సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ అధిష్టానం శనివారం ప్రకటించింది. ఇటీవల 10 మందితో తొలి జాబితాను ప్రకటించగా.. రెండో జాబితాలో ఆరుగురికి స్థానం కల్పించింది. మెదక్ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోయం బాబురావును ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిపింది. పెద్దపల్లి నుంచి ఎస్.కుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, బెల్లంపల్లి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన కొయ్యల ఏమాజీ పేర్లను అధిష్టానానికి పార్టీ రాష్ట్ర కమిటీ పంపింది.
అయితే, సింగరేణి కార్మికుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గోదావరి ఖనికి చెందిన ఎస్.కుమార్ వల్ల ఓట్ల శాతం పెరుగుతుందని భావించిన అధిష్టానం ఆయనకే సీటు కేటాయించింది. జహీరాబాద్ సీటు కోసం బానాల లక్ష్మారెడ్డి, బిష్కిం ద పీఠాధిపతి సోమాయప్పల పేర్లును పరిశీలించిన అధిష్టానం ఈసారి బానాల లక్ష్మారెడ్డికే అవకాశం కల్పించింది. హైదరాబాద్ స్థానం నుంచి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బరిలో నిలపాలని భావించినా ఆయన విముఖత చూపారు. దీంతో భగవంతరావుకు సీటు కేటాయించింది. చేవెళ్ల నుంచి పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి, బెక్కరి జనార్దన్‌రెడ్డి, వికారాబాద్ జిల్లాకు చెందిన నందకుమార్ యాదవ్‌ల పేర్లను పరిశీలించి జనార్దన్‌రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పించింది.
లోక్‌సభ అభ్యర్థులు..
అదిలాబాద్ (ఎస్టీ): సోయం బాబూరావు; పెద్దపల్లి (ఎస్సీ): ఎస్.కుమార్; జహీరాబాద్: బానాల లక్ష్మారెడ్డి; హైదరాబాద్: డా.భగవంతరావు; చేవెళ్ల: బెక్కరి జనార్దన్‌రెడ్డి; ఖమ్మం: వాసుదేవ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment