strength proof
-
కండలుంటే గెలిచినట్టు కాదు
-
కర్ణాటకంలో కాంగ్రెస్ దూకుడు
కర్ణాటక రాజకీయ క్రీడలో ప్రస్తుతానికి కాంగ్రెస్ విజయం సాధించింది. గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినా.. అధికారం చేపట్టలేకపోయిన వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకున్న కాంగ్రెస్.. కర్ణాటకలో తమ వ్యూహాలను పకడ్బందీగా అమల్లో పెట్టింది. ప్రచారంలోనూ దూకుడుగా వ్యవహరించిన కాంగ్రెస్.. విజయంపై తొలి నుంచి ధీమాగానే ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందే ప్రచార రంగంలోకి దూకింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు దఫాలుగా రాష్ట్రాన్ని చుట్టేశారు. మరోవైపు సిద్దరామయ్య ఇమేజ్, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అంతగా లేని వ్యతిరేకత తమకు కలసి వస్తాయని కాంగ్రెస్ ఆశించింది. రాహుల్ దేవాలయాల సందర్శన, లింగాయత్‌లకు మైనారిటీ హోదా.. తదితరాలు కూడా ఓట్లు కురిపిస్తాయనుకుంది. కానీ ఫలితాలు వేరుగా వచ్చాయి. సాధారణంగా అయితే, ఓటమిని అంగీకరించి, మౌనంగా ఉండే కాంగ్రెస్.. ఈసారి ఊహించని దూకుడును ప్రదర్శించింది. ఫలితాలు వెలువడుతుండగానే రంగంలోకి దిగింది. రాహుల్ ఇంట్లో జరిగిన ‘లంచ్ మీట్’లో ప్లాన్ బీని సిద్ధం చేసింది. ఫలితాలకు ముందు రోజే బెంగళూరు చేరుకున్న ఆజాద్ ద్వారా జేడీఎస్‌తో రాయబారం నడిపింది. ప్రభుత్వ ఏర్పాటులో కలసి నడుద్దామని, జేడీఎస్‌కు మద్దతిచ్చేందుకు సిద్దమని సమాచారం పంపింది. సీఎంగా కుమారస్వామి ఉంటారన్న డిమాండ్ సహా జేడీఎస్ నుంచి వచ్చిన డిమాండ్లకు వెంటనే ఆమోదం తెలిపింది. సీనియర్ నేతలు ఆజాద్, అశోక్ గెహ్లాట్‌లు స్వయంగా కాంగ్రెస్ ప్రణాళికను దగ్గరుండి మరీ అమలు చేసేలా చూసింది. ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో గవర్నర్ వద్దకు కుమారస్వామితో పాటు ఆజాద్‌నూ పంపించింది. లాస్ట్ ‘రిసార్ట్’..: ఇప్పుడు తమ ఎమ్మెల్యేలతో పాటు జేడీఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కాంగ్రెస్‌కు ప్రధాన సమస్యగా మారింది. ఎమ్మెల్యేలు చేజారకుండా రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. ఇలాంటి విషయాల్లో అనుభవజ్ఞుడైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు ఈ బాధ్యతను అప్పగించింది. తొలుత బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను భద్రంగా దాచిన శివకుమార్, మరింత భద్రత కోసం అనూహ్యంగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించి, బలపరీక్ష రోజే(శనివారం) అసెంబ్లీకి చేరుకునేలా ప్రణాళిక రచించారు. అంతకుముందు, వారిని కొచ్చికి తరలిస్తున్నట్లుగా లీకులిచ్చి, గందరగోళం సృష్టించారు. ‘మిస్’ అయిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప గౌడను కూడా మళ్లీ సొంత గూటికి తెచ్చారు. ఇలా అనూహ్యంగా దూకుడుగా వ్యవహరించిన కాంగ్రెస్ మొత్తానికి బీజేపీకి చెక్ పెట్టింది. ఈ మొత్తం వ్యూహాన్ని సోనియా గాంధీ, రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా కూడా స్వయంగా పర్యవేక్షించారు. కోర్టులోనూ క్రియాశీలకంగా.. యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన తరువాత కూడా కాంగ్రెస్ శీఘ్రంగా స్పందించింది. పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖ న్యాయవాదులైన అభిషేక్ మను సింఘ్వీ, చిదంబరంలను రంగంలోకి దింపింది. యడ్యూరప్పను ఆహ్వానించడాన్ని, బలనిరూపణకు 15 రోజుల గడవు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో ప్రశ్నించింది. బుధవారం అర్ధరాత్రే సుప్రీంకోర్టు తలుపు తట్టి, తమ పిటిషన్‌ను విచారించాలని కోరింది. దాంతో అప్పటికప్పుడు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన వాదనలు తెల్లవారే వరకు నడిచాయి. కానీ యెడ్డీ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆ తరువాత ఇరుపక్షాల వాడీవేడి వాదనల అనంత రం ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును పక్కనబెట్టి, శనివారం సాయంత్రం 4 గంటలకు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని యడ్యూరప్పను ఆదేశించింది. ఈ తీర్పు కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. – సాక్షి నేషనల్ డెస్క్ -
హైదరాబాద్‌లో కర్ణాటకం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటకం హైదరాబాద్‌కు చేరింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను శుక్రవారం ఉదయం భాగ్యనగరానికి తరలించాయి. తొలుత కేరళలోని కొచ్చికి వెళ్లాలని భావించినా చివరికి హైదరాబాద్‌నే ఎంచుకున్నారు. ఉదయం తొమ్మిది గంటలకల్లా ఇరుపార్టీల ఎమ్మెల్యేలంతా రాజధానిలోని తాజ్‌కృష్ణ, నోవాటెల్ హోటళ్లకు ప్రత్యేక బస్సుల్లో చేరిపోయారు. జేడీఎస్ పేరిట మాదాపూర్ నోవాటెల్‌లో 36 గదులను, కాంగ్రెస్ పేరిట తాజ్‌కృష్ణలో 120 గదులు బుక్ చేశారు. ఒక్కో గదిలో ఒక్కో ఎమ్మెల్యేను ఉంచారు. మిగతా గదులను ఇరుపార్టీల కీలక నేతలు, వ్యూహకర్తలు, సీనియర్ లీడర్లకు అప్పగించారు. ఓ ఇండిపెండెంట్‌తో కలిపి కాంగ్రెస్ నుంచి 77 మంది, జేడీఎస్ నుంచి 36 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. హుటాహుటిన రాష్ట్ర నేతలు.. ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించాలని కాంగ్రెస్–జేడీఎస్ గురువారం అర్ధరాత్రి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ కర్ణాటక ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వస్తున్నారన్న సమాచారంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా ఈ రెండు హోటళ్ల వద్దకు భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్ణాటక ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తూ వారికి కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఉదయం 8 గంటల నుంచే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హోటల్‌కు చేరుకొని కర్ణాటక ఎమ్మెల్యేలకు కావాల్సిన సదుపాయాలను పర్యవేక్షించారు. అర్ధరాత్రి సమయంలోనే కర్ణాటక ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌కు చేరుకుంటారని భావించారు. కానీ తర్వాత తాజ్, నోవాటెల్ హోటళ్లను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల క్యాంపులో ఎక్కడా ఎవరూ సెల్‌ఫోన్ వాడకుండా ఇరు పార్టీలు జాగ్రత్తలు వహించాయి. బస చేస్తున్న హోటళ్లలోని ల్యాండ్‌లైన్ నుంచి కూడా ఫోన్‌కాల్ బయటకు వెళ్లే అవకాశం లేకుండా చేసినట్టు తెలిసింది. తాజ్‌కు చేరుకున్న ఎమ్మెల్యేల్లో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సాయంత్రం సిద్దరామయ్య రాక.. శుక్రవారం సాయంత్రం 4.15 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన్ను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు ఆహ్వానించి తాజ్ హోటల్‌కు తీసుకువచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో హోటల్ చేరుకున్న సిద్దరామయ్య.. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌అలీ, భట్టి విక్రమార్క, గీతారెడ్డి, వీహెచ్, కన్నడ పార్టీ కీలక నేత డీకే శివకుమార్, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్, వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. 5.30 గంటల సమయంలో కన్నడ కాంగ్రెస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. శనివారం బలనిరూపణ సమయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై సిద్దరామయ్య ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం ముగియనుండగా 5.50 గంటల సమయంలో జేడీఎస్ నేత కుమారస్వామి తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. కన్నడ పీసీసీ నేతలతో భేటీ అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఆయన నోవాటెల్‌కు వెళ్లారు. కాగా తాజ్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో సిద్దరామయ్యను ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నోవాటెల్‌లో కుమారస్వామి, రేవణ్ణ ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య సమావేశం నిర్వహించగా.. అంతకుముందే జేడీఎస్ నేత కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ నోవాటెల్‌లో వారి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. జేడీఎస్ నుంచి ఒక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు తిప్పుకునేందుకు చేస్తున్న వ్యూహాలను కుమారస్వామి వారికి వివరించారు. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తుతో ప్రభుత్వం ఏర్పడుతుందని, ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో దేవెగౌడ రేవణ్ణకు ఫోన్ చేసి మాట్లాడారు. బీజేపీ నుంచి పొత్తు ప్రతిపాదన రావడం, సున్నితంగా తిరస్కరించిన అంశాలను కుమారస్వామి, రేవణ్ణకు ఆయన వివరించినట్టు తెలిసింది. గొడవ చేయొద్దు.. సస్పెండ్ చేస్తారు.. తమ ఎమ్మెల్యేలకు జేడీఎస్, కాంగ్రెస్ ముఖ్య నేతలు కీలక సూచనలు చేశారు. శనివారం అసెంబ్లీలో జరగబోయే బలనిరూపణ సమయంలో బీజేపీ... ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగి సస్పెన్షన్ ప్లాన్ వేసిందని వివరించారు. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేను నియమించడం వెనుకున్న ఆంతర్యం కూడా ఇదేనని, దీనిపైనా శుక్రవారం రాత్రి సుప్రీంకు వెళ్తున్నట్టు సిద్ద రామయ్య, కుమారస్వామి తమ పార్టీల ఎమ్మెల్యేలకు సూచించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉండాలని, సహనం పాటించాలని పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ? కాంగ్రెస్, జేడీఎస్ క్యాంపులో ఇద్దరు ఎమ్మెల్యేలు మిస్ అయ్యారన్న ప్రచారంతో ఇరుపార్టీల నేతలు కలవరానికి గురయ్యారు. గెలిచినప్పట్నుంచే ఆనంద్‌సింగ్, ప్రతాప్‌గౌడ పాటిల్ ఇద్దరూ పార్టీకి దూరంగా ఉన్నట్టు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించారు. అయితే వీరిలో ఆనంద్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడని, ప్రతాపగౌడ పాటిల్ బీజేపీ అధీనంలో ఉన్నట్టు తెలిపారు. అలాగే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ముగ్గురిలో బీఎస్పీకి చెందిన శేఖర్ సైతం హైదరాబాద్ చేరుకున్నారని, మరో ఇద్దరు బెంగళూరులోనే ఉన్నారని సమావేశంలో ప్రకటించారు. ఈ ముగ్గురు కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మద్దతు తెలుపుతారని సిద్దరామయ్య ఎమ్మెల్యేలకు వివరించారు. బీజేపీ నెగ్గే అవకాశం లేదు: కుమారస్వామి బలపరీక్షలో బీజేపీ నెగ్గే అవకాశం లేదని కుమారస్వామి ధీమాగా చెప్పారు. శుక్రవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీకి సంఖ్యాబలం లేదన్నారు. ‘ఆపరేషన్ కమల’కు