సీఎం కొడుకే రెచ్చగొట్టే ప్రకటనలా?
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో విద్వేషాలను రెచ్చగొట్టడం తీవ్రమైన నేరమని, ప్రజాప్రతినిధులే ప్రజలను రెచ్చగొట్టడం తీవ్రమైన చర్యగా భావించాలని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టాలన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, చట్టాలను అతిక్రమించమే అవుతుందన్నారు. ఎదుటి వారిపై దాడి చేయమనడం కూడా నేరమేనని, దాడి చేసిన వారి కంటే చేయమని ప్రోత్సహించేవారే చట్టం దృష్టిలో మొదటి నేరస్థులని అన్నారు.
ప్రభుత్వ యంత్రాంగాలను పూర్తిగా నిర్వీర్యం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలతో ట్రాక్టర్లను అందిస్తే వాటిని టీఆర్‌ఎస్ కార్యకర్తలకు అందించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి కుమారుడే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. మంత్రుల రెచ్చగొట్టే మాటలను నమ్మి, ప్రభుత్వ నియంత్రణ సరిగ్గా లేకపోవడంతో, తమ పనులు జాప్యం కావడాన్ని తట్టుకోలేక గతంలో కొందరు ఆవేశంగా మాట్లాడితే వారిపై కేసులు నమోదు చేసిన విషయాన్ని మర్చిపోలేదన్నారు.
అసెంబ్లీలో, బయటా ప్రభుత్వ అవినీతిపై ఎవరు ప్రశ్నించినా అభివృద్ధికి అడ్డం వస్తున్నారని అధికార పార్టీ ఎదురుదాడి చేస్తున్న విషయం ప్రజలందరికి తెలుసునన్నారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, తమ ప్రభుత్వం నీతివంతమైనదని డబ్బా కొట్టుకోవడానికే కేటీఆర్ ఇతర మంత్రులు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రుల మాటలు నమ్మి సాధారణ ప్రజలు కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేయాలని ఇంద్రసేనారెడ్డి విజ్ఞప్తి చేశారు.