పోలీసుల వ్యవస్థ, నగర పాలనా వ్యవస్థతో కలిసి ఆధునిక పద్ధతిలో అన్ని చోట్ల పార్కింగ్ స్థలాల నిర్మాణం కోసం పూనుకోవాలి. అందుకు పార్కుల లాంటి పబ్లిక్ స్థలాల జోలికి వెళ్లకుండా ప్రత్యామ్నాయ స్థలాలు చూసుకోవాలి. ‘ఏం ట్రాఫిక్‌రా బాబు!’ అంటూ విసుక్కునే వాహన యజమానులు పార్కింగ్ స్థలాల కోసం ప్రభుత్వంపై విసుక్కోవాలి.
Comments
Please login to add a commentAdd a comment