కేటీఆర్ కనుసన్నల్లో నేరెళ్ల విచారణ: జీవన్‌రెడ్డి
జగిత్యాల జోన్: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల దళితులపై జరిగిన దాడుల విచారణ అంతా మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. బాధితులను కేటీఆర్ పరామర్శించాకే.. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దాడి ఘటనలో ఏ పోలీస్‌స్టేషన్‌కూ ఇన్‌చార్జికాని సీసీఎస్ ఎస్సై రవీందర్‌ను సస్పెండ్ చేశారని, వాస్తవానికి ఎస్పీ ఆదేశాల మేరకే.. సీసీఎస్ ఎస్సైలు నిందితులను విచారిస్తారని, సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం వారికి ఉండదని గుర్తు చేశారు.
దళితులపై దాడుల్లో ఎస్పీ స్వయంగా పాల్గొన్నా.. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరుల స్ఫూర్తియాత్ర నిర్వహిస్తున్న జేఏసీ చైర్మన్ కోదండరాంపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని జీవన్‌రెడ్డి అన్నారు. కామారెడ్డిలో పోలీసులు అనుమతించిన సభను టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మెను శాంతియుతంగా నిర్వహించిన కోదండరాం మాత్రం పనికిరాకుండా పోయారని, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు.