హైదరాబాద్‌లో కర్ణాటకం | Congress, jds MLAs Stays In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కర్ణాటకం

Published Sat, May 19 2018 4:52 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress, jds MLAs Stays In Hyderabad - Sakshi

శుక్రవారం ప్రత్యేక బస్సులో తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకున్న కర్ణాటక ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటకం హైదరాబాద్‌కు చేరింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను శుక్రవారం ఉదయం భాగ్యనగరానికి తరలించాయి. తొలుత కేరళలోని కొచ్చికి వెళ్లాలని భావించినా చివరికి హైదరాబాద్‌నే ఎంచుకున్నారు. ఉదయం తొమ్మిది గంటలకల్లా ఇరుపార్టీల ఎమ్మెల్యేలంతా రాజధానిలోని తాజ్‌కృష్ణ, నోవాటెల్‌ హోటళ్లకు ప్రత్యేక బస్సుల్లో చేరిపోయారు. జేడీఎస్‌ పేరిట మాదాపూర్‌ నోవాటెల్‌లో 36 గదులను, కాంగ్రెస్‌ పేరిట తాజ్‌కృష్ణలో 120 గదులు బుక్‌ చేశారు. ఒక్కో గదిలో ఒక్కో ఎమ్మెల్యేను ఉంచారు. మిగతా గదులను ఇరుపార్టీల కీలక నేతలు, వ్యూహకర్తలు, సీనియర్‌ లీడర్లకు అప్పగించారు. ఓ ఇండిపెండెంట్‌తో కలిపి కాంగ్రెస్‌ నుంచి 77 మంది, జేడీఎస్‌ నుంచి 36 మంది ఎమ్మెల్యేలు వచ్చారు.

హుటాహుటిన రాష్ట్ర నేతలు..
ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ తరలించాలని కాంగ్రెస్‌–జేడీఎస్‌ గురువారం అర్ధరాత్రి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అప్రమత్తమయ్యారు. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ కర్ణాటక ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వస్తున్నారన్న సమాచారంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలంతా ఈ రెండు హోటళ్ల వద్దకు భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్ణాటక ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తూ వారికి కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఉదయం 8 గంటల నుంచే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హోటల్‌కు చేరుకొని కర్ణాటక ఎమ్మెల్యేలకు కావాల్సిన సదుపాయాలను పర్యవేక్షించారు. అర్ధరాత్రి సమయంలోనే కర్ణాటక ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌కు చేరుకుంటారని భావించారు. కానీ తర్వాత తాజ్, నోవాటెల్‌ హోటళ్లను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల క్యాంపులో ఎక్కడా ఎవరూ సెల్‌ఫోన్‌ వాడకుండా ఇరు పార్టీలు జాగ్రత్తలు వహించాయి. బస చేస్తున్న హోటళ్లలోని ల్యాండ్‌లైన్‌ నుంచి కూడా ఫోన్‌కాల్‌ బయటకు వెళ్లే అవకాశం లేకుండా చేసినట్టు తెలిసింది. తాజ్‌కు చేరుకున్న ఎమ్మెల్యేల్లో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

సాయంత్రం సిద్దరామయ్య రాక..
శుక్రవారం సాయంత్రం 4.15 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన్ను రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు, ఎమ్మెల్యేలు ఆహ్వానించి తాజ్‌ హోటల్‌కు తీసుకువచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో హోటల్‌ చేరుకున్న సిద్దరామయ్య.. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌అలీ, భట్టి విక్రమార్క, గీతారెడ్డి, వీహెచ్, కన్నడ పార్టీ కీలక నేత డీకే శివకుమార్, కేపీసీసీ చీఫ్‌ పరమేశ్వర్, వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. 5.30 గంటల సమయంలో కన్నడ కాంగ్రెస్‌ ఎల్పీ సమావేశం నిర్వహించారు. శనివారం బలనిరూపణ సమయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై సిద్దరామయ్య ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం ముగియనుండగా 5.50 గంటల సమయంలో జేడీఎస్‌ నేత కుమారస్వామి తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. కన్నడ పీసీసీ నేతలతో భేటీ అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఆయన నోవాటెల్‌కు వెళ్లారు. కాగా తాజ్‌లో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశంలో సిద్దరామయ్యను ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నోవాటెల్‌లో కుమారస్వామి, రేవణ్ణ
ఒకవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య సమావేశం నిర్వహించగా.. అంతకుముందే జేడీఎస్‌ నేత కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ నోవాటెల్‌లో వారి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. జేడీఎస్‌ నుంచి ఒక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు తిప్పుకునేందుకు చేస్తున్న వ్యూహాలను కుమారస్వామి వారికి వివరించారు. కాంగ్రెస్, జేడీఎస్‌ పొత్తుతో ప్రభుత్వం ఏర్పడుతుందని, ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో దేవెగౌడ రేవణ్ణకు ఫోన్‌ చేసి మాట్లాడారు. బీజేపీ నుంచి పొత్తు ప్రతిపాదన రావడం, సున్నితంగా తిరస్కరించిన అంశాలను కుమారస్వామి, రేవణ్ణకు ఆయన వివరించినట్టు తెలిసింది.

గొడవ చేయొద్దు.. సస్పెండ్‌ చేస్తారు..
తమ ఎమ్మెల్యేలకు జేడీఎస్, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు కీలక సూచనలు చేశారు. శనివారం అసెంబ్లీలో జరగబోయే బలనిరూపణ సమయంలో బీజేపీ... ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగి సస్పెన్షన్‌ ప్లాన్‌ వేసిందని వివరించారు. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేను నియమించడం వెనుకున్న ఆంతర్యం కూడా ఇదేనని, దీనిపైనా శుక్రవారం రాత్రి సుప్రీంకు వెళ్తున్నట్టు సిద్ద రామయ్య, కుమారస్వామి తమ పార్టీల ఎమ్మెల్యేలకు సూచించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉండాలని, సహనం పాటించాలని పేర్కొన్నారు.

ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ?
కాంగ్రెస్, జేడీఎస్‌ క్యాంపులో ఇద్దరు ఎమ్మెల్యేలు మిస్‌ అయ్యారన్న ప్రచారంతో ఇరుపార్టీల నేతలు కలవరానికి గురయ్యారు. గెలిచినప్పట్నుంచే ఆనంద్‌సింగ్, ప్రతాప్‌గౌడ పాటిల్‌ ఇద్దరూ పార్టీకి దూరంగా ఉన్నట్టు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించారు. అయితే వీరిలో ఆనంద్‌ సింగ్‌ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడని, ప్రతాపగౌడ పాటిల్‌ బీజేపీ అధీనంలో ఉన్నట్టు తెలిపారు. అలాగే ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు ముగ్గురిలో బీఎస్పీకి చెందిన శేఖర్‌ సైతం హైదరాబాద్‌ చేరుకున్నారని, మరో ఇద్దరు బెంగళూరులోనే ఉన్నారని సమావేశంలో ప్రకటించారు. ఈ ముగ్గురు కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమికి మద్దతు తెలుపుతారని సిద్దరామయ్య ఎమ్మెల్యేలకు వివరించారు.

బీజేపీ నెగ్గే అవకాశం లేదు: కుమారస్వామి
బలపరీక్షలో బీజేపీ నెగ్గే అవకాశం లేదని కుమారస్వామి ధీమాగా చెప్పారు. శుక్రవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీకి సంఖ్యాబలం లేదన్నారు. ‘ఆపరేషన్‌ కమల’కు చిక్కకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉన్నారనీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఏకతాటిపై నిలబడ్డారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఒకవేళ బీజేపీ ‘ఆపరేషన్‌ కమల’ చేపడితే,   ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను తాము లాక్కుంటామని హెచ్చరించారు. సంఖ్యాబలం లేకపోయినా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నతాధికారులను బదిలీ చేశారని కుమారస్వామి ఆరోపించారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌ వద్ద మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. గవర్నర్‌ రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం దారుణం. మా కూటమి ఎమ్మెల్యేలంతా ఒక్క తాటిపై ఉన్నారు’ అని చెప్పారు.

బస ఖర్చు భారీగానే..
హైదరాబాద్‌లో కాంగ్రెస్‌–జేడీఎస్‌ క్యాంపు ఖర్చు భారీగానే ఉంది. తాజ్‌లో అప్పటికప్పుడు రూం బుక్‌ చేయాలంటే కనీసం రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఖర్చవుతుంది. భోజనం, ఇతర ఖర్చులన్నీ కలిపి 24 గంటలకు రూ.30 వేల వరకు ఖర్చవుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అంటే 120 గదులకు ఒక్కరోజుకే రూ.36 లక్షలు అవుతుంది. అలాగే నోవాటెల్‌లో ఒక్కో గదికి రూ.9 వేల చొప్పున కాగా.. భోజనం, తదితర ఖర్చులు మరో రూ.6 వేలకు పైగా అయినట్టు తెలిసింది. ఇలా ఆ పార్టీ ఎమ్మెల్యేల బసకు రూ.5.5 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఖర్చయినట్టు తెలిసింది. ఇవి కాకుండా ప్రయాణం, మధ్యలో భోజనం, ఇతర ఖర్చులకు కూడా భారీగానే వెచ్చించినట్టు సమాచారం. ఒక్క రోజు క్యాంపు మొత్తం ఖర్చు రెండు పార్టీలకు కలిపి రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా అవుతుందని టీపీసీసీ, కేపీసీసీ నేతలు చర్చించుకున్నారు.

అర్ధరాత్రి బెంగళూరుకు..
తాజ్‌లో బస చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాత్రి 8.40 గంటల ప్రాంతంలో డిన్నర్‌ చేశారు. అర్ధరాత్రి సమయంలో హోటల్‌ నుంచి మూడు బస్సుల్లో బెంగళూరు శివారులోని ఈగల్‌ రిసార్ట్‌కు వెళ్లారు. నోవాటెల్‌లో 9.30 గంటలకు భోజనం చేసి జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాత్రి 10 గంటలకు రెండు బస్సులో ఈగల్‌ రిసార్ట్‌కు బయల్దేరారు. కుమారస్వామి కారులో.. సిద్దరామయ్య ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు.

మొరాయించిన బస్సు
కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో తాజ్‌కృష్ణ వద్దకు వచ్చిన ఓ బస్సు హోటల్‌ లోపలికి వెళ్లేందుకు మొరాయించింది. 22 మంది ఎమ్మెల్యేలు లోపల ఉండగా బస్సు దిగేందుకు తలుపులు కూడా తెరుచుకోలేదు. దీంతో తాజ్‌కృష్ణ హోటల్‌ ముందు ట్రాఫిక్‌ స్తంభించింది. ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎలాగోలా ఎమ్మెల్యేలను బస్సు నుంచి బయటకు తీసుకొచ్చి భారీ బందోబస్తు మధ్య హోటల్‌ లోపలికి చేర్చారు. చెడిపోయిన బస్సు రోడ్డుపై రెండు గంటలు అలాగే ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బాత్‌రూంలో ఎమ్మెల్యేలు.. హైరానా!
సిద్దరామయ్య, కుమారస్వామి ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కనిపించలేదు. అదే సమయంలో కర్ణాటక నుంచి ఓ బీజేపీ ఎమ్మెల్యే హోటల్‌లోకి వచ్చాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీంతో మధుయాష్కీని కుమారస్వామి అప్రమత్తం చేశారు. 200 మంది యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు హోటల్‌ను జల్లెడ పట్టారు. మరో 200 మంది కార్యకర్తలను హోటల్‌ చుట్టూ మోహరించారు.  చివరికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. బాత్‌రూంకు వెళ్లారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలోనూ ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కిందకు రాకపోవడంతో హైడ్రామా నడిచింది. గదుల్లోనూ లేకపోవడం, భోజనానికి రాకపోవడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. 20 నిమిషాల తర్వాత వారు ప్రత్యక్షం కావడంతో శాంతించారు.


                        తాజ్‌కృష్ణలో సిద్దరామయ్య, కుమారస్వామితో జానారెడ్డి తదితరులు


                                        తాజ్‌కృష్ణ వద్ద రోడ్డుపై నిలిచిపోయిన బస్సు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement