ఒకవైపు ఖాళీ అయిన సమ్మర్ స్టోరేజీ ట్యాంకు
కర్నూలు (టౌన్)/ఓల్డ్‌సిటీ: కర్నూలు నగరానికి తాగునీటి ముప్పు ముంచుకొస్తోంది. వారం రోజుల్లో ప్రత్యామ్నాయం చూపకపోతే తీవ్ర కష్టాలు తప్పవు. ఇప్పుడే నగరంలోని శివారు కాలనీలకు వారం రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. అది కూడా ట్యాంకర్ల ద్వారానే. చాలాప్రాంతాల్లో కుళాయిలు బంద్ అయ్యాయి. నీటి కష్టాల వల్ల వ్యాపార సముదాయాలు, హోటళ్లను సైతం మూసేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అన్నపూర్ణ హోటల్ మూత పడింది. డబ్బు పెట్టినా నీళ్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో హోటల్‌ను తాత్కాలికంగా మూసేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్యూరిఫైడ్ వాటర్ ధరకు రెక్కలొచ్చాయి. క్యాన్ వాటర్ రూ.30–40 మధ్య విక్రయిస్తున్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మరో వారం రోజుల్లో పూర్తిగా ఖాళీ కానుంది.ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించడం లేదు.
సుంకేసుల, జీడీపీ వెలవెల
నగర తాగునీటి అవసరాలకు ప్రధానమైన సుంకేసుల, గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) ఇప్పటికే డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. వీటి నుంచి నెల క్రితమే నీటి సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నీటిని మాత్రమే నగరవాసులకు సరఫరా చేస్తున్నారు. ఇది కూడా డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఫిల్టర్ బెడ్‌కు కూడా సరిగా నీరందని పరిస్థితి. ఇందులో ప్రస్తుతమున్న నీటి మట్టం చూస్తే వారంలోపే పరిస్థితులు మరింత దిగజారే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. 2005వ సంవత్సరంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో 14 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి నీటినిల్వ తగ్గిపోయింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొనకపోతే కర్నూలు వాసులకు 2001 సంవత్సరం నాటి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండేళ్లుగా ఇబ్బందులు
వర్షాభావ పరిస్థితుల వల్ల గత రెండేళ్లుగా కర్నూలు వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు. గత ఏడాది వేసవిలో సుంకేసుల డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా పందికోన రిజర్వాయర్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని తరలించారు. అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు సరఫరా చేసి నగర వాసులను కష్టాల నుంచి గట్టెక్కించారు. ఈ ఏడాది కూడా వర్షాలు లేక నగరవాసులకు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డిమాండ్‌కు తగినట్లు తాగునీటిని సరఫరా చేయకపోవడంతో ఇప్పటికే ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతిరోజూ నగర ప్రజలకు 83 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాలి. ప్రస్తుతం నగరపాలక సంస్థ 69 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది.
కాలనీల్లో కటకట
కర్నూలు నగరంలోని పలు కాలనీల్లో ఇప్పటికే నీటి సమస్య ఉధృతరూపం దాల్చింది. శివారు కాలనీలైన మామిదాలపాడు, మునగాలపాడు, స్టాంటన్‌పురం, బాలాజీ నగర్, మమతానగర్, సమతానగర్, సోనియాగాంధీ నగర్ వంటి అనేక కాలనీలలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పాతబస్తీ నుంచి కొత్త కాలనీలు, కల్లూరు కాలనీలలో నాలుగు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. పాతబస్తీలోని చిత్తారిగేరికి మూడు రోజులు, పెద్దపడఖానాకు ఐదు రోజులుగా నీళ్లు రావడం లేదు.
రొటేషన్ ప్రకారం పాతబస్తీలోని పలు కాలనీలకు మంగళవారం నీళ్లు రావాలి. కానీ ట్యాంకులోకే నీళ్లు ఎక్కలేదంటూ లైన్‌మెన్లు చేతులెత్తేశారు. అధికారులు నీటి ట్యాంకర్లు పంపినా అందరికీ అందడంలేదు. కర్నూలు, కల్లూరు ఏరియాలో ఉన్న మొత్తం 23 ఓవర్ హెడ్ ట్యాంకుల్లోనూ పూర్తి స్థాయిలో నీటిని నింపలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. నగర పాలక సంస్థకు చెందిన 8 ట్యాంకర్లతో పాటు 23 ప్రైవేటు ట్యాంకర్లను ఏర్పాటు చేసి.. ఫిర్యాదులు వస్తున్న కాలనీలకు నీటిని సరఫరా చేస్తున్నారు. పెరిగిన నగర జనాభాకు అనుగుణంగా మరొక సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మిస్తే తప్ప వేసవి కష్టాలు తీరవు.
ఎస్‌ఎస్ ట్యాంకులో నీరు 7 రోజులకు సరిపోతుంది
సుంకేసుల, జీడీపీ నుంచి నెల క్రితమే నీళ్లు బంద్ అయ్యాయి. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి అందిస్తున్నాం. ప్రస్తుతం ఈ ట్యాంకులో 301.72 లక్షల లీటర్ల నీరు ఉంది. ఇది వారం రోజులకు మాత్రమే సరిపడుతుంది. ఆ తరువాత ఇబ్బందిగా ఉంటుంది. ఎల్లెల్సీ నుంచి నీటిని వదిలినట్లు సమాచారం ఉంది.
– వేణుగోపాల్, నగరపాలక ఎస్‌ఈ
5 రోజులుగా రావడం లేదు
పెద్దపడఖానాలోని పాఠశాల ప్రాంతానికి నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదు. శుక్రవారం నీళ్లు పట్టుకున్నాం. ఆదివారం కొందరికే వచ్చాయి. తిరిగి మంగళవారం సరఫరా చేయాలి. కానీ బిందె నీళ్లు కూడా రాలేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి?
– అయ్యమ్మ
Comments
Please login to add a commentAdd a comment