బలనిరూపణా.. ప్రజాభిప్రాయ సేకరణా?
సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను టీఆర్‌ఎస్ నేతలు బలనిరూపణ కార్యక్రమంగా మార్చారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బాధితులతో బలవంతంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టిస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ చట్టం–2013ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో భూనిర్వాసితులకు నష్టపరిహారాన్ని తగ్గించడం దారుణమని జీవన్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచి, కాంట్రాక్టర్లకు వేల కోట్లు కట్టబెడుతున్న ప్రభుత్వం భూ నిర్వాసితులపై అరాచకాలకు, దాడులకు పాల్పడటం బాధాకరమన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు భేషజాలకు పోకుండా రైతులను ఆదుకోవాలనే, కాపాడుకోవాలనే విశాలమైన దృక్పథంతో ఆలోచించాలని కోరారు.