చిక్కకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉన్నారనీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఏకతాటిపై నిలబడ్డారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఒకవేళ బీజేపీ ‘ఆపరేషన్ కమల’ చేపడితే, ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను తాము లాక్కుంటామని హెచ్చరించారు. సంఖ్యాబలం లేకపోయినా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నతాధికారులను బదిలీ చేశారని కుమారస్వామి ఆరోపించారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్ వద్ద మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. గవర్నర్ రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం దారుణం. మా కూటమి ఎమ్మెల్యేలంతా ఒక్క తాటిపై ఉన్నారు’ అని చెప్పారు. బస ఖర్చు భారీగానే.. హైదరాబాద్‌లో కాంగ్రెస్–జేడీఎస్ క్యాంపు ఖర్చు భారీగానే ఉంది. తాజ్‌లో అప్పటికప్పుడు రూం బుక్ చేయాలంటే కనీసం రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఖర్చవుతుంది. భోజనం, ఇతర ఖర్చులన్నీ కలిపి 24 గంటలకు రూ.30 వేల వరకు ఖర్చవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అంటే 120 గదులకు ఒక్కరోజుకే రూ.36 లక్షలు అవుతుంది. అలాగే నోవాటెల్‌లో ఒక్కో గదికి రూ.9 వేల చొప్పున కాగా.. భోజనం, తదితర ఖర్చులు మరో రూ.6 వేలకు పైగా అయినట్టు తెలిసింది. ఇలా ఆ పార్టీ ఎమ్మెల్యేల బసకు రూ.5.5 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఖర్చయినట్టు తెలిసింది. ఇవి కాకుండా ప్రయాణం, మధ్యలో భోజనం, ఇతర ఖర్చులకు కూడా భారీగానే వెచ్చించినట్టు సమాచారం. ఒక్క రోజు క్యాంపు మొత్తం ఖర్చు రెండు పార్టీలకు కలిపి రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా అవుతుందని టీపీసీసీ, కేపీసీసీ నేతలు చర్చించుకున్నారు. అర్ధరాత్రి బెంగళూరుకు.. తాజ్‌లో బస చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాత్రి 8.40 గంటల ప్రాంతంలో డిన్నర్ చేశారు. అర్ధరాత్రి సమయంలో హోటల్ నుంచి మూడు బస్సుల్లో బెంగళూరు శివారులోని ఈగల్ రిసార్ట్‌కు వెళ్లారు. నోవాటెల్‌లో 9.30 గంటలకు భోజనం చేసి జేడీఎస్ ఎమ్మెల్యేలు రాత్రి 10 గంటలకు రెండు బస్సులో ఈగల్ రిసార్ట్‌కు బయల్దేరారు. కుమారస్వామి కారులో.. సిద్దరామయ్య ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. మొరాయించిన బస్సు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తాజ్‌కృష్ణ వద్దకు వచ్చిన ఓ బస్సు హోటల్ లోపలికి వెళ్లేందుకు మొరాయించింది. 22 మంది ఎమ్మెల్యేలు లోపల ఉండగా బస్సు దిగేందుకు తలుపులు కూడా తెరుచుకోలేదు. దీంతో తాజ్‌కృష్ణ హోటల్ ముందు ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎలాగోలా ఎమ్మెల్యేలను బస్సు నుంచి బయటకు తీసుకొచ్చి భారీ బందోబస్తు మధ్య హోటల్ లోపలికి చేర్చారు. చెడిపోయిన బస్సు రోడ్డుపై రెండు గంటలు అలాగే ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాత్రూంలో ఎమ్మెల్యేలు.. హైరానా! సిద్దరామయ్య, కుమారస్వామి ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించలేదు. అదే సమయంలో కర్ణాటక నుంచి ఓ బీజేపీ ఎమ్మెల్యే హోటల్లోకి వచ్చాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీంతో మధుయాష్కీని కుమారస్వామి అప్రమత్తం చేశారు. 200 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు హోటల్‌ను జల్లెడ పట్టారు. మరో 200 మంది కార్యకర్తలను హోటల్ చుట్టూ మోహరించారు. చివరికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. బాత్రూంకు వెళ్లారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలోనూ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కిందకు రాకపోవడంతో హైడ్రామా నడిచింది. గదుల్లోనూ లేకపోవడం, భోజనానికి రాకపోవడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. 20 నిమిషాల తర్వాత వారు ప్రత్యక్షం కావడంతో శాంతించారు. తాజ్‌కృష్ణలో సిద్దరామయ్య, కుమారస్వామితో జానారెడ్డి తదితరులు తాజ్‌కృష్ణ వద్ద రోడ్డుపై నిలిచిపోయిన బస్సు -
నేడే యడ్యూరప్ప పరీక్ష
న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయం అంతిమ ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో శనివారం యడ్యూరప్ప సర్కారు బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడమే సమస్యకు పరిష్కారమని తేల్చింది. బల నిరూపణ కోసం యడ్యూరప్ప సర్కారుకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును పక్కనపెడుతూ శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష జరపాలంది. యడ్యూరప్ప సర్కారు ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కాంగ్రెస్–జేడీఎస్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ఉదయం విచారణ కొనసాగింది. ‘యడ్యూరప్పకు బలముందో లేదో సభే నిర్ణయిస్తుంది. దీనికి సరైన పరిష్కారం బలపరీక్షే’ అని జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీం బెంచ్ పేర్కొంది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ భూషణ్‌లు సభ్యులుగా ఉన్న ఈ బెంచ్.. రహస్య బ్యాలెట్ పద్ధతిలో బలనిరూపణకు అనుమతి ఇవ్వాలన్న యడ్యూరప్ప విజ్ఞప్తిని తోసిపుచ్చింది. బలపరీక్షలో ఓటు వేసేలా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యేను నామినేట్ చేయవద్దని కర్ణాటక ప్రభుత్వాన్ని, ఆ రాష్ట్ర గవర్నర్‌ను ఆదేశించింది. సభ విశ్వాసం పొందేవరకూ కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఎలాంటి కీలకమైన విధానపర నిర్ణయాలు తీసుకోకూడదని ఆదేశించింది. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని విచారిస్తామని తెలిపింది. నేడు జరిగే బలపరీక్ష సందర్భంగా చట్టానికి లోబడి ప్రొటెం స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీ వెలుపల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. మెజార్టీకి సంబంధించిన అంశం..సభలోనే నిరూపించుకోవాలి: సుప్రీం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం ఉన్న తమను కాదని బీజేపీని గవర్నర్ వజూభాయ్ ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్–జేడీఎస్‌లు సుప్రీంను ఆశ్రయించడం తెల్సిందే. ఆ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంలో వాదనలు కొనసాగాయి. కాంగ్రెస్–జేడీఎస్‌ల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం, యడ్యూరప్ప, బీజేపీ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ‘అంతిమంగా చూస్తే ఈ అంశం మెజార్టీకి సంబంధించింది. దానిని సభలోనే నిరూపించుకోవాలి’ అని కోర్టు అభిప్రాయపడింది. మే 12న కర్ణాటకలోని 222 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 స్థానాలు సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 112 స్థానాలు అవసరం కాగా.. 117 ఎమ్మెల్యేల బలమున్న తమను కాదని, అప్రజాస్వామికంగా గవర్నర్ బీజేపీని ఆహ్వానించారనేది కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ఆరోపణ. గవర్నర్ విచక్షణాధికారం: ముకుల్ రోహత్గీ పిటిషన్ విచారణ సందర్భంగా తమకే మెజార్టీ ఉందని బీజేపీ, కాంగ్రెస్–జేడీఎస్ కూటములు కోర్టుకు తెలిపాయి. వాటి తరఫున హాజరైన న్యాయవాదుల వాడివేడి వాదనలతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగింది. గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సరికాదని కాంగ్రెస్–జేడీఎస్‌లు వాదించగా.. ఆ కూటమి సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖలు వివాదాస్పదంగా ఉన్నాయని బీజేపీ అభ్యంతరం తెలిపింది. హెచ్డీ కుమార స్వామిని తమ నేతగా పేర్కొంటూ కాంగ్రెస్–జేడీఎస్‌లు సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల విశ్వసనీయతను రోహత్గీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించాలని గవర్నర్‌కు యడ్యూరప్ప రాసిన లేఖల్ని ఆయన కోర్టుకు సమర్పించారు. ‘మేం అతిపెద్ద పార్టీగా అవతరించాం. మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. మాకు ఇతరుల మద్దతు ఉంది’ అని మే 16న గవర్నర్‌కు యడ్యూరప్ప రాసిన లేఖలోని సారాంశాన్ని రోహత్గీ చదివి వినిపించారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకే ప్రజలు పట్టం కట్టారని కాంగ్రెస్‌ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని ఆయన వాదించారు. ‘తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల పేర్లను గవర్నర్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు. శాసనసభా పక్ష నేత వాటిని బహిర్గతం చేయనక్కర్లేదు. ఆ పని అసెంబ్లీలో చేయవచ్చు. మా లెక్క ప్రకారం మాకు మద్దతుంది. రాష్ట్రంలో ఎవరు స్థిరమైన ప్రభుత్వాన్ని అందించగలరో వారితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడం గవర్నర్ విచక్షణాధికారం’ అని రోహత్గీ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం వచ్చిన అభ్యర్థనల్ని గవర్నర్ నిర్ధారించుకోనవసరం లేదని, వాస్తవ పరిస్థితి, స్థిరత్వం, ఎన్నికల్లో అధికార పార్టీని తిరస్కరించారా? అన్నవే గవర్నర్ చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్–జేడీఎస్‌లు సమర్పించిన ఎమ్మెల్యేల జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ సంతకం లేదు. అందువల్ల ఆ జాబితాను పట్టించుకోవడంలో అర్థం లేదు’ అని రోహత్గీ పేర్కొన్నారు. ఫలితాలు తేలకుండానే యడ్యూరప్ప లేఖ రాశారు: సింఘ్వీ ఎక్కువ సభ్యులున్న కూటమిని కాదని.. మెజార్టీ లేని పార్టీని గవర్నర్ ఆహ్వానించడం సరైనదా? కాదా? అన్నదే ఈ కేసులోని అసలు అంశమని కాంగ్రెస్–జేడీఎస్ తరఫు న్యాయవాది సింఘ్వీ వాదించారు. ‘కౌంటింగ్ పూర్తికాకముందే లేదా ఎన్నికల సంఘం ఎమ్మెల్యేలకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడాని కంటే ముందుగానే మే 15 సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌కు యడ్యూరప్ప లేఖ రాశారు. ఆ సమయంలో మెజార్టీ ఎవరిదో ఇంకా స్పష్టంగా తెలియదు. ఆ సమయంలో గవర్నర్‌కు రాసిన లేఖలో తనకు మెజార్టీ ఉందని యడ్యూరప్ప చెప్పకూడదు’ అని అన్నారు. కాంగ్రెస్–జేడీఎస్ సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల విషయంలో తన విచక్షణాధికారాలను గవర్నర్ వినియోగించలేదని కుమారస్వామి తరఫున హాజరైన లాయర్ కపిల్ సిబల్ వాదించారు. ‘ఏ’నా.. ‘బీ’నా? ఎవరిని పిలవాలి?: సుప్రీం ‘ఇక్కడ ఒక వ్యక్తి తమకు మెజార్టీ ఉందని గవర్నర్‌కు చెప్పారు. మరోవైపు మరో వ్యక్తి కూడా ఎమ్మెల్యేల జాబితాతో తమకు మెజార్టీ ఉందని చెప్పారు. ‘ఏ’ ను కాదని ‘బీ’ని, ‘బీ’ని కాదని ‘ఏ’ను దేని ఆధారంగా గవర్నర్ పిలిచారో మనం నిర్ణయించాలి. గతంలో 24 లేదా 48 గంటల్లో బలాన్ని నిరూపించుకోవాలని కోర్టులు ఆదేశించిన సందర్భాలున్నాయి’ అని ధర్మాసనం పేర్కొంది. ఇంతలో రోహత్గీ జోక్యం చేసుకుంటూ బలపరీక్షకు సోమవారం వరకూ తమకు గడువునివ్వాలని కోరగా.. శుక్రవారం లేదా శనివారమే బలపరీక్షకు ఆదేశించాలని కాంగ్రెస్–జేడీఎస్ కూటమి కోర్టును అభ్యర్థించింది. ‘ఎన్నికల్లో ఒక పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు దానికి మొదట అవకాశం ఇవ్వాలని సర్కారియా కమిషన్ పేర్కొంది. ఒకవేళ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న పార్టీల కూటమికి మెజార్టీ వస్తే దానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి. ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్న పార్టీలకు తర్వాత అవకాశం కల్పించారు’ అని బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు వాదనలు వినిపించగా.. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి తరఫున పి.చిదంబరం కూడా వాదించారు. సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు.. ► శనివారం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలి. ► సాయంత్రం 4 లోగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి కావాలి. ► విశ్వాస పరీక్ష సందర్భంగా రహస్య బ్యాలెట్ విధానాన్ని అవలంబించకూడదు. ► బలపరీక్ష కన్నా ముందు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను నామినేట్ చేయకూడదు. ► విశ్వాస పరీక్ష కార్యక్రమాన్ని ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారు. భద్రత ఏర్పాట్లను డీజీపీ స్వయంగా పర్యవేక్షించాలి. ► బల నిరూపణ జరిగేంతవరకు ప్రభుత్వం పాలన నిర్ణయాలు తీసుకోకూడదు.(‘పాలనపరమైన నిర్ణయాలు తీసుకునే సమయం తనకు(యడ్యూరప్పకు) ఉండదు లెండి. వేరే పనుల్లో ఆయన బిజీగా ఉంటారు కదా’– జస్టిస్ సిక్రీ సరదా వ్యాఖ్య) ► సభలో బల నిరూపణ ద్వారానే మెజారిటీ తేలుతుంది. ► ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ యడ్యూరప్పకు గవర్నర్ పంపిన లేఖ రాజ్యాంగ బద్ధతపై తరువాత విచారణ జరుపుతాం. ► 24 లేదా 48 గంటల్లో బలనిరూపణ చేసుకోవాలంటూ ఆదేశించిన దాఖలాలు గతంలోనూ ఉన్నాయి. -
బలనిరూపణా.. ప్రజాభిప్రాయ సేకరణా?
సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను టీఆర్ఎస్ నేతలు బలనిరూపణ కార్యక్రమంగా మార్చారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బాధితులతో బలవంతంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టిస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ చట్టం–2013ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో భూనిర్వాసితులకు నష్టపరిహారాన్ని తగ్గించడం దారుణమని జీవన్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచి, కాంట్రాక్టర్లకు వేల కోట్లు కట్టబెడుతున్న ప్రభుత్వం భూ నిర్వాసితులపై అరాచకాలకు, దాడులకు పాల్పడటం బాధాకరమన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు భేషజాలకు పోకుండా రైతులను ఆదుకోవాలనే, కాపాడుకోవాలనే విశాలమైన దృక్పథంతో ఆలోచించాలని కోరారు. -
బలనిరూపణ నేడే
► 132 మంది మద్దతుపై ఎన్డీయే ధీమా ► సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం ► బీజేపీ నుంచి సుశీల్ మోదీ ప్రమాణం ► ఏ నిర్ణయమైనా బిహార్ కోసమే: నితీశ్ కుమార్ పట్నా/న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ (66) గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ నితీశ్తోపాటుగా బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీతోనూ ప్రమాణం చేయించారు. బిహార్ ప్రగతిని దృష్టిలో పెట్టుకునే కూటమినుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రమాణ స్వీకారం అనంతరం నితీశ్ వెల్లడించారు. కాగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు బిహార్ అసెంబ్లీలో నితీశ్ బలనిరూపణ చేసుకోనున్నారు. బీజేపీ సంపూర్ణ మద్దతు తెలపటంతోపాటుగా ఎన్డీయేలోని ఇతర పక్షాలు కూడా మద్దతివ్వటంతో విశ్వాస పరీక్షలో నితీశ్ విజయం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. నితీశ్ నిర్ణయంపై జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మహాకూటమినుంచి వైదొలిగే అంశంపై తనను సంప్రదించకపోవటాన్ని శరద్ యాదవ్ తప్పుపట్టినట్లు తెలుస్తోంది. జేడీయూ రాజ్యసభ ఎంపీలు వీరేం ద్ర కుమార్, అలీ అన్వర్ కూడా నితీశ్ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇవేవీ పార్టీ బలనిరూపణపై ప్రభావం చూపబోవని జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వానికి 132 మంది ఎమ్మెల్యేల మద్దతుందన్నారు. ఘనంగా ఎన్డీయేలోకి.. బిహార్ సీఎంగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్.. ‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా బిహార్ ప్రజల మేలుకోసమే. ఇది పార్టీ సమష్టి నిర్ణయం. మేమంతా ప్రజలకోసం మరింత చిత్తశుద్ధితో పనిచేస్తాం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను రాజకీయ అవకాశవాదిగా పేర్కొనటంపై స్పందిస్తూ.. ‘రాహుల్ వ్యాఖ్యలకు సరైన సమయంలో సమాధానమిస్తాం’ అని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే సుపరిపాలన తిరిగి ప్రారంభమైందని సుశీల్ మోదీ (ఉప ముఖ్యమంత్రి) తెలిపారు. ‘గత 20 నెలలుగా రాష్ట్రంలో కొంత స్తబ్దత నెలకొంది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్లీ రాష్ట్రంలో అభివృద్ధి పట్టాలెక్కుతుంది’ అని ఆయన తెలిపారు. ప్రమాణ స్వీకారం కాగానే.. ‘బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి పార్లమెంటు ఉభయసభల్లో మా సంపూర్ణ మద్దతుంటుంది’ అని జేడీయూ ప్రకటించింది. అటు ప్రధాని మోదీ మరోసారి నితీశ్, సుశీల్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమితో దోస్తీ చారిత్రక తప్పిదం బిహార్‌లో తాజా మార్పులపై బీజేపీ పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిపెద్ద పార్టీ అయినా ప్రభుత్వ ఏర్పాటుకోసం తమకు అవకాశం ఇవ్వకపోవటంపై నిరసన తెలుపుతున్నట్లు ఆర్జేడీ ప్రకటించింది. ఆర్జేడీతో కలవటం జేడీయూ చేసిన అతిపెద్ద తప్పిదమని కేసీ త్యాగి తెలిపారు. అందుకోసం చింతిస్తున్నామన్నారు. సీబీఐ కేసులనుంచి తప్పించుకునేందుకు కేంద్ర మంత్రులతో లాలూ రహస్య మంతనాలు జరిపారని, నితీశ్ సర్కారును పడగొట్టేందుకు కుట్రపన్నారని త్యాగి విమర్శించారు. కాగా, బుధవారం అర్ధరాత్రి దాటాక గవర్నర్‌ను కలిసిన ఎన్డీయే బృందం.. నితీశ్‌కు మద్దతుగా 132 మంది (జేడీయూ 71, బీజేపీ 53, ఆర్ఎల్ఎస్పీ 2, ఎల్జేపీ 2, హెచ్ఏఎం 1, ముగ్గురు స్వతంత్రులు) ఎమ్మెల్యేల జాబితాను అందజేసింది. పలువురు ఆర్జేడీ శాసనసభ్యులు తమతో టచ్‌లో ఉన్నారని జేడీయూ నేతలంటున్నారు. ‘నా నా కర్తే’: అఖిలేశ్ బీజేపీతో నితీశ్ దోస్తీపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యంగా స్పందించారు. 1965 నాటి బాలీవుడ్ పాట ‘నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే..’ (వద్దు వద్దంటూనే మీతో ప్రేమలో పడ్డాను) పాట నితీశ్‌కు సరిపోతుందని ట్విటర్లో విమర్శించారు. బీజేపీపై విమర్శలు చేస్తూనే.. ఆ పార్టీతోనే నితీశ్ దోస్తీ కుదుర్చుకున్నారని విమర్శించారు.