సుప్రీంకోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ న్యాయవాది సింఘ్వీ
న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయం అంతిమ ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో శనివారం యడ్యూరప్ప సర్కారు బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడమే సమస్యకు పరిష్కారమని తేల్చింది. బల నిరూపణ కోసం యడ్యూరప్ప సర్కారుకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును పక్కనపెడుతూ శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష జరపాలంది. యడ్యూరప్ప సర్కారు ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కాంగ్రెస్–జేడీఎస్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ఉదయం విచారణ కొనసాగింది. ‘యడ్యూరప్పకు బలముందో లేదో సభే నిర్ణయిస్తుంది. దీనికి సరైన పరిష్కారం బలపరీక్షే’ అని జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీం బెంచ్ పేర్కొంది.
జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ భూషణ్‌లు సభ్యులుగా ఉన్న ఈ బెంచ్.. రహస్య బ్యాలెట్ పద్ధతిలో బలనిరూపణకు అనుమతి ఇవ్వాలన్న యడ్యూరప్ప విజ్ఞప్తిని తోసిపుచ్చింది. బలపరీక్షలో ఓటు వేసేలా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యేను నామినేట్ చేయవద్దని కర్ణాటక ప్రభుత్వాన్ని, ఆ రాష్ట్ర గవర్నర్‌ను ఆదేశించింది. సభ విశ్వాసం పొందేవరకూ కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఎలాంటి కీలకమైన విధానపర నిర్ణయాలు తీసుకోకూడదని ఆదేశించింది. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని విచారిస్తామని తెలిపింది. నేడు జరిగే బలపరీక్ష సందర్భంగా చట్టానికి లోబడి ప్రొటెం స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీ వెలుపల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.
మెజార్టీకి సంబంధించిన అంశం..సభలోనే నిరూపించుకోవాలి: సుప్రీం
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం ఉన్న తమను కాదని బీజేపీని గవర్నర్ వజూభాయ్ ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్–జేడీఎస్‌లు సుప్రీంను ఆశ్రయించడం తెల్సిందే. ఆ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంలో వాదనలు కొనసాగాయి. కాంగ్రెస్–జేడీఎస్‌ల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం, యడ్యూరప్ప, బీజేపీ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ‘అంతిమంగా చూస్తే ఈ అంశం మెజార్టీకి సంబంధించింది. దానిని సభలోనే నిరూపించుకోవాలి’ అని కోర్టు అభిప్రాయపడింది. మే 12న కర్ణాటకలోని 222 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 స్థానాలు సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 112 స్థానాలు అవసరం కాగా.. 117 ఎమ్మెల్యేల బలమున్న తమను కాదని, అప్రజాస్వామికంగా గవర్నర్ బీజేపీని ఆహ్వానించారనేది కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ఆరోపణ.
గవర్నర్ విచక్షణాధికారం: ముకుల్ రోహత్గీ
పిటిషన్ విచారణ సందర్భంగా తమకే మెజార్టీ ఉందని బీజేపీ, కాంగ్రెస్–జేడీఎస్ కూటములు కోర్టుకు తెలిపాయి. వాటి తరఫున హాజరైన న్యాయవాదుల వాడివేడి వాదనలతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగింది. గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సరికాదని కాంగ్రెస్–జేడీఎస్‌లు వాదించగా.. ఆ కూటమి సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖలు వివాదాస్పదంగా ఉన్నాయని బీజేపీ అభ్యంతరం తెలిపింది. హెచ్‌డీ కుమార స్వామిని తమ నేతగా పేర్కొంటూ కాంగ్రెస్–జేడీఎస్‌లు సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల విశ్వసనీయతను రోహత్గీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించాలని గవర్నర్‌కు యడ్యూరప్ప రాసిన లేఖల్ని ఆయన కోర్టుకు సమర్పించారు. ‘మేం అతిపెద్ద పార్టీగా అవతరించాం. మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. మాకు ఇతరుల మద్దతు ఉంది’ అని మే 16న గవర్నర్‌కు యడ్యూరప్ప రాసిన లేఖలోని సారాంశాన్ని రోహత్గీ చదివి వినిపించారు.
అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకే ప్రజలు పట్టం కట్టారని కాంగ్రెస్‌ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని ఆయన వాదించారు. ‘తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల పేర్లను గవర్నర్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు. శాసనసభా పక్ష నేత వాటిని బహిర్గతం చేయనక్కర్లేదు. ఆ పని అసెంబ్లీలో చేయవచ్చు. మా లెక్క ప్రకారం మాకు మద్దతుంది. రాష్ట్రంలో ఎవరు స్థిరమైన ప్రభుత్వాన్ని అందించగలరో వారితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడం గవర్నర్ విచక్షణాధికారం’ అని రోహత్గీ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం వచ్చిన అభ్యర్థనల్ని గవర్నర్ నిర్ధారించుకోనవసరం లేదని, వాస్తవ పరిస్థితి, స్థిరత్వం, ఎన్నికల్లో అధికార పార్టీని తిరస్కరించారా? అన్నవే గవర్నర్ చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్–జేడీఎస్‌లు సమర్పించిన ఎమ్మెల్యేల జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ సంతకం లేదు. అందువల్ల ఆ జాబితాను పట్టించుకోవడంలో అర్థం లేదు’ అని రోహత్గీ పేర్కొన్నారు.
