నీరొచ్చే దారేది?
=విశాఖ, తూ.గో. సరిహద్దు ప్రజలకు నీటి సరఫరాపై అయోమయం
=చురుగ్గా తుని, పాయకరావుపేట ప్రాజెక్టు పనులు
=ఏలేరు నుంచే నీరంటున్న ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు
=ఆమోదం లేదంటున్న ఏలేరు రిజర్వాయర్ అధికారులు
=మరోసారి తెరపైకి తాండవ ప్రతిపాదన
తాగునీటి సరఫరాపై ఎడతెగని సందిగ్ధం. నీరు ఎక్కడ నుంచి ఇవ్వాలన్నదానిపై అంతులేని అయోమయం.. ఇది తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దు నియోజకవర్గాల్లోని తీర ప్రాంత గ్రామాల తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన అంశం. ఈ గ్రామాలకు అందించే తాగునీటిని ఏలేరు నుంచి తీసుకుంటారా? లేక తాండవ నుంచే సరఫరా చేస్తారా? అన్నది ఖరారు కాక అలముకున్న గందరగోళం... ఇదీ జిల్లాలోని ఓ ప్రాంతంలో నీటి సరఫరాకు సంబంధించి నెలకొన్న వాతావ‘రణం’!
నర్సీపట్నం, న్యూస్‌లైన్: తూర్పు గోదావరి జిల్లాలోని తుని, విశాఖ జిల్లాలోని పాయకరావుపేట నియోజక వర్గాల్లో సుమారు 150 తీర ప్రాంత గ్రామాలకు తాగునీటిని అందించే విషయం ఇప్పుడు ఓ చిక్కుముడిలా మారుతోంది. నీటి సరఫరా కోసం ప్రభుత్వం రూ. 56 కోట్లు మంజూరు చేసినా నీటి సరఫరా ఎక్కడి నుంచి చెయ్యాలోనన్నది ఎడతెగని చర్చకు దారితీస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి వద్ద ప్రస్తుతం స్టోరేజీ ట్యాంకు నిర్మితమవుతోంది. దీనికి నీటి సరఫరా కోసం అప్పుడే పైప్ లైన్ పనులు మొదలయ్యాయి. అయితే నీరెక్కడి నుంచి సరఫరా చేయాలన్నది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది.
అల్లిపూడి ట్యాంకుకు తాండవ నుంచి నీటిని అందించడానికి గతంలో ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దీనిపై అప్పట్లో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఆందోళనలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అయితే నీటి సరఫరా ఎక్కడి నుంచన్నది మళ్లీ మొదటికొచ్చింది. తాండవకు ప్రత్యామ్నాయంగా ఏలేరు కాలువ నుంచి నీటిని తీసుకుని ఈ గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలని అధికారులు ప్రతిపాదించారు. దాంతో ప్రస్తుతం తుని వైపు కాలువ పనులు పూర్తయ్యాయి. పాయకరావుపేట పైపులైను పనులు ప్రారంభమయ్యాయి.
ఏలేరుపై చూపులు
తాండవకు ప్రత్యామ్నాయంగా ఏలేరు కాలువ నుంచి నీటిని తీసుకునేందుకు నీటిపారుదల శాఖ ఆమోదం తెలిపిందని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు అంటున్నారు. నాతవరం మండలం గొలుగొండపేట వద్ద విస్తరించి ఉన్న ఏలేరు కాలువ నుంచి రెండు నియోజకవర్గాలకు 0.015 టీఎంసీల వంతున నీటిని తీసుకుని పైపులైను ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తామని వివరిస్తున్నారు. కానీ నీటిపారుదల, ఏలేరు అధికారులు దీనిని తిరస్కరిస్తున్నారు.
ఏలేరు నుంచి తాగునీటిని అందించే ప్రతిపాదన వచ్చినా, దీనిని ఆమోదించలేదని ఏలేరు రిజర్వాయరు అధికారి సుధాకర్ చెబుతున్నారు. పైగా ఏలేరు కాలువ ప్రస్తుతం జీవీఎంసీ ఆధీనంలో ఉంది. విశాఖ నగరం ప్రజల దాహం తీర్చడానికి, పరిశ్రమలకు నీటిని సరఫరా చేయడానికి మాత్రమే ఏలేరు కాలువ నీరు వినియోగపడుతోంది. తుని, పాయకరావుపేట ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలని కలెక్టర్ ద్వారా ఇప్పటికే ప్రతిపాదన అందగా, దీనిని విశాఖ పరిశ్రమలు, తాగునీటి అవసరాల కమిటీ (విస్కో) తిరస్కరించింది.
ప్రస్తుతం స్టోరేజీ ట్యాంకుతో పాటు దిగువన ఉన్న పైపులైను పనులు మాత్రమే చేస్తున్నారు. అధికారులు బయటకు ఏలేరు నుంచే నీరును తీసుకుంటున్నట్టు చెబుతున్నా ఆ కాలువ సమీపంలో ఎటువంటి పనులు చేపట్టకపోవడంతో తాండవ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైకి ఏలేరు కాలువ నుంచే నీరని చెబుతూ, తాండవ నీటి సరఫరా ప్రతిపాదనను మరోసారి ప్రభుత్వం ముందుంచినట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కోటనందూరులో జరిగిన తాండవ రైతుల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రాగా, సమస్యను సమైక్యంగా ఎదుర్కోవాలని తీర్మానించారు.