ఫలితాలు తేలకుండానే యడ్యూరప్ప లేఖ రాశారు: సింఘ్వీ
ఎక్కువ సభ్యులున్న కూటమిని కాదని.. మెజార్టీ లేని పార్టీని గవర్నర్ ఆహ్వానించడం సరైనదా? కాదా? అన్నదే ఈ కేసులోని అసలు అంశమని కాంగ్రెస్–జేడీఎస్ తరఫు న్యాయవాది సింఘ్వీ వాదించారు. ‘కౌంటింగ్ పూర్తికాకముందే లేదా ఎన్నికల సంఘం ఎమ్మెల్యేలకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడాని కంటే ముందుగానే మే 15 సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌కు యడ్యూరప్ప లేఖ రాశారు. ఆ సమయంలో మెజార్టీ ఎవరిదో ఇంకా స్పష్టంగా తెలియదు. ఆ సమయంలో గవర్నర్‌కు రాసిన లేఖలో తనకు మెజార్టీ ఉందని యడ్యూరప్ప చెప్పకూడదు’ అని అన్నారు. కాంగ్రెస్–జేడీఎస్ సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల విషయంలో తన విచక్షణాధికారాలను గవర్నర్ వినియోగించలేదని కుమారస్వామి తరఫున హాజరైన లాయర్ కపిల్ సిబల్ వాదించారు.
‘ఏ’నా.. ‘బీ’నా? ఎవరిని పిలవాలి?: సుప్రీం
‘ఇక్కడ ఒక వ్యక్తి తమకు మెజార్టీ ఉందని గవర్నర్‌కు చెప్పారు. మరోవైపు మరో వ్యక్తి కూడా ఎమ్మెల్యేల జాబితాతో తమకు మెజార్టీ ఉందని చెప్పారు. ‘ఏ’ ను కాదని ‘బీ’ని, ‘బీ’ని కాదని ‘ఏ’ను దేని ఆధారంగా గవర్నర్ పిలిచారో మనం నిర్ణయించాలి. గతంలో 24 లేదా 48 గంటల్లో బలాన్ని నిరూపించుకోవాలని కోర్టులు ఆదేశించిన సందర్భాలున్నాయి’ అని ధర్మాసనం పేర్కొంది. ఇంతలో రోహత్గీ జోక్యం చేసుకుంటూ బలపరీక్షకు సోమవారం వరకూ తమకు గడువునివ్వాలని కోరగా.. శుక్రవారం లేదా శనివారమే బలపరీక్షకు ఆదేశించాలని కాంగ్రెస్–జేడీఎస్ కూటమి కోర్టును అభ్యర్థించింది. ‘ఎన్నికల్లో ఒక పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు దానికి మొదట అవకాశం ఇవ్వాలని సర్కారియా కమిషన్ పేర్కొంది. ఒకవేళ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న పార్టీల కూటమికి మెజార్టీ వస్తే దానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి. ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్న పార్టీలకు తర్వాత అవకాశం కల్పించారు’ అని బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు వాదనలు వినిపించగా.. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి తరఫున పి.చిదంబరం కూడా వాదించారు.
సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు..
► శనివారం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలి.
► సాయంత్రం 4 లోగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి కావాలి.
► విశ్వాస పరీక్ష సందర్భంగా రహస్య బ్యాలెట్ విధానాన్ని అవలంబించకూడదు.
► బలపరీక్ష కన్నా ముందు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను నామినేట్ చేయకూడదు.
► విశ్వాస పరీక్ష కార్యక్రమాన్ని ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారు. భద్రత ఏర్పాట్లను డీజీపీ స్వయంగా పర్యవేక్షించాలి.
► బల నిరూపణ జరిగేంతవరకు ప్రభుత్వం పాలన నిర్ణయాలు తీసుకోకూడదు.(‘పాలనపరమైన నిర్ణయాలు తీసుకునే సమయం తనకు(యడ్యూరప్పకు) ఉండదు లెండి. వేరే పనుల్లో ఆయన బిజీగా ఉంటారు కదా’– జస్టిస్ సిక్రీ సరదా వ్యాఖ్య)
► సభలో బల నిరూపణ ద్వారానే మెజారిటీ తేలుతుంది.
► ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ యడ్యూరప్పకు గవర్నర్ పంపిన లేఖ రాజ్యాంగ బద్ధతపై తరువాత విచారణ జరుపుతాం.
► 24 లేదా 48 గంటల్లో బలనిరూపణ చేసుకోవాలంటూ ఆదేశించిన దాఖలాలు గతంలోనూ